వెంకటేష్ స్టైలే వేరు. ఏ జోనర్ కీ లొంగని కథానాయకుడు. తన పరిధిలో తాను ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. రీమేక్‌లంటే మరీ మక్కువ. తన చేతిలో ప్రస్తుతం రెండు రీమేక్‌లున్నాయి. అందులో `నారప్ప` ఒకటి. థియేటర్లో విడుదల కావాల్సిన సినిమా ఇది. కోవిడ్ ప్రభావంతో ఓటీటీకి పరిమితమైంది. ఈనెల 20న అమేజాన్ లో `నారప్ప` విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వెంకీతో చిట్ చాట్ ఇది.
* నారప్పని ఎలాంటి హడావుడీ లేకుండా సడన్ గా విడుదల చేసేస్తున్నారు.. కారణం ఏమిటి?
– ఎందుకూ… ఏమిటి? అనే ప్రశ్నలు నేనెప్పుడూ వేసుకోను. నా నేచర్ అలాంటిది కాదు. నా సినిమా ఎప్పుడొస్తుంది? ఎన్ని సెంటర్లలో ఆడుతుంది? ఎన్ని థియేటర్లలో ఉంది? అనే విషయాలు అస్సలు పట్టించుకోను. నా పని నటించడమే. మిగిలిన విషయాలతో నాకు సంబంధం లేదు. టైమ్ ప్రకారం వెళ్లిపోవడమే. ఏ సమయానికి ఏం జరగాలో.. అది జరుగుతుంది. దాని వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది కాలమే చెబుతుంది.
* ఓటీటీ లో మీ సినిమా రావడం ఇదే తొలిసారి. కొంతమంది అభిమానులు ఓటీటీ రిలీజ్ అని చెప్పగానే చాలా నిరాశ చెందారు. వాళ్లందరికీ ఏం చెబుతారు?
– ఎవరో ఒకరు ఎక్కడో ఓ చోట మొదలెట్టాలి కదా..? ఈ సినిమా ఓటీటీలో రావడంతో కొంతమంది నిరాశ పడొచ్చు. కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు. అలా బాధపడినవాళ్లకు సారీ. థియేటర్లో వచ్చే సినిమాలుంటాయి కదా. అప్పటి వరకూ ఆగండి. కానీ.. ఓటీటీలో చూసినంత మాత్రాన ఎవరూ నిరాశ పడరు. థియేటర్లో చూసినంత కిక్… ఓటీటీలోనూ కూడా దొరుకుతుంది. నా ఫ్యాన్స్ నన్నెప్పుడూ అర్థం చేసుకుంటారు.
* అసురన్ లో ఏం నచ్చాయి? రీమేక్ చేయాలనిపించేంత ప్రేరణ కలగడానికి కారణాలేంటి?
– వెట్రిమారర్, ధనుష్ చేసిన ఓ క్లాసిక్ అసురన్. హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి. చాలా నిజాయితీగా ఉంది. అలాంటి సినిమా నేను చేయలేదనిపించింది. చూడగానే బాగా నచ్చింది. మన వాళ్లకూ నచ్చుతుందన్న నమ్మకం కలిగింది. నటుడిగా ఓ ఛాలెంజ్ ఉంటుంది అనిపించింది. నా కెరీర్‌లో చాలా రీమేకులు ఉన్నాయి. అలాంటి కథలు ఇక్కడ దొరక్క.. రీమేకులు.. చేస్తా. అరె.. ఇది చేయాల్సిందే కదా అనిపించినప్పుడు వదులుకోను.
*రీమేకులెక్కువగా చేయడం మీకెరీర్‌కి ప్లస్సా? మైనస్సా?
– పదే పదే రీమేకులు చేయడం సరదా కాదు. అందులో చాలా సవాళ్లు ఉంటాయి. మరో హీరో బాడీ లాంగ్వేజిని అర్థం చేసుకుని నా బాడీ లాంగ్వేజీకి మాచ్ చేయడమే పెద్ద రిస్క్. అలాంటి కథలు ఎంచుకున్నప్పుడు చాలా డౌట్లు ఉంటాయి. అంచనాలు పెరుగుతాయి. వాటిని బాలెన్స్ చేసుకుంటూ సినిమా చేయడం అంత సులభం కాదు. కావాలని ఎప్పుడూ రీమేక్‌లు చేయలేదు. అవి నా దగ్గరకు వచ్చాయంతే.
* నారప్ప విషయంలో మీకు ఎదురైన ఛాలెంజ్ ఏమిటి?
– నా కెరీర్‌లో అది పెద్ద ఛాలెంజ్ .. నారప్ప. లుక్. ఎమోషనల్ సీక్వెన్స్ ఇలా అన్నింటిలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. ఇలాంటి యాక్షన్ సీన్లు చేసి చాలా కాలమైంది. అయితే అవన్నీ అత్యంత సహజంగా వచ్చాయి. 50 రోజుల పాటు అదే డ్రస్సులో, అదే గెటప్పులో ఉన్నా. ఆ గెటప్‌ని.. ఓన్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అది. ఆ పాత్ర చేసినప్పుడు అనుకోకుండా చాలా ఎనర్జీ వచ్చేది. అదంతా పాత్రలో ఉన్న మ్యాజిక్. ప్రతీరోజూ రిజల్ట్ చూసి షాక్ అయ్యేవాడ్ని. ఓ యాక్షన్ సీన్ చేశాక… దాన్ని తెరపై చూసుకుంటే చాలా తృప్తిగా అనిపించేది. ఆ మూడ్ లోంచి బయటకు రావడానికి మాత్రం చాలా కష్టమయ్యేది.
* ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాలనే ఎందుకు?
– తనకీ అసురన్ సినిమా బాగా నచ్చింది. తనూ చేయాలనుకున్నాడు. తనతో ఇది వరకు చేశాను కాబట్టి… మా మధ్య రాపో ఉంది కాబట్టి.. పని సులభం అవుతుందనుకున్నా. ఓ మంచి సినిమాని పాడు చేయకూడదు. 100 శాతం ఎఫెక్ట్ పెడితే మంచి అవుట్ పుట్ వస్తుందనుకున్నా. తను చాలా బాగా తీశాడు. మా టీమ్ అందరికీ ఓ పెద్ద ఛాలెంజ్.
* ధనుష్‌తో పోలికలు తీస్తారు కదా. అది మీకు ఇబ్బంది అనిపించదా?
– రీమేక్ చేస్తున్నప్పుడు కంపారిజన్ ఉంటుంది. చంటి, సుందరకాండ చేసినప్పుడు కూడా అది ఉంది కదా..? నటుడిగా వాళ్లని ఎంత వరకూ మ్యాచ్ చేశా అన్నది సినిమా చూశాక ప్రేక్షకులు చెప్పాలి. అలాంటి సినిమాలు తెలుగులో రాలేదు. నేనూ చేయలేదు. కాబట్టి.. మనవాళ్లకు కొత్తగా అనిపిస్తుంది.
ఇక ధనుష్ విషయానికి వస్తే… తను చాలా గొప్ప నటుడు. దేశంలోనే అత్యుత్తమనటుల్లో ఒకడు. తను ధనుష్.. నేను.. వెంకీ. అంతే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. రీమేక్ తాను చేశాడు. వెంకీ చేశాడా, ధనుష్ చేశాడా అని కాదు. ఆ పాత్రల్లో.. ఆ సన్నివేశాల్లో ఇన్‌వాల్వ్ అయ్యాడా, లేదా? అనేదే చూస్తారు.
* నారప్ప, దృశ్యమ్, ఎఫ్ 3.. ఒకదాంతో మరోటి సంబంధం లేని సినిమాలు. ఇవి మూడూ ఒకేసారి చేశారు. ఆ పాత్రల తాలుకూ మూడ్ ని అర్థం చేసుకుని, ఇన్ అండ్ అవుట్ అవ్వడానికి కష్టం అనిపించలేదా?
– ఇన్ – అవుట్.. నాకు చాలా త్వరగా అయిపోతాయి. ఓ ప్రాజెక్ట్‌లోకి పాత్రలోకి త్వరగా ఇన్‌వాల్వ్ అవుతాను. అంతే ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తా. ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేశాం కాబట్టి.. నా పని మరింత సులభం అయ్యింది.
* కొత్త కథలు టాలీవుడ్ లోనూ వస్తున్నాయి. అలాంటప్పుడు రీమేక్‌లు చేయడం ఏమిటన్నది చాలా మందిలో వస్తున్న ప్రశ్న. మీరేంటారు?
– ఆ ప్రశ్న ఎవరికి వచ్చింది? నాకు రాలేదు. రైట్.. లైఫ్ట్ నేనెప్పుడూ చూడను. పక్కకు చూస్తే.. రైటా? రాంగా? అని ప్రశ్నించుకుంటే.. మనం ఫినిష్ అయిపోతాం. లైఫ్ అంతా అందులోనే ఉంటాం. మన పని మనం సిన్సియర్ గా చేయడమే. మనం అడిగింది మన దగ్గరకు రాదు. వచ్చింది మనం తీసుకోవడం అంతే.
* గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు.. కారణమేంటి?
– కొన్నిసార్లు నాలుగైదు స్క్రిప్టులు రెడీగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక్క కథ కూడా ఉండదు. కొన్నిసార్లు సినిమాలు చేయకూడదనుకుంటా. అన్నీ వచ్చి మీదపడిపోతుంటాయి. ఏదీ మన చేతుల్లో ఉండదు.