సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ను భూమండలం మీద లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీప్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 త్వరలోనే ఉందన్నారు. రాజస్తాన్ లోని ఓ ఆర్మీ క్యాంప్ ను సందర్శించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని పాటించామని ఈ సారి అలా జరగదన్నారు. పాకిస్తాన్ రెచ్చగొడితే దెబ్బతినాల్సిందేనని స్పష్టం చేశారు. భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా లేదా అని పాకిస్తాన్ పై మండిపడ్డారు. ప్రపంచపటంలో ఉండాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేయాల్సి ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
పాకిస్తాన్ ఇప్పటికీ కుట్రలకు పాల్పడుతోందన్న సమాచారం భారత ప్రభుత్వానికి వస్తోంది. అందుకే రాజ్ నాథ్ సింగ్ కూడా ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా అదే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు ఉందన్న కారణంగా పాకిస్తాన్ రెచ్చిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి పాకిస్తాన్ పై తిరుగులేకుండా దెబ్బకొట్టేలా ఇప్పటికే భారత్ సన్నద్ధత ప్రారంభించిందని రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ల మాటల ద్వారా స్పష్టమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.