విశాఖలో జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో టీమిండియా సఫారీలపై సవారీనే చేసింది. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆధిపత్యం చూపించలేకపోయారు. ఓ మాదిరి భారీ స్కోరును ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి… 10 ఓవర్లు మిగిలి ఉండగానే ఇండియా ఛేజ్ చేసింది. సిరీస్ గెల్చుకుంది.
ఇరవై వన్డేల తరవాత భారత కెప్టెన్ టాస్ గెలిచారు. దీంతో ప్రత్యర్థికి బ్యాటింగ్ లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్లలో రాణించిన మార్కరమ్, బాష్ లాంటి వాళ్లు ఈ మ్యాచ్ లో తేలిపోయారు. గత మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి దడదడలాడించిన మార్కరమ్ ను ఈ సారి మిడిల్ ఆర్డర్ లో పంపడం ఆ జట్టుకు నష్టం చేసింది. ఓపెనర్ గా వచ్చిన డికాక్ సెంచరీ చేసినా.. ఇంకెవరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. పైగా వరుసగా వికెట్లు కోల్పోయారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీశారు.
271 పరుగుల లక్ష్యంతో పరుగుల వేట ప్రారంభించిన టీమిండియాకు ఏ దశలోనూ సఫారీ బౌలర్ల సవాల్ చేయలేకపోయారు. ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ దూకుడుగా ఆడారు. 75 పరుగులు చేసి రోహిత్ ఔటరయ్యారు. తరవాత వచ్చిన కోహ్లి 65 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. జైస్వాల్ 116 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరు ముగ్గురూ సిక్సర్లు, ఫోర్లతో హడలెత్తించడంతో నలభై ఓవర్లు పూర్తికాక ముందే మ్యాచ్ ముగిసింది.
ఇక టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఐదు టీ ట్వంటీల సిరీస్.. తొమ్మితో తేదీన కటక్ నుంచి ప్రారంభమవుతుంది.