భారత్ లో ప్రధానమైన మార్కెట్లలో రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ధరలు. భూముల ధరలు పెరగడం, నిర్మాణ ఖర్చులు పెరగడం మాత్రమే కాదు లగ్జరీ పేరుతో కోట్లకు కోట్లు ఖరీదైన ఇళ్లను మార్కెట్ లోకి ముంచెత్తేస్తూండటంతో డిమాండ్, సప్లయ్ మధ్య తేడా వచ్చేస్తోంది.
ప్రీమియం మరియు లగ్జరీ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాండమిక్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, సంస్కరణలు వల్ల ధనవంతులు, అధిక-ఆదాయ వర్గాల నుంచి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా డెవలపర్లు ప్రీమియం నిర్మాణాలపై దృష్టి పెట్టి, ధరలు పెంచేశారు. వీటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. జులై-సెప్టెంబర్‌లో లగ్జరీ, ప్రీమియం సెగ్మెంట్లలో ధరలు 20 నుంచి 24 శాతం పెరిగాయని హౌసింగ్ డాట్ కామ్ అంచనా వేసింది.
ఈ స్థాయిలో పెరుగుతుందంటే.. విరగడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ధరల పెరుగుదల అందుబాటులో ఉన్న హౌసింగ్ సెగ్మెంట్లో అమ్మకాలను తగ్గించింది. ఫలితంగా అఫోర్డబుల్ హౌసింగ్‌లో సప్లై పరిమితమైంది. ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా లగ్జరీ ప్రాజెక్టుల వైపు దృష్టి సారిస్తున్నాయి. కానీ ఈ సెగ్మెంట్ లో కొనుగోలుదారుల పర్సంటేజీ చాలా తక్కువ. రెండు, మూడేళ్ల తర్వాత కొనేవాళ్లు పూర్తిగా తగ్గిపోతారు. అప్పుడు కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావొచ్చు అని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.