“ప్రపంచం మొత్తం వృద్ధాప్యం వైపు వెళ్తుంటే, భారత్ యవ్వనంతో ఉట్టిపడుతోంది. 800 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ ప్రపంచంలో, మన యువత కష్టపడే తత్వమే భారత్‌ను విశ్వగురువు స్థానంలో కూర్చోబెడుతుంది.”
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ చెప్పే మాట ఇది. ఆయన దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేది యువతే అని చెబుతూంటారు. న్యూఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్నే కాదు.. గత ఏడాది మొత్తం జరిగిన పరిణామాల్ని విశ్లేషించుకుంటే మన దేశ యువతే మనకు బలం అని అర్థం అవుతోంది. కానీ ఆ బలం సరైన దిశగా దేశానికి ఉపయోగపడుతోందా అన్న ప్రశ్న సహజంగా అందరికీ వస్తుంది. ప్రధాని మోదీ చెప్పింది అక్షర సత్యం. యువతే మన దేశ బలం. కానీ వారేం చేస్తున్నారు…? ఆ యువత సరైన దారిలో వెళ్తోందా ? అన్నదే అసలు విషయం. ఓ చిన్న టీవీ ఆర్టిస్టు ఓ సెల్ ఫోన్ షాపు ప్రారంభానికి వస్తే పది వేల మంది గుమికూడతారు. తోసుకుంటారు. అసలు ఆ టీవీ ఆర్టిస్టు గొప్పతనం ఏమిటి…. మా కంటే ఎందులో గొప్ప అని ఒక్కరూ ఆలోచించరు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. కానీ ఈ యువశక్తి సంపద సరైన దిశలో వెళ్తోందా? లేదా అర్థం లేని ఆకర్షణలకు బలైపోతోందా అన్నది ఇలాంటి యువతను చూసినప్పుడు అందరూ బాధపడుతూ ఉంటారు.
పనిచేసే యువత ఉండటమే భారత్ బలం
ప్రస్తుతం ప్రపంచం ఒక విచిత్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జపాన్, చైనా, జర్మనీ , ఇటలీ వంటి దేశాల్లో జనాభా వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తుండగా, భారతదేశం మాత్రం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుల దేశంగా ఉంది. రాబోయే రెండు దశాబ్దాల పాటు ప్రపంచానికి అవసరమైన మేధావులను, కార్మికులను సరఫరా చేసే ఏకైక దేశం భారత్ మాత్రమేనని అంతర్జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి , అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.5 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఏర్పడుతుంది. చైనాలో పని చేసే వయస్సు ఉన్న జనాభా ఏటా లక్షల్లో తగ్గిపోతోంది. 2050 నాటికి అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు వృద్ధులే ఉంటారు. జపాన్‌లో ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ చేసేవారు లేరు. మరోవైపు, భారతదేశ సగటు వయస్సు కేవలం 28.4 ఏళ్లు. మన దేశంలో దాదాపు 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారే. అంటే ప్రపంచం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, భారత్ ఉత్పాదక శక్తితో ఉట్టిపడుతుంటుంది. కేవలం జనాభా ఉంటే సరిపోతుందా?. ఆ జనాభాలో.. యువతలో అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్న ఆసక్తి.. ఉండాలి కదా?. ఇప్పుడు మన దేశ యువతకు అలాంటి ఆసక్తి ఎంత ఉందంటే చెప్పడం కష్టం. దానికి మన కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాలే సాక్ష్యాలు.
ఎవరినో ఆరాధించడానికా జీవితం?
యువత ఒక ప్రవహించే నది లాంటిది. దానికి ఆనకట్ట కట్టి సరైన దిశ చూపిస్తే భూమిని సస్యశ్యామలం చేస్తుంది. అదే నియంత్రణ లేకపోతే వినాశనాన్ని సృష్టిస్తుంది. భారతదేశానికి యువతే వెన్నెముక అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ నేటి వాస్తవ పరిస్థితులు అలా లేవు. ఒక చిన్న టీవీ నటుడు వచ్చినా, ఒక సినిమా ప్రమోషన్ జరిగినా, లేదా ఒక మాల్ ప్రారంభోత్సవం అన్నా.. లక్షల సంఖ్యలో యువత రోడ్ల మీదకు రావడం దేనికి సంకేతం? తమ అమూల్యమైన సమయాన్ని ఒక అపరిచిత వ్యక్తిని చూడటానికో లేదా సెల్ఫీ కోసమో గంటల తరబడి వేచి చూడటం అంటే, మన యువత తమ విలువను తామే తగ్గించుకుంటున్నారని అర్థం. నేటి యువతలో హీరోయిజం పట్ల ఒక విపరీతమైన తప్పుడు అవగాహన ఉంది. తెరపై కనిపించే నటుడికి భజన చేయడం, నచ్చిన రాజకీయ పార్టీకి ఊడిగం చేయడం, చదువు మానేసి బలాదూర్ గా తిరగడం, బైకులపై స్టంట్లు చేయడం సాహసం అనుకుంటున్నారు. కానీ నిజమైన హీరోయిజం అంటే.. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించడం, తండ్రి పడుతున్న కష్టాన్ని తగ్గించడం, సమాజానికి ఉపయోగపడే ఒక నూతన ఆవిష్కరణ చేయడం. వివేకానందుడు చెప్పిన ఒక ఆశయాన్ని తీసుకో, దానినే నీ జీవితం చేసుకో, దాని గురించే ఆలోచించు, దానినే కలగను.. నీ మెదడు, కండరాలు, నరాలు అన్నీ ఆ ఆశయంతోనే నిండిపోవాలి అనే మాటలు నేటి యువతకు చదువు కంటే ఎక్కువగా అవసరం. కానీ ఈ మాటలు నేటి యువత వినడం లేదు. క్లాస్ రూమ్ లో లెక్చరర్ని ఆటపట్టించే క్యారెక్టర్ చేసే హీరోలనే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
కెరీర్ గురించి ఆలోచించమని చెప్పేవారు కమెడియన్లా?
మాల్స్ ఓపెనింగ్స్ కు, సినిమా ఫంక్షన్లకు లక్షల మంది ఎగబడుతున్నారు కానీ, అదే సమయంలో లైబ్రరీల్లోనో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలోనో యువత పత్తా ఉండటం లేదు. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ కు, లైకులకు బానిసలై.. రోజుకు కనీసం 5 నుండి 6 గంటల సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, శ్రమించే తత్వం తగ్గిపోతోంది. పక్కన ఉన్న చెత్తను తీయడానికి ముందుకు రాని వారు, తమ అభిమాన హీరో కోసం ఫ్లెక్సీలు కట్టడానికి మాత్రం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఇది ఎంతటి సామాజిక విషాదం ?. చదువు అంటే కేవలం సర్టిఫికెట్ల వేటగా మారిపోయింది. చదువు అనేది సమాచారాన్ని మెదడులో నింపడం కాదు, అది శీలాన్ని నిర్మించాలి, జీవనోపాధిని ఇవ్వాలి” అని వివేకానంద బోధించారు. కానీ నేడు డిగ్రీలు ఉన్నాయి కానీ నైపుణ్యం లేదు. విజ్ఞానం కంటే వినోదానికే పెద్దపీట వేస్తున్నారు. తమ సొంత ఎదుగుదల కంటే, ఎవరో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో చర్చలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ వైఖరి వల్ల వ్యక్తిగతంగా యువత నష్టపోవడమే కాకుండా, దేశం కూడా ఒక గొప్ప మానవ వనరును కోల్పోతోంది. ఒక సామాన్య మధ్యతరగతి తండ్రి తన కొడుకు లేదా కూతురు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో చెమటోడ్చుతాడు. కానీ యువత ఆ శ్రమను గుర్తించకుండా, గాలివాటం రాజకీయాలకు, వెండితెర మెరుపులకు ఆకర్షితులవుతున్నారు. నీవు నీ కుటుంబానికి హీరో కాలేనప్పుడు, ప్రపంచానికి హీరో కావాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కన్నవారి కళ్లలో ఆనందం చూడటమే అతిపెద్ద విజయం అని యువత ఎప్పుడు గుర్తిస్తుందో అప్పుడు వారి జీవితాలతో పాటు దేశ భవిష్యత్ కూడా పురోగతి వైపు వెళ్తుంది.
ఓ టీవీ నటుడ్ని ఆరాధనగా చూసినప్పుడు అతని జీవితాన్ని అధ్యయనం చేయాలి. అతనిలాగా ఎందుకు ఎదుగకూడదో తెలుసుకోవాలి. ప్రయత్నించాలి. జీవితంలో ఏమి సాధించాలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కాలం ఎవరికోసం ఆగదు. వృథా చేసిన ప్రతి నిమిషం నీ విజయానికి ఒక అడుగు దూరం చేస్తుంది. సినిమాల్లోకి వెళ్లవచ్చు.. రాజకీయాల్లోకి వెళ్లవచ్చు కానీ అది డబ్బు సంపాదించాలనో.. విద్వేషంతోనే కాదు..అభిరుచితోనే రావాలి. ఆ రంగంలో ఆసక్తి ఉంటే.. అందులో ఎదిగేందుకు ప్రయత్నించాలి. అప్పుడు జయమో,అపజయమో వస్తుంది. కానీ ప్రయత్నించకపోతే ఏదీరాదు. బలమే జీవనం, బలహీనతే మరణం అని వివేకానందుడు చెబుతారు. సంఖ్య పరంగా మనం బలంగా ఉన్నప్పటికీ, యువత తమ సమయాన్ని సోషల్ మీడియా ఆకర్షణలకు, పనికిరాని వ్యసనాలకు కేటాయిస్తే ఈ గొప్ప అవకాశం చేజారిపోతుంది. 21వ శతాబ్దం భారత్‌దే కావాలంటే.. యువత కీబోర్డ్ మీద వేళ్లను, వర్క్‌షాపుల్లో మేధస్సును నిరంతరం కదిలించాలి. అక్షరాస్యతను ‘అధికారిక శక్తి’గా మార్చుకున్న రోజే.. ప్రపంచం భారత పాదాల చెంత నిలుస్తుంది. దేశం అంటే మట్టి కాదు.. దేశం అంటే మనుషులు. అందరూ ఎవరికి వారు అభివృద్ధి చెందితే.. ఆటోమేటిక్‌గా దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే భారతదేశం మళ్లీ విశ్వగురువు కావాలంటే అది కేవలం యువత చేతుల్లోనే ఉంది. మీరు గొర్రెల్లా ఎవరో ఒకరి వెనుక నడవకండి. మీరొక నాయకుడిలా ఎదగండి. మిమ్మల్ని చూసి పదిమంది స్ఫూర్తి పొందాలి తప్ప, మీరు ఎవరో సెలబ్రిటీ సెల్ఫీ కోసం పడిగాపులు కాయకూడదు.
మనం వినియోగదారులం కాదు.. సృష్టికర్తలం !
భారత యువత కేవలం వినియోగదారులుగా కాకుండా ప్రపంచ గమనాన్ని శాసించే సృష్టికర్తలుగా మారాలంటే ముందుగా తమ ప్రాధాన్యతలను మార్చుకోవాలి. ఇతరుల రీల్స్‌ను చూడటం, సినిమా హీరోల వ్యక్తిగత విషయాలపై చర్చించడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా మెదడులోని సృజనాత్మకత నశించిపోతుంది. యువత ఈ మాయాజాలం నుండి బయటపడాలంటే, డిజిటల్ ప్రపంచాన్ని కేవలం వినోదం కోసం కాకుండా ఒక విజ్ఞాన గని గా చూడటం నేర్చుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లోని అవకాశాలను గమనించాలి. యువత తమ స్మార్ట్ఫోన్లను కేవలం స్క్రోలింగ్ చేయడానికి కాకుండా, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆయుధాలుగా మలచుకోవాలి. ఒక సినిమా హీరో చేసే పోరాటం కంటే, ఒక సాఫ్ట్వేర్ కోడ్ ద్వారా లేదా ఒక నూతన ఆవిష్కరణ ద్వారా సమాజంలోని సమస్యను పరిష్కరించడంలోనే అసలైన హీరోయిజం ఉందని గుర్తించాలి. ఆలోచనలను ఆచరణలో పెట్టే ‘స్టార్టప్’ సంస్కృతి ప్రతి పల్లెకూ చేరాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తన కుటుంబానికి ,దేశానికి తానే ఒక ఆశాకిరణం కావాలనే సంకల్పం యువతలో కలగాలి. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు తాత్కాలికమే కానీ, మనం సృష్టించే వస్తువు లేదా సేవ అందించే గుర్తింపు శాశ్వతం. యువత విద్వేషాన్ని, వ్యసనాన్ని వీడి విజ్ఞానం వైపు అడుగులు వేస్తే, భారతదేశం ప్రపంచానికి కేవలం కార్మికులను మాత్రమే కాదు, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను సృష్టించే మేధావులను కూడా అందిస్తుంది.
“లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి.” వివేకానందుడి ఈ పిలుపును కేవలం గోడల మీద రాసుకోవడం కాదు, గుండెల్లో నింపుకోవాలి. అప్పుడే ఈ దేశానికి, మీ కుటుంబానికి , మీకు సరైన న్యాయం జరుగుతుంది. మత్తును వీడు.. మహోన్నత ఆశయం వైపు అడుగు వేయి. నీ గమ్యం నీ కోసమే కాదు, దేశం కోసం కూడా!
