ఇదివరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు యల్.టి.టి.ఈ.ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్లే ఇప్పుడు ప్రధాని మోడీపై కూడా ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని ఇంటలిజన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని మోడీ ఇవాళ్ళ బీహార్ రాజధాని పాట్నా మరియు ముజఫర్ పూర్ లలో బహిరంగ సభలలో పాల్గొనబోతున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు ఇటువంటి ప్రయత్నాలు చేయవచ్చని ఇంటలిజన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి, బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కనుక ప్రధాని భద్రతని మరింత కట్టుదిట్టం చేసారు. ఆయన బహిరంగ సభలు జరిగే ప్రాంతాలను,చుట్టూ పక్కల ప్రాంతాలను అన్నిటినీ కూడా పోలీసులు ఆణువణువూ జల్లెడ పడుతున్నారు. ప్రధాని మోడీ చుట్టూ అనేక అంచెలుగా భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
గతేడాది సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం నరేంద్ర మోడీ బీహార్ వెళ్ళినప్పుడు కూడా ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన ప్రసంగించే వేదిక వద్ద, సభా ప్రాంగణంలో బాంబులు పేలాయి. కానీ అదృష్టవశాత్తు ఆయన తప్పించుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన బీహార్ వెళుతున్న సమయంలోనే ఇంటలిజన్స్ అధికారులు ఇటువంటి హెచ్చరికలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు జరుగబోయే సభలలోనే కాకుండా ఆగస్ట్ 15న డిల్లీలో ఎర్రకోట వద్ద జరుగబోయే స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో కూడా ఉగ్రవాదులు దాడులకి తెగబడే అవకాశం ఉన్నట్లు ఇంటలిజన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి.