అమెరికా ఉద్దేశపూర్వకంగా ఇండియాను దూరం చేసుకోవడంతో ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా ఒంటరిగా మారుతోంది. అదే సమయంలో ఉప్పు, నిప్పుగా ఉండాల్సిన చైనా, భారత్ దగ్గర అవుతున్నాయి. గల్వాన్ ఘటనతో చెడిపోయిన సంబంధాలు మళ్లీ పునరుద్ధరించుకుంటున్నాయి. ఈ రెండు దేశాలకు రష్యా తోడవుతోంది. ఇది మారనున్న ప్రపంచ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన పరిణామాలుగా నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా ఇమేజ్ ను టాయిలెట్లో వేసేసారన్న మాజీ భద్రతా సలహాలు
అమెరికా దశాబ్దాలుగా పెంచుకుంటూ వస్తున్న మిత్రుల్ని, విదేశాంగ విధానాన్ని ట్రంప్.. చాలా కొద్ది కాలంలోనే నాశనం చేశారన్న అసంతృప్తి అమెరికా రక్షణ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. మాజీ భద్రతా సలహాలు జాక్ ఇదే మాట చెప్పారు. ట్రంప్ అమెరికా ఇమేజ్ ను టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ తో స్నేహాన్ని కోల్పోవడం ఘోర తప్పిదమన్నారు. అదే విధంగా అన్ని దేశాలనూ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును ఆయన విమర్శించారు. ట్రంప్ వల్ల అమెరికా విదేశాంగ విధానంలో తీవ్రమైన నష్టాన్ని చూస్తోందన్నారు.
అమెరికాకు మిత్రపక్షాలే లేకుండా పోయే ప్రమాదం
ప్రపంచపెద్దన్నగా అమెరికాకు గుర్తింపు ఉంది. అది నిన్నటిదాకే. ఇవాళ ఎవరైనా ఆ దేశాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. చివరికి ఇజ్రాయెల్ కూడా ఆసక్తిగా లేదు. ఏదైనా పరస్పర ప్రయోజనాలను బట్టే ఉంటుంది. కానీ అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అందుకే కెనడాసహా ఏ దేశమూ ఇప్పుడు అమెరికాను నమ్మడం లేదు. ట్రంప్ వ్యవహారశైలితో పాటు తీసుకునే నిర్ణయాలు కూడా ఇందులో భాగమే. ఇప్పుడు అమెరికాకు ఒక్కటంటే ఒక్క మిత్రపక్షం దేశం లేదు. కానీ అమెరికాకు వ్యతిరేకంగా అగ్రరాజ్యాలు ఏకమయ్యే అవకాశం ఉంది.
ట్రంప్ వ్యక్తిగత స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారా ?
నోబుల్ బహుమతి పిచ్చిలో ఉన్న ట్రంప్ వ్యక్తిగత స్వార్థం కోసం అమెరికాతో ఆడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి.. యుద్ధాన్ని ఆపేశానన్న క్రెడిట్ కొట్టేసేందుకు ఆయన ప్రయత్నించారు. భారత్ అంగీకరించలేదు. ఇప్పుడు మోడీ ఆయన ఫోన్లు కూడా ఎత్తడం లేదు. అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన నమ్మకాన్ని ఆయన పూర్తిగా తొలగించారు. ఈ నష్టం అమెరికాకు దీర్ఘకాలంలో ఉంటుంది.