చంద్రబాబుకు అవమానాలు..! తమిళనాడు తరహా రాజకీయాలు..!

తమిళనాడులో ఒకప్పుడు… కరుణానిధి, జయలలిత మధ్య హోరాహోరీ పోరు నడిచేది. అది ఎన్నికల్లో మాత్రమే కాదు బయట కూడా. ఎవరు అధికారంలో ఉంటే.. వాళ్లు.. ఇతరులను మెంటల్‌గా టార్గెట్ చేశారు. కేసులు.. వేధింపులు ఓ రేంజ్‌లో ఉండేవి. వాళ్లిద్దరూ ఇప్పుడు లేరు కాబట్టి.. తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు.. ఆ పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.

విమానాశ్రయంలో చంద్రబాబును కావాలనే అవమానించారా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిన్నామొన్నటిదాకా సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పధ్నాలుగేళ్లు సీఎంగా చేశారు. మిగతా కాలమంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన ప్రతిపక్షనేత. ఆయన వీఐపీ, జడ్ ప్లస్ సెక్యూరిటీతో.. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉంది. అలాంటి వ్యక్తికి భద్రతాపరంగా.. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెడుతున్నారు. అధికారం కోల్పోయి నెల రోజులు కాక ముందే.. ఆయనను సామాన్యుడి కేటగరిలో చేర్చి.. ఎక్కడ పడితే అక్కడ నడిపిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో.. అదే జరిగింది. చంద్రబాబు వాహనాలను.. లోపలికి అనుమతించకుండా.. నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా.. ఓ సాదారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేశారు.

వీఐపీ ప్రోటోకాల్ పట్టించుకోవద్దని సీఐఎస్ఎఫ్‌కి ఎవరు చెప్పారు..?

నిబంధనల ప్రకారం.. వీఐపీ, జడ్ ప్లస్ కేటగిరి ఉన్న వారి వాహనాలను..నేరుగా లోపలికి అనుమతిస్తారు. విమానం వద్దకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా.. .ఆయన పలుమార్లు విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా… హైదరాబాద్ పలుమార్లు వెళ్లారు. అప్పుడు ఎప్పుడూ ఇలా చేయలేదు. కానీ సీఐఎస్ఎఫ్ పోలీసులు ఇప్పుడు మాత్రం ఎవరో చెప్పినట్లుగా… చంద్రబాబును.. అడ్డుకున్నారు. తనిఖీలు చేసి పంపించారు. భద్రతా నిబంధనలను సైతం ఉల్లంఘించి.. ఓ నేతను కావాలని అవమానించినట్లుగా చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లుగా స్పష్టంగా అర్థం అవుతోందని టీడీపీ నేతలంటున్నారు.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరగనిది… విజయవాడలోనే ఎందుకు..?

సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. చంద్రబాబు సెక్యూరిటీ తగ్గుతూ వస్తోంది. ఎస్కార్ట్ పైలెట్‌ను తీసేశారు. కనీస రివ్యూ లేకుండా.. ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా లేకుండా చేశారు. ట్రాఫిక్‌లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆగిపోతే.. భద్రతకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలే గతంలో.. “చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదన్న” వాళ్లే సీఎంగా ఉన్నారన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. పగబట్టి.. అవమానించడం ఇలా చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ఒకరినొకరు ఇలాగే అవమానించుకునేవారు. ఇప్పుడా పరిస్థితి ఏపీలో వచ్చినట్లుగా కనిపిస్తోంది.

కొసమెరుపేమిటంటే… హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు .. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com