భారత్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలుస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ఐదు రోజుల సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతినిధులు, సుందర్ పిచాయ్ , సామ్ ఆల్ట్‌మన్ వంటి దిగ్గజ సీఈఓలు హాజరయ్యారు. సాఫ్ట్వేర్ స్థానాన్ని ఏఐ భర్తీ చేయబోతున్న ఈ కీలక సమయంలో, భారత్ కేవలం ఒక వినియోగదారు దేశంగానే మిగిలిపోతుందా లేక సృష్టికర్త గా ఎదుగుతుందా అన్న చర్చ ఇప్పుడు టెక్ ప్రపంచంలో జరుగుతోంది.
ప్రపంచ మేధస్సు మనది.. సంస్థలు వారివి
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల్లోని ఏఐ ప్రాజెక్టుల వెనుక భారతీయుల మేధస్సు కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయులు అభివృద్ధి చేస్తున్న ఈ టెక్నాలజీ లాభాలు మాత్రం విదేశీ కార్పొరేట్ సంస్థలకే చేరుతున్నాయి. మన దేశంలో ప్రతిభ ఉన్నప్పటికీ, మేడ్ ఇన్ ఇండియా ఏఐ టూల్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో మన వ్యవస్థ ఇంకా వెనుకబడే ఉంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహా మౌలిక సదుపాయాలు, నిధుల లభ్యత ఇక్కడ లేకపోవడం ప్రధాన లోపంగా మారుతోంది.
మౌలిక సదుపాయాల లోటు – చిప్ కొరత
ఏఐ రంగంలో భారత్ చైనా, అమెరికాలను ఢీకొట్టాలంటే కేవలం కోడింగ్ తెలిసిన వ్యక్తులు ఉంటే సరిపోదు, భారీ స్థాయిలో కంప్యూటింగ్ పవర్ ( అవసరం. మన దేశంలో హై-ఎండ్ జీపీయూ చిప్‌ల కొరత , డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేవు. భారత్ డేటా పరంగా ధనిక దేశం. ప్రపంచ డేటాలో 20 శాతం మనదే అయినప్పటికీ, ఆ డేటాను ప్రాసెస్ చేసి సొంత మోడల్స్‌ను తయారు చేయడానికి అవసరమైన హార్డ్‌వేర్ కోసం మనం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతున్నాం.
భారత ఏఐ ప్రయాణం – సవాళ్లు
ప్రస్తుత సమ్మిట్‌లో భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా రూ. 10,300 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. అయితే అమెరికా, చైనా వెచ్చిస్తున్న నిధులతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. మన మేధావులు విదేశీ కంపెనీలకు ఆకర్షితులవ్వడం, ఇక్కడ స్టార్టప్‌లకు సరిపడా భారీ వెంచర్ క్యాపిటల్ అందకపోవడం వల్ల సంచలన స్టార్టప్‌లు మన గడ్డ మీద పుట్టడం కష్టమవుతోంది. ప్రపంచానికి మేధస్సును ఎగుమతి చేస్తున్నాం కానీ, దాని ఫలితాలను మాత్రం దిగుమతి చేసుకుంటున్నాం అనే నిట్టూర్పులు అందుకే వినిపిస్తున్నాయి. కానీ భవిష్యత్ మాత్రం ఆశాజనంగా ఉంది. ఈ సదస్సులో ఆవిష్కరించిన భారత్‌జెన్ వంటి స్వదేశీ ఏఐ నమూనాలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. సాఫ్ట్వేర్ సర్వీస్ రంగంలో భారత్ ఎలాగైతే ప్రపంచాన్ని శాసించిందో, అదే స్థాయిలో ఏఐ ప్రోడక్ట్ డెవలప్మెంట్ రంగంలోనూ నిలదొక్కుకోవాలంటే, ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి, ప్రతిభావంతులు ఇక్కడే ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
