ప్రస్తుత ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం భారత విదేశాంగ విధానానికి పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది. ఒకప్పుడు అలీన విధానం పాటించిన భారత్, ఇప్పుడు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి పేరుతో తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణంపై ప్రధాని మోదీ అధికారికంగా సంతాపం తెలపకపోవడం, ఇతర దేశాలకు బాహాటంగా మద్దతు ప్రకటించకపోవడం అనేక చర్చలకు దారి తీస్తోంది.
మిత్రధర్మం vs జాతీయ ప్రయోజనం
ఒకప్పుడు ఇరాన్ భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారు . చాబహార్ ఓడరేవు వంటి ప్రాజెక్టుల ద్వారా అత్యంత సన్నిహిత మిత్రుడు. అయితే, గత దశాబ్ద కాలంలో సమీకరణాలు వేగంగా మారాయి. అమెరికాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఇజ్రాయెల్‌తో ఉన్న సాంకేతిక, వ్యూహాత్మక బంధం భారత్‌ను ఒక రకమైన సంకట స్థితిలోకి నెట్టాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణంపై సంతాపం తెలపకపోవడం అంటే.. అది అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం కాదు, కేవలం ఉగ్రవాద ముద్ర ఉన్న శక్తులకు దూరంగా ఉంటూ, ప్రపంచ వేదికపై బాధ్యతాయుతమైన దేశంగా కనిపించే ప్రయత్నం మాత్రమేనని అనుకోవచ్చు.
ఆయిల్ దిగుమతులు తగ్గితే పెను సమస్య
ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గించుకున్న భారత్, ఇప్పుడు రష్యా, ఇతర గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా గల్ఫ్ లో ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగితే భారత్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అందుకే, భారత్ ఏ ఒక్క పక్షాన నిలబడకుండా యుద్ధం వద్దు – చర్చలే శరణ్యం అనే మంత్రాన్ని పఠిస్తోంది. ఇరాన్‌ను పూర్తిగా వదులుకోలేక, అటు అమెరికాను నొప్పించలేక భారత్ పాటిస్తున్న ఈ మౌనం.. ఒక రకమైన వ్యూహాత్మక నిరీక్షణ గా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ తో స్నేహం
ఇజ్రాయెల్ భారత్‌కు నమ్మకమైన రక్షణ భాగస్వామి. కార్గిల్ యుద్ధం నుండి నేటి వరకు ఇజ్రాయెల్ అందించిన ఆయుధ సంపత్తి భారత్‌కు ఎంతో కీలకం. అదే సమయంలో అమెరికా రూపంలో ఉన్న భారీ పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను భారత్ పణంగా పెట్టలేదు. అందుకే, ఇరాన్ పై దాడులను భారత్ ఖండించలేదు, అలాగని సమర్థించలేదు. భారత విదేశాంగ శాఖ విడుదల చేసే ప్రకటనల్లో ప్రాంతీయ సుస్థిర అనే పదం తప్ప, ఎక్కడా నిర్దిష్ట దేశం పేరును ప్రస్తావించలేదు. ఏ రాజకీయ మద్దతు కంటే కూడా భారత్‌కు గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటిన్నర మంది భారతీయుల రక్షణే అత్యంత ప్రధానం. యుద్ధం ముదిరితే వారిని తరలించడం ప్రభుత్వానికి హిమాలయ పర్వతాన్ని ఎక్కడం వంటి సవాలు. ఒకవేళ భారత్ ఏదో ఒక దేశానికి బహిరంగంగా మద్దతు ఇస్తే, గల్ఫ్ లోని ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల భద్రత ప్రమాదంలో పడుతుంది. అందుకే, మోదీ ప్రభుత్వం నిశ్శబ్ద దౌత్యం ద్వారా తెర వెనుక చర్చలు జరుపుతూ, తన పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటోంది.
వాస్తవాల దిశగా విదేశాంగ విధానం
భారత విదేశాంగ విధానం ఇప్పుడు ఆదర్శాల నుండి వాస్తవాల వైపు మళ్లిందని విశ్లేషిస్తున్నారు. ఒకప్పటిలా భావోద్వేగాలతో కాకుండా, కేవలం దేశ ఆర్థిక, రక్షణ ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే అడుగులు వేస్తోంది. ఇరాన్ పట్ల భారత్ చూపుతున్న ఈ కోల్డ్ షోల్డర్ వెనుక రాబోయే రోజుల్లో అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో మరింత లోతైన బంధాన్ని పెంచుకోవాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భావిస్తున్నారు.