ఆకాశంలో మరో విషాదం. మలేషియా విమానాల గల్లంతు వార్తలు మరువక ముందే, ఇండోనేషియా విమానం ప్రమాదానికి గురైంది. గల్లంతైన విమాన శకలాలు కొండల్లో కనిపించాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది కలిపి విమానంలో మొత్తం 54 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఎంత మంది క్షేమంగా ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.
త్రిగణ ఎయిర్ సర్వీస్ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు జయపురలోని సెంతని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. 3.16కు ఓక్సిబిల్ కు చేరుకోవాల్సి ఉంది. కానీ 2.55 గంటల ప్రాంతంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం ఏమైందనేది అంతుపట్టలేదు. సముద్రంలో కూలిపోయిందా లేక దారి మళ్లి మరో దిక్కు ప్రయాణించిందా అర్థం కాలేదు. అయితే పపువా రాష్ట్రంలోని ఒక్తాబే జిల్లాలో ఉన్న కొండ ప్రాంతంలో విమాన శకలాలు లభించినట్టు కొందరు గ్రామీణులు చెప్పారు. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఏరియల్ సర్వే చేపట్టారు. సోమవారం ఉదయం గ్రౌండ్ సర్వే చేయాలని నిర్ణయించారు.
కొండల్లో కూలిన విమానంలోని ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత దారుణమైన ప్రమాదం జరిగిన తర్వాత ఎంత మంది గాయపడ్డారో, ఎంత మంది మరణించారో అని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మలేషియా విమానాల గల్లంతు ఘటనలను తలచుకుని కలవర పడుతున్నారు. సోమవారం ఉదయం గ్రౌండ్ సర్వే చేసిన తర్వాతే ప్రయాణికులు క్షేమంగా ఉన్నారా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. ఆసియా దేశాలకు చెందిన విమానాలు తరచూ ప్రమాదాలకు గురికావడం ప్రయాణికుల్లో అభద్రతాభావాన్ని పెంచుతోంది. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా ఏదో ఒక కారణంతో విమాన ప్రమాదాలు జరగడం కలవరపెడుతోంది.