భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ మొదటికొచ్చాయా?

ఈ నెల 15న ఇస్లామాబాద్ లో జరుగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం దాదాపు రద్దయినట్లేనని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పేశారు. ఆ తరువాత తాను అలాగ అనలేదని ఆయన ఖండించినపటికీ, అలాగ అనడం, ఖండించడం కూడా వ్యూహాత్మకంగానే అన్నవేనని భావించవచ్చును. ఎందుకంటే, ఇదివరకు మోడీ లాహోర్ పర్యటన, భారత్-పాక్ సంబందాలపై దాని అద్భుత ప్రభావం గురించి చాల హుషారుగా మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అజిత్ దోవల్ మాటలను ఖండించలేదు..అలాగని సమర్దించలేదు. మౌనం వహించింది. అలాగే మరో నాలుగు రోజులలో ఇస్లామాబాద్ లో జరుగవలసిన సమావేశం గురించి కూడా మాట్లాడటం లేదు. అంటే భారత్ వైఖరినే అజిత్ దోవల్ చెప్పారనుకోవాలి.

సరిగ్గా ఇదే సమయంలో రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ డిల్లీలో సైన్యాదికారుల సమావేశంలో మాట్లాడుతూ “భారత్ పై దాడి చేసి మన సైనికుల ప్రాణాలు తీసుకొన్న ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులు ఎవరయినా సరే, వారు కూడా మనం అనుభవించిన ఈ బాధ, వేదన అనుభవించాల్సిందే. వారు అందుకు మూల్యం చెల్లించాల్సిందే. అది ఎవరో..ఎక్కడో…ఎప్పుడో నిర్ణయించడం కాదు. మనమే వారిని శిక్షించాలి. మనపై శత్రువులు దాడి చేస్తునప్పుడు మన సైనికులు వారికి ఎదురొడ్డి పోరాడుతూ ప్రాణాలు త్యాగాలు చేయడం చాలా గొప్ప విషయమే. కానీ మనం ప్రాణ త్యాగాలు చేయడమే కాదు..శత్రువుల ప్రాణాలు కూడా తీయాలి. వారికి దెబ్బకి దెబ్బ రుచిచూపించాలి అని నేను మన సైనికులకు ఎప్పుడూ చెపుతుంటాను,” అన్నారు.

మనోహర్ పారిక్కర్ మాటలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి. భారత్ పై దాడి చేసినవారిని పట్టుకొని తమకు అప్పగించాలని ఆయన పాకిస్తాన్ కి సూచిస్తున్నారు. అది సాధ్యమో కాదో కాలమే చెపుతుంది.

భారత్ ఇచ్చిన ఈ స్పష్టమయిన సంకేతాలు పాక్ ప్రభుత్వం చక్కగానే అర్ధం చేసుకొందని చెప్పవచ్చును. ‘పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తొందర ఏమీ లేదని’ అమెరికా చెప్పినప్పటికీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోడితో ఫోన్లో మాట్లాడిన తరువాత తన మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి, పఠాన్ కోట్ పై దాడికి కుట్రపన్నిన వారిని పట్టుకొనేందుకు ఇంటలిజన్స్ బ్యూరో, ఇంటర్ సర్వీసస్ ఇంటలిజన్స్,మిలటరీ ఇంటలిజన్స్ లకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసారు. అది అప్పుడే పనిచేయడం ఆరంభించింది కూడా. భారత్ అందించిన సమాచారం మేరకు భావ్లాపూర్ జిల్లా నుండి జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో పాకిస్తాన్ ఎంత నిబద్దత చూపిస్తుందో తెలియదు. కానీ ఇది పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చును. అలాగే ప్రధాని నరేంద్ర మోడి కూడా ప్రజల, ప్రతిపక్షాల మెప్పు పొందడం కోసమో లేకపోతే మీడియాలో ప్రచారం కోసమో ఇస్లామాబాద్ సమావేశాన్ని రద్దు చేసుకోవడం మంచి నిర్ణయం కాదనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమావేశాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఆర్నెల్లో..ఏడాది తరువాతో పాక్ తో చర్చలకు సిద్దమయితే, భారత్ కి ఒక స్థిరమయిన విదేశాంగ విధానం లేదనే విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది.

అలాగే పంతాలకు పోయి ఆర్నెల్లో ఏడాదో ఈ సమావేశం వాయిదా వేసుకొని అప్పుడు మళ్ళీ మొదలుపెడితే, అప్పుడు మాత్రం మళ్ళీ ఇటువంటి దాడి జరగదని నమ్మకం ఏమిటి? ఇటువంటి ఉగ్రవాదుల దాడులకు అడ్డుకట్ట వేయాలంటే పాకిస్తాన్ ప్రజా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం బలమయిన బందం ఏర్పాటు చేసుకొని దానిపై ఒత్తిడి చేయడమే సరయిన మార్గమని చెప్పవచ్చును. ఏదో ఒక సంఘటన జరిగిన ప్రతీసారి పాకిస్తాన్ తో సంబంధాలు తెంపుకొంటూ మళ్ళీ ఆర్నెల్ల తరువాత కలుపుకొనే ప్రయత్నాలు చేస్తుంటే ఎన్ని దశాబ్దాలయిన భారత్-పాక్ దేశాల మధ్య ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఈ బలహీనతని అధిగమించలేకపోతే భారత్-పాక్ దగ్గరవడానికి ప్రయత్నించిన ప్రతీసారి ఉగ్రవాదులు ఇదే బలహీనతపై దెబ్బతీస్తూ తమ వ్యూహం అమలు చేస్తుంటారు. అంతిమంగా దాని వలన నష్టపోయేది భారత్-పాక్ దేశాలే తప్ప ఉగ్రవాదులు కాదు. కనుక మోడీ ప్రభుత్వం సరయిన నిర్ణయం తీసుకొంటుందని ఆశిద్దాము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]