పార్టీ నేత‌లపై కేసీఆర్ ప‌ట్టు త‌ప్పుతోందా..?

కొన్ని ఘ‌ట‌న‌లు చూడ్డానికి చిన్న‌గానే క‌నిపిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటివే ఓ పెద్ద మార్పున‌కు పునాదులా అనే అనుమానం క‌లిగేలా చేస్తాయి! తెరాస విష‌యంలో అలాంటిదే ఓ సంఘ‌టన చోటు చేసుకుంది. చూడ్డానికి ఇప్ప‌టికి చిన్న‌గానే క‌నిపిస్తున్నా… తెరాస‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ట్టు స‌డులుతోందా అనే అనుమానాల‌కు తావిచ్చే కోణం కూడా ఈ ఘ‌ట‌న‌లో ఉంది! నిజానికి, తెరాస‌లో సీఎం కేసీఆర్ మాటే శాస‌నం అన‌డంలో సందేహం లేదు. ఆయ‌న్ని అనుమ‌తి లేకుండా ప్రెస్ మీట్లు పెట్టేందుకు కూడా వీల్లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటుంటారు! అందుకే, కేసీఆర్ తీసుకున్న ఏ నిర్ణ‌యాల‌పైన అయినా బ‌హిరంగంగా ఎక్క‌డా ఎలాంటి అసంతృప్తీ తెరాస నేత‌ల నుంచి వ్య‌క్తం కాదు. ఒక‌వేళ స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నాస‌రే, వాటిపై నిర‌స‌న‌లు తెలిపేంత ధైర్యం ఆ పార్టీ నేత‌లు చెయ్య‌రు. కానీ, తాజాగా రంగారెడ్డి క‌లెక్ట‌రేట్ కొత్త భ‌వ‌నం ఏర్పాటు విష‌య‌మై పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తులు బ‌య‌ట‌కి రావ‌డం గ‌మ‌నార్హం!

రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ కొత్త భ‌వ‌నం ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేదానిపై కొన్నాళ్లుగా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. కొంత‌మంది ఎమ్మెల్యేల‌ది ఒక అభిప్రాయం, ప్ర‌భుత్వానికి ఇంకో అభిప్రాయం అన్న‌ట్టుగా మారింది. కొంద‌రు ఈ భ‌వ‌నాన్ని శంషాబాద్ లో నిర్మించాల‌ని సీఎంను కోరుతుంటే, ఆయ‌న మాత్రం కొంగ‌ర కోల‌న్ ప్రాంతానికి మొగ్గుచూపారు. దీంతో ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు యాద‌య్య‌, ఆరిక‌పూడి గాంధీ, అంజ‌య్య యాద‌వ్‌, ప్ర‌కాష్ గౌడ్ ల‌తోపాటు మ‌రికొంద‌రు తెరాస నేత‌లు ఈ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టేశారు. మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వ‌ర రెడ్డితోపాటు ఇంకొంద‌రు మాత్ర‌మే ఈ శంకుస్థాప‌న కార్య‌క్రమం నిర్వ‌హించారు. దీంతో తెరాస ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోవ‌డం విశేషం. అంతేకాదు, అక్క‌డితో ఆగ‌కుండా ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లూ చేసుకుంటున్నార‌ట‌! కొంత‌మంది ప్ర‌ముఖుల‌ భూముల‌ ధ‌ర‌లు పెంచాల‌న్న ఉద్దేశంతోనే క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని సిటీ దూరంగా ఆ ప్రాంతంలో పెట్టార‌ని ఓ వ‌ర్గం విమ‌ర్శిస్తోంది. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్నే త‌ప్పుబ‌డ‌తారా అంటూ మ‌రో వ‌ర్గం వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంద‌ట‌!

ఏదేమైనా, ప్రభుత్వం నిర్వ‌హించిన ఒక అధికారిక కార్య‌క్ర‌మానికి కొంత‌మంది తెరాస ఎమ్మెల్యేలు రాక‌పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. అంతేకాదు, ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్నే బ‌హిరంగంగా త‌ప్పుబ‌డుతూ ఉండ‌టం కూడా గ‌మ‌నార్హం! కొంద‌రికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా సీఎం నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని విమ‌ర్శలు చేయ‌డం మ‌రీ విశేషం. ఇలా బ‌హిరంగంగా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తే, ఈ బ‌లహీన‌త‌ను ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా మార్చుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ భ‌వ‌నం ఏర్పాటు విష‌య‌మై నేత‌ల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయ‌నే సంగ‌తి కేసీఆర్ కు తెలియంది కాదు. త‌న నిర్ణ‌యం ఏదైనా నేత‌లు క‌ట్టుబ‌డి ఉంటార‌ని అనుకున్నారేమోగానీ.. ఇప్పుడీ పరిస్థితి వ‌చ్చింది. సొంత పార్టీలో కేసీఆర్ నిర్ణ‌యాల‌ను కూడా వ్య‌తిరేకించే ప‌రిస్థితి ఉందా అనే సంకేతాలు ఈ ఘ‌ట‌న ద్వారా వ్య‌క్త‌మౌతున్న‌ట్టే క‌దా. మ‌రి, ఈ నిర‌స‌న గ‌ళం వినిపించిన నేత‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు ఉంటాయో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.