ఇంటిలిజెంట్ ఫెయిల్ అయ్యాడు

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5

ఆది, లక్ష్మీ, ఠాగోర్, ఖైదీ 150 సినిమాలు చూసారా? చూసే వుంటారు. ఆ సినిమాల్లో ఎమోషన్ సీన్లు గుర్తుండే వుంటాయి. సినిమాల డైరక్టర్ నే ఇంటిలిజెంట్ సినిమా కూడా తీసింది.

అదుర్స్, కృష్ణ సినిమాల కామెడీ గుర్తుందా? ఆ సినిమాల డైరక్టరే ఇంటిలిజెంట్ సినిమా కూడా తీసింది.

ఇంత చెప్పడం ఎందుకు? ఎవరు సీన్ తీస్తే, క్లాస్ ఆడియన్స్ మైండ్ కూడా బ్లాంక్ అయి, వేళ్లు ఆటోమెటిక్ గా నోట్లోకి వెళ్లి, విజిల్ సౌండ్ బయటకు వచ్చేలా చేస్తుందో, ఆ డైరక్టరే వివి వినాయక్. ఆయన తీసిన లేటెస్ట్ సినిమానే ఇంటిలిజెంట్.

ఇలా సీన్ కు ఓసారి గుర్తు చేసుకుంటూ వుండాలి. లేకపోతే ఏవరో ఔత్సాహిక దర్శకుడు ఏదో అలా అలా తనకు వచ్చిన మేరకు సినిమా తీసి థియేటర్లలో వదిలివుంటారని భ్రమపడాల్సి వుంటుంది. వినాయక్ సినిమాలను అభిమానించిన వారికి మాత్రం, ఆయన నుంచి వచ్చిన ఈ సినిమాను చూసి బాధపడాల్సి వస్తుంది.

ఇంటిలిజెంట్ సినిమా నేతిబీరకాయలో నెయ్యి టైపు. సినిమా కథలో కానీ, మేకింగ్ లో కానీ, డైరక్షన్ లో కానీ, సన్నివేశాల్లో కానీ ఇంటిలిజెన్సీ అన్నది భూతద్ధం పెట్టుకుని వెదికినా కనిపించదు. ఇలా ఇంటిలిజెన్సీని ఇంటి వెనుక దాచేసిన ఈ సినిమా కథేంటంటే సాయి ధరమ్ తేజ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆ సంస్థ అధినేత నాజర్ చాలా మంచివాడు. అనాధలను ఆదుకుంటాడు. ఉద్యోగలను జాగ్రత్తగా చూసుకుంటూ వుంటాడు. ఇలాంటి టైమ్ లో దేవ్ గిల్ అండ్ కో లకు చెందిన మాఫియా ముఠా కన్ను ఆ కంపెనీ మీద పడుతుంది. బలవంతంగా దాన్ని తమ స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. అలాంటి టైమ్ లో ధరమ్ అడ్డం పడతాడు. కానీ వున్నట్లుండి కంపెనీ ఆ ముఠా పేర రాసి నాజర్ ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో ఆ ముఠా పని పట్టడానికి రంగంలోకి దిగి ధర్మా భాయ్ గా మారతాడు హీరో. చివరకు ఏం జరిగి వుంటుందో అందరికీ తెలిసిందే.

ఎందరో యువ దర్శకులకు మాస్ సినిమా అంటే సిలబస్ ఇదే అన్నట్లు సినిమాలు తీసి చూపించిన వివి వినాయక్ ఇంటిలిజెంట్ సినిమాను ఇంత పేలవంగా అందించడం చాలా విషాదకర విషయం. నాలుగు ఫ్లాపుల తరువాత సాయి ధరమ్ తేజ చేసిన అయిదో సినిమా ఇంత దారణంగా వుండడం అంతకన్నా విషాదం. ప్రారంభం నుంచే సినిమా చాలా పేలవంగా వుంటుంది. హీరో, అతగాడి ఫ్రెండ్స్ వుండే సీన్లు చూస్తుంటే నాటకానికి ఎక్కువ సినిమాకు తక్కువ అనిపిస్తుంది. అనుభవం పండిన దర్శకుడు తీసిన సీన్లలా అనిపించవు. అంతే కాదు, హీరో హీరోయిన్ల పరిచయం, హీరో పట్ల హీరో మనసు మార్చడానికి అల్లుకున్న అమ్మ-కొడుకుల అనుబంధం సీన్ ఇలా ఒక్కొక్కటిగా వస్తూ, ఈ నీరస భావాన్ని మరింత పెంచుతూ పోతాయి తప్ప తగ్గించే ప్రయత్నాన్ని పోరపాటున కూడా చేయవు.

హీరొ ధర్మాభాయ్ గా మారిన తరువాత కథ ఏకంగా అందని పరుగులు పెడుతుంది. టైటిల్ తగిన ఇంటిలిజెంట్ ప్లే ఎక్కడా కనిపించదు. ఎవరెవరి డబ్బులో అక్కౌంట్ లోంచి మాయం కావడం, ఎవరెవరికో చేరిపోవడం, అంతా గోలగోలగా సాగిపొయి, అసలు విలన్ రంగంలోకి దిగిపోతాడు. ఫ్లయిట్ లాండింగ్ అవుతుంటే డ్రోన్ తో ఢీకొట్టే ప్రయత్నం, ఫ్లయిట్ కు ఏమవుతుందో అన్నది కూడా చూడకుండా డ్రొన్ ను ఢీకొట్టడం వంటి సీన్లు అబ్బో..సూపర్. ఇక పాముల కోసం కిందా మీదా అయిపోయే సీన్లు వుంటాయి చూసారూ… చెప్పక్కరలేదు.

ఇలాంటి సీన్లంటి మధ్యలో కేవలం పాటల కోసం తీసుకున్న హీరోయిన్ వుంటుంది. ఆ పాటల్లో నాలుగు గెంతులు గెంతి వెళ్లిపోతాయి. అవేవీ అంత ఇంపాక్ట్ కలిగించవు. అలనాటి సూపర్ హిట్ సాంగ్ ఛమక్..ఛమక్.. పాట కూడా ప్రేక్షకులను ఏ మాత్రం స్పందింపచేయదు అంటే సినిమా పట్ల దర్శకుడికి వున్న శ్రద్ధ తెలిసిపోతుంది. సినిమా ప్రారంభంలో ఒకటి రెండు సీన్లలో వున్న సప్తగిరి కామెడీ  కొంచెం నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మానందం కామెడీ చూసి, ఆయన వైభవం గుర్తుకువచ్చి అయ్యో అనిపిస్తుంది.

సినిమా మొత్తం మీద ఏ ఒక్క సాంకేతిక అంశం గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు పెద్దగా. నేపథ్య సంగీతం సినిమాకు తగినట్లే. సినిమాటోగ్రఫీ కూడా అంతే. సినిమాకు బడ్జెట్ సమస్య ఏమన్నా వుందేమో అన్నట్లుగా, పాత్రలకు సింక్ కానీ, వాల్యూ యాడ్ కాని నటులను తీసుకుని కానిచ్చేసారు.

ఇలా ఒక రకంగా కాదు, చాలా రకాలుగా ఇంటిలిజెన్సీ అన్నది కరవైపోయన సినిమా ఇంటిలిజెంట్.

తీర్పు

చేసి పని పట్ల శ్రద్ధ లేకపోతే, లేదా లోపల వున్న సరుకు అయిపోతే ఇలాంటి ప్రొడక్ట్ లు వస్తాయి. ఇంటిలిజెంట్ అని న్యూమరాలజీ లెక్కలు కూడా చూసుకుని టైటిల్ ఫిక్స్ చేసుకున్నవారు మేకింగ్ లో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఇలాగే వుంటుంది. ఇలాంటి సినిమా ఆడడం, ఆడకపోవడం అన్నది మెగాభిమానుల మీద ఆధారపడి వుంటుంది.

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com