జగన్‌ను “బ్రాండ్‌ అంబాసిడర్‌”గా వాడేసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో… తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు లాక్కున్నప్పుడు.. తీవ్రమైన విమర్శలు చేశారు. తాను రాజకీయ వ్యవస్థను మారుస్తానని చెప్పారు. దాంతో.. ఆయనకు ఇప్పుడు ఫిరాయింపులకు అవకాశం లేకుండా పోయింది. పార్టీకి పదవులకు రాజీనామాలు చేసి వచ్చే వాళ్లనే.. తన పార్టీలో చేర్చుకుంటానని.. జగన్మోహన్ రెడ్డి నేరుగా చెబుతున్నారు. అంతే.. రాజకీయ విలువల గురించి ఉపన్యాసాలు దంచుతున్నారు. ఇది.. ఆయన ఆత్మీయ రాజకీయ మిత్రుడు.. కేసీఆర్‌తో పాటు.. టీఆర్ఎస్ నేతలందరికీ ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది.

టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా ఫిరాయింపులపై జగన్ వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని, ఎమ్మెల్సీలను చేర్చుకుంది. అటు మండలి లెజిస్లేచర్ పార్టీని.. ఇటు శాసనసభ లెజిస్లేచర్ పార్టీని వేర్వేరుగా విలీనం చేసుకుని.. కాంగ్రెస్ పార్టీ లేదని… తీర్మానించేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు… ఓ స్థాయి పోరాటం చేస్తున్నారు. దాన్ని.. టీఆర్ఎస్ నేతలు తిప్పి కొడుతున్నారు. ఈ క్రమంలో.. ఏపీలో.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం.. టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఫిరాయింపులకు.. తాను కొన్నిప్రమాణాలు పెట్టుకున్నానని… అవి చేయకపోతే.. రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినట్లేనని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటున్న టీఆర్ఎస్ నేతలకు.. ఇవి తమను ఉద్దేశించి అంటున్న మాటలేనన్నట్లుగా ఫీలవుతున్నారు.

చూసి నేర్చుకోవాలని కేసీఆర్‌కు సూచిస్తున్న కాంగ్రెస్.. !

జగన్ వ్యాఖ్యలను… తెలంగాణ కాంగ్రెస్ నేతలు పకడ్బందీగా వాడుకుంటున్నారు. చోటా మోటా నేతల దగ్గర్నుంచి భట్టి విక్రమార్క దగ్గర… జగన్ వ్యాఖ్యలను… అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. మీ కన్నా చిన్న వాడైన జగన్‌ను చూసి నేర్చుకోండి… ఆయనతో స్నేహం చేస్తున్నారు కదా.. ఆ మాత్రం నేర్చుకోలేరా అంటూ.. ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం… ఓ రోల్ మోడల్ అని… ప్రశంసిస్తున్నారు. జగన్ ను ప్రశంసించడానికి కాకపోయినా… కాంగ్రెస్‌కు పాతరేసిన కేసీఆర్‌పై కోపంతో… కాంగ్రెస్ నేతలు.. జగన్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి టీఆర్ఎస్‌ది.

ఫిరాయింపులకు వైఎస్‌ను కారణంగా టీఆర్ఎస్ చూపించడమే కొసమెరుపు…!

అసలు విశేషం ఏమిటంటే… ఫిరాయింపులపై.. కాంగ్రెస్ విమర్శలు టీఆర్ఎస్ నుంచి ఒకే సమాధానం వస్తుంది. ఒకప్పుడు.. కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను లాక్కోలేదా.. అని ప్రశ్నిస్తోంది. దానికి.. ఇప్పుడు తమ ప్రతీకారం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా ఫిరాయింపులకు ప్రొత్సహించి.. టీఆర్ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించి… వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే. ఆయన చూపిన బాట అధికార పార్టీలకు… ఓ వరంలా మారింది. అప్పుడు సమర్థించుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు.. అదే వైఎస్ కుమారుడు.. జగన్ చేస్తున్న విమర్శలను కూడా సమర్థించాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com