భారత దేశ రాజకీయాల్లో ఎన్నికలు అనేది నిరంతరం జరిగే పండుగల్లా ఉంటాయి. ఆరు నెలల గ్యాప్‌తో ఏదో ఓ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నర కాలంలోనే హర్యానా, జమ్మూకశ్మీర్, బీహార్ , మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. నిన్నామొన్నటి వరకూ బీహార్ ఎన్నికల హడావుడి ఉంది. ఇప్పడు కొత్తగా ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. మార్చి, ఏప్రిల్‌లో అత్యంత కీలక రాష్ట్రాలు అయిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరగనున్నాయి . ఎన్నికల రాజకీయాలు చేయడానికే పూర్తి సమయం కేటాయించే బీజేపీ పెద్దలు ఇప్పటికే అసలు రాజకీయం ప్రారంభించారు.
మొదట కేంద్ర కేబినెట్ మార్పు చేర్పులు
సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు రాబోయే రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటుంది. మార్చి, ఏప్రిల్ లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఈ సారి బీజేపీ చాలాసీరియస్ గా తీసుకుంటుంది. బెంగాల్ లో గెలిచితీరాలని అనుకుంటోంది. అస్సాంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని.. తమిళనాడు, కేరళల్లో ఉనికిని బలంగా చాటాలనుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేసి ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలకు కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
గత ఏడాది కాలంగా పనితీరు సరిగ్గా లేని మంత్రులను తప్పించి, యువతకు, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫిబ్రవరిలో ప్రకటించే బడ్జెట్లో ఆ రాష్ట్రాలకు వరాలే !
ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించనున్న తదుపరి ఏడాది బడ్జెట్లో ఐదురాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా టార్గెట్ పెట్టుకున్న బెంగాల్ పై వరాలవర్షం కురిసే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఇప్పటికే పదిహేనేళ్లుగా సీఎంగాఉన్నారు. ఆమెపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని.. సామాజిక సమీకరణాలు, బడ్జెట్ తాయిలాలతో ఘన విజయం సాధించాలని అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేరళలోనూ…హిందూత్వం వైపు మారుతున్న తమిళనాడులోనూ ఆశలు పెట్టుకుంటున్న బీజేపీ.. .బడ్జెట్లో వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త ఏడాదిలో నాలుగైదు నెలల పాటు ఎన్నికల వేడి
ఎప్పుడూ ఏదో ఓ ఎన్నికలు జరుగుతూ ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిదో కాదో చెప్పలేం కానీ.ఎన్నికల వల్ల రాజకీయాలు మాత్రం వాడివేడిగా సాగుతూ ఉంటాయి. రాజకీయ నేతల ఖర్చుల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది . అప్పటిదాకా దోచుకున్నవారు మళ్లీ రాజకీయాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలకు ఎంతో కొంత పంచుతారు. ఇలాంటివి జరిగినప్పుడే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ఎందుకు.. ఇలా నిరంతరం ఎన్నికల పండుగలు ఉంటే మంచిదికదా అనిఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు.
