ఆసియా కప్ గ్రూప్ A మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే అసలు ఆట ఫలితం కన్నా.. రెండు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. మ్యాచ్ తర్వాత భారత్ ఆటగాళ్లు , పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. టాస్ సమయంలో కూడా షేక్ హ్యాండ్ జరగలేదు.
భారత ఆటగాళ్లపై పాకిస్తాన్ టీమ్ మేనేజర్ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ వల్లే ఇదంతా జరిగిందని ఆయనను టోర్నీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తోంది. టాస్ సమయంలో రెండు కెప్టెన్లు “షేక్ హ్యాండ్ చేయవద్దు” అని రిఫరీ సూచించారు. మ్యాచ్ తర్వాత అదే కొనసాగింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైక్రాఫ్ ను టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఆటల్లోకి రాజకీయాలు తీసుకు రావడం తప్పని పీసీబీ అంటోంది. మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించింది.
తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని అవమానంగా పాకిస్తాన్ భావిస్తోంది. అయితే భారత్ లో మ్యాచ్ విషయంలో వ్యతిరేకత ఉంది. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడవద్దన్న డిమాండ్లు వినిపించాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు తమ నిరసన తెలియచేయడానికి ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ కు సరైన సమాధానం ఇచ్చామని కెప్టెన్ సూర్యకుమార్ అన్నారు. మొత్తంగా పాకిస్తాన్.. ఈ అవమానాన్ని సాకుగా చూపి.. టోర్నమెంట నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వివాదంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా స్పందించలేదు.


