సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ప్రభుత్వాలను అప్రమత్తంగా చేసింది. కీలకమైన చోట్ల భద్రతా ఏర్పాట్లను పెంచింది. అంత వరకూ బాగానే ఉంది కానీ.. జరుగుతున్న ప్రచారం మాత్రం ప్రజల్లో ఆందోళనను పానిక్ స్థాయికి తీసుకెళ్తోంది. ఫేక్ న్యూస్ తో కొంత మంది సొంత దేశంపై దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
యుద్ధం .. యుద్ధం అంటూ జరుగుతున్న ప్రచారంతో ప్రజలు పానిక్ కు గురవుతున్నారు. ఎంతగా అంటే ఓ ఆరు నెలలకు సరిపడా సరుకులు ఇంట్లో తెచ్చిపట్టుకోవాలని హడావుడి పడిపోతున్నారు. స్టోర్ల మీదకు వెళ్లిపోతున్నారు. సాధారణ డిమాండ్ కన్నా ఎక్కువగా ఉండటంతో చాలా వరకూ సూపర్ మార్కెట్లు ఖాళీ అయ్యాయి. పెట్రోల్ , డీజిల్ కూడా అవసరం లేకపోయినా ట్యాంకులు, ట్యాంకులు కొట్టించుకోవడంతో బంకులు ఖాళీ అయ్యాయి. నిజానికి దేశంలో దేనికీ కొరత లేదు. కానీ అనూహ్యమైన డిమాండ్ తో స్టాక్ యార్డులో నుంచి స్టోర్లకు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఇవ్వకుండా కొరత అనే ప్రచారం జరిగేలా పానిక్ క్రియేట్ చేసుకున్నారు.
కాస్త వాస్తవ పరిస్థితి ఆలోచిస్తే పాకిస్తాన్ ..యుద్ధ సామర్థ్యం.. కనీసం ఢిల్లీ దాకా ఉంటుందాలేదా అన్న చెప్పలేం. సరిద్దుల్లో మహా అయితే ఓ ఐదు.. పది కిలోమీటర్ల వరకూ డ్రోన్లు వేయగలదు. దక్షిణభారతం వరకూ ఒక్క మిస్సైల్ కూడా వేయలేదు. యుద్ద విమానాలను కూడా పంపలేదు. చైనాకూ అంత సామర్థ్యం లేదు. దక్షిణ భారత్ కు ఏ వైపు నుంచీ ముప్పు లేదు. యుద్ధం తీవ్రంగా జరిగినా ఆ తీవ్రత దక్షిణం వరకూ రాదు. అయితే ఈ అంశంలో అవగాహన కల్పించలేకపోవడం వల్ల.. పానిక్ కు దారి తీస్తోంది. ఇక్కడే ప్రజలతో పాటు బాధ్యత ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.