ఆ మంత్రుల మ‌ధ్య విభేదాలు అలానే ఉన్నాయ‌ట‌!

పైకి క‌నిపించేంత ప్ర‌శాంత వాతావ‌ర‌ణం విశాఖ టీడీపీ వ‌ర్గాల్లో ఉండ‌టం లేద‌న్న‌ది వాస్త‌వం! ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, చింత‌కాయ అయ్య‌న్న పాత్రుడు మ‌ధ్య ఉన్న విభేదాలు తెలిసిన‌వే. చాన్నాళ్లుగా తెర చాటున ఉంటూ వ‌స్తున్న ఈ వివాదం… విశాఖ భూదందా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌రస్ప‌రం విమ‌ర్శ‌లూ, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి ఫిర్యాదుల వ‌ర‌కూ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, రొటీన్ గా ‘అబ్బే మా మ‌ధ్య ఏం లేద‌నీ, భూదందాపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌నేదే మంత్రి గంటా అభిప్రాయ‌మూ, త‌న మ‌నోగ‌త‌మూ’ అన్న‌ట్టుగా చింత‌కాయ‌ల చెప్పేశారు! మంత్రులిద్ద‌రికీ చంద్ర‌బాబు క్లాస్ తీసుకోవడం అనే క‌థ‌నాలూ ష‌రా మామూలే. దీంతో ఆమాత్యుల మ‌ధ్య అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు తెర‌ప‌డింద‌నే అనుకున్నారు. కానీ, ఇప్పుడు తెలుస్తున్న‌ది ఏంటంటే… ఈ ఇద్ద‌రి మ‌ధ్య విమ‌ర్శ‌ల విర‌మ‌ణ మాత్ర‌మే జ‌రిగింద‌నీ, వివాదాలు అలాగే ఉన్నాయ‌నే చ‌ర్చ టీడీపీ వ‌ర్గాల్లో మ‌ళ్లీ మొద‌లైంద‌ని తెలుస్తోంది.

ఇంత‌కీ ఈ చ‌ర్చ ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీదికి ఎలా వ‌చ్చిందీ అంటే… విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తాజాగా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు అయ్య‌న్న‌, గంటా పాల్గొన్నారు. ఆ ఇద్ద‌ర్నీ త‌నకు ఇరువైపులా కూర్చోబెట్టుకుని శాఖ‌లవారీగా జ‌రుగుతున్న పనుల తీరును మంత్రి చిన‌రాజ‌ప్ప విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా సింహాచ‌లం భూముల అంశంపై కూడా స‌మాచారం తెలుసుకున్నారట‌. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ జ‌రిగిన సుదీర్ఘ స‌మావేశంలో మంత్రులిద్ద‌రూ చిన‌రాజ‌ప్ప‌తో స‌హా క‌ద‌ల‌కుండా కూర్చున్నారు. నిజానికి, ఈ స‌మీక్ష గ‌త వార‌మే జ‌రిగినా.. టీడీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది! ఎందుకంటే, ఇద్ద‌రి మంత్రుల‌తో ఈ స‌మీక్ష నిర్వ‌హించాక‌, వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చిన‌రాజ‌ప్ప నివేదించార‌ట‌. మంత్రుల ప‌రిస్థితినీ ఆయ‌న సీఎంకు వివ‌రించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. జిల్లాలో వీరి విభేదాలు కార‌ణంగా పెండింగ్ ప‌డిపోయిన ప‌నుల ఏమైనా ఉన్నాయా అనే కోణం నుంచి వివ‌రాల‌ను సీఎం అడిగి తెలుసుకున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com