గాయ‌త్రి రివ్యూ : శివాజి Vs గాయత్రి పటేల్ !

Gayatri review

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

బావుండాల్సింది ప్లేటు కాదు… అందులోని ప‌దార్థం
గ‌ట్టిగా వేయాల్సింది గోడ కాదు… పునాది
ప‌ళ్లూ, పూలు త‌ర‌వాత‌… వేళ్లు ఎలా ఉన్నాయో చూడాలి!

సినిమా కూడా అంతే. రెండు మూడు పాత్ర‌లు, కొన్ని సంభాష‌ణ‌లు, క‌థ‌లో ఒక‌ట్రెండు ట్విస్టులు ఉంటే స‌రిపోదు. వాటిని క‌లుపుకుంటూ పోయే క‌థ ప‌టిష్టంగా ఉండాలి. లేదంటే… ఆ ప్ర‌య‌త్నం బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. మోహ‌న్ బాబు విల‌క్ష‌ణమైన న‌టుడు. స‌రైన పాత్ర ప‌డాలే గానీ… న‌ట విశ్వ‌రూపం చూపించేయ‌డంలో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌డు. ఆయ‌న్ని రెండు పాత్ర‌ల్లో చూపిస్తూ… ఓ క‌థ త‌యారు చేసుకుంటున్నామంటే, అదెంత ప‌టిష్టంగా ఉండాలి..? ‘గాయ‌త్రి’ చూస్తే మాత్రం ఆ లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

క‌థ‌లోకి వెళ్దాం. శివాజీ (మోహ‌న్‌బాబు) ఓ క‌ళాకారుడు. రంగ‌స్థ‌లంపై అన్ని ర‌కాల పాత్ర‌లు చేశాడు. నిజ జీవితంలోనూ అప్పుడ‌ప్పుడూ చేయ‌కూడ‌ని పాత్ర‌లూ చేస్తుంటాడు. అంటే.. ఎవ‌రికైనా జైలు శిక్ష ప‌డింద‌నుకోండి. వాళ్ల స్థానంలో… శివాజీ వెళ్తాడు.. మేక‌ప్ వేసుకుని. ఆ శిక్ష అనుభ‌వించి వ‌స్తాడు. ఆ డ‌బ్బుతో ఓ అనాథాశ్ర‌మం నిర్వ‌హిస్తుంటాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య శార‌ద (శ్రియ‌) ఓ బిడ్డ‌ను ప్ర‌స‌వించి చ‌నిపోతుంది. ఆ బిడ్డేమో చిన్న‌ప్పుడే త‌ప్పిపోతుంది. త‌న బిడ్డ కోసం అన్వేష‌ణ సాగిస్తూ… జీవితం గ‌డిపేస్తుంటాడు. అత‌ని జీవితంలోకి… గాయ‌త్రి ప‌టేల్ (మోహ‌న్ బాబు) ఎందుకొచ్చాడ‌న్న‌ది మిగిలిన క‌థ‌.

ఇదో రీమేక్ క‌థ‌. సాధార‌ణంగా పక్క భాష నుంచి ఓ క‌థ‌ని డ‌బ్బులిచ్చి కొనుక్కున్నారంటే క‌చ్చితంగా కొత్త పాయింట్ ఉండే ఉంటుంది. నిజానికి ఆ పాయింట్ ఈసినిమాలో ఉంది కూడా. ఓ డ్రామా ఆర్టిస్టు.. డ‌బ్బుల కోసం, ర‌క‌ర‌కాల వేషాలేసుకుని, ఎవ‌రి బ‌దులుగానో శిక్ష అనుభ‌విస్తుంటాడు. ఓసారి ప్ర‌తినాయ‌కుడి స్థానంలో తాను జైలుకి వెళ్లాల్సివ‌స్తుంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌లవుతుంది. చివ‌రికి… అందులోంచి హీరో ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌ది మంచి పాయింటే. అయితే దాని చుట్టూ అల్లిన తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ బ‌లంగా ఉండాల్సింది. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ.. అస‌లు క‌థ మొద‌ల‌వ్వ‌దు. అప్ప‌టి వ‌ర‌కూ శివాజీ మంచి త‌నాన్ని… పేజీల కొద్దీ వివ‌రిస్తూ టైమ్ వేస్ట్ చేశారు. మ‌ధ్య‌లో హ‌నుమాన్ పాట ఎందుకొస్తుందో అర్థం కాదు. క‌థేమీ లేన‌ప్పుడు, టైమ్ పాస్ కోసం స‌న్నివేశాల్ని రాసుకుంటున్న‌ప్పుడు వినోదానికి ప్రాధాన్యం ఇవ్వాలి. క‌నీసం ఆ న‌వ్వుల్లో ప‌డి త‌ప్పుల్ని మ‌ర్చిపోతారు. కానీ ఇక్క‌డ ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు. విశ్రాంతి త‌ర‌వాత ఫ్లాష్ బ్యాక్ వ‌స్తుంది. అది కాసేపే అయినా.. అక్క‌డ బ‌ల‌మైన భావోద్వేగాలు పండాల్సింది. భార్యా భ‌ర్త‌లు విడిపోతే… ఓ తండ్రి కి బిడ్డ దూర‌మైతే ఆ అనుబంధాన్ని, ఆ ఎడ‌బాటుని అద్భుతంగా పండించాల్సింది. కానీ ఆయా సన్నివేశాలు తేలిపోయాయి. ఈ క‌థ‌లో గాయ‌త్రి ప‌టేల్ ఎంట్రీ ఇచ్చేంత వ‌ర‌కూ… ఓ మెలిక‌గానీ, మ‌లుపు గానీ రాలేదు. గాయ‌త్రి ప‌టేల్ వేసిన ఉచ్చులోంచి శివాజీ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌ది ఆసక్తిక‌రం. ఆయా స‌న్నివేశాలు బాగానే ఉన్నాయి. కాక‌పోతే 134 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైన గాయ‌త్రి ప‌టేల్ చివ‌రి కోరిక తీర్చాల్సిందే అంటూ జ‌నాలు ఆందోళ‌న చేయ‌డం, ఫేస్ బుక్ ట్విట్ట‌ర్ల‌లో అదో ఉద్య‌మంగా న‌డ‌వ‌డం సిల్లీగా అనిపిస్తుంది.

ఈ సినిమాలో చ‌ప్ప‌ట్ల‌కు ప‌ని క‌ల్పించే సీన్లూ ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల‌పై మోహ‌న్ బాబు వేసిన సెటైర్లు ఆక‌ట్టుకుంటాయి. సీఎమ్ చంద్ర‌బాబు నాయుడుపై కూడా జోకులు పేల్చారు. సార్వ‌భౌమాధికారం అని ప‌ల‌క‌డం రానివాళ్లే మ‌న పాల‌కులు.. అంటూ ఇప్ప‌టి ప్ర‌జాప్ర‌తినిధుల తీరు ఎండ‌గ‌ట్టారు. స్పెష‌ల్ స్టేట‌స్‌పై కూడా ఓ డైలాగ్ ఉంది. కాక‌పోతే ఆ ప‌దం వినిపించ‌కుండా సెన్సార్ వాళ్లు అడ్డుక‌ట్ట వేశారు. వీలున్న‌ప్పుడ‌ల్లా రాజ‌కీయాల్ని, రామాయ‌ణ మ‌హాభార‌తాల్ని ప్ర‌స్తావిస్తూ డైలాగులు పేల్చారు. ఆయా ఎపిసోడ్లు ఆక‌ట్టుకుంటాయి. కానీ కొన్ని ఫోర్డ్స్ ఎమోష‌న్ల మ‌ధ్య మంచి పాయింట్ న‌లిగిపోయిందేమో అనిపిస్తుంది. క‌థ‌ని ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేస్తూ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పండిస్తూ… చెప్ప‌డంలో మ‌ద‌న్ దారి త‌ప్పాడు.

మోహ‌న్‌బాబు ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్ర‌మిది. శివాజీగా త‌న న‌ట‌న… య‌ధావిధిగానే ఉంది. గాయ‌త్రి ప‌టేల్‌లో మాత్రం మెరుపులు క‌నిపిస్తాయి. ఆ డైలాగ్ డెలివ‌రీ, ఆ మాడ్యులేష‌న్‌… ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ సినిమాని గుర్తు చేస్తాయి. వ‌య‌సు పైబ‌డిన రీత్యా.. ఫైట్లు చేయ‌డానికి, స్టెప్పులు వేయ‌డానికి ఇబ్బంది ప‌డిన మాట వాస్త‌వం. అయితే… ఓ ఫైట్‌కి కూర్చీలో కూర్చునే లాగించేశారు. దాన్ని ఫైట్ మాస్ట‌ర్ బాగానే డీల్ చేయ‌డంలో ర‌క్తి క‌ట్టింది. మోహ‌న్‌బాబుగా క‌నిపించాల‌నుకోవ‌డం విష్ణు చేసిన సాహ‌సం. నిజానికి మోహ‌న్ బాబుకి రీప్లేస్ మెంట్ ఉండ‌దు. కానీ దీన్నో కొత్త ప్ర‌యోగంగా భావించి ఓ ప్ర‌య‌త్నం చేశాడు విష్ణు. కాక‌పోతే ఎక్క‌డా చెడ‌గొట్ట‌లేదు. శ్రియ త‌ప్ప ఈ పాత్ర‌ని ఎవ్వ‌రూ చేయ‌లేరు.. అని చిత్ర‌బృందం అంతా బ‌ల్ల‌లు విరిగేలా గ‌ట్టిగా చెప్పింది. కాక‌పోతే.. ఆ స్థాయిలో మాత్రం ఆమె న‌ట‌నా పాట‌వాలు తెర‌పై క‌నిపించ‌లేదు. బ్ర‌హ్మానందం, అలీ… వీళ్లంతా ఉన్నార‌న్న పేరుకే. అనసూయ జ‌ర్న‌లిస్టుగా క‌నిపించింది.

సాంకేతికంగా చూస్తే… స‌ర్వేష్ మురారి కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. మ‌రీ ముఖ్యంగా ఫైట్ సీన్ల‌లో. త‌మ‌న్ బాణీల్లో రెండు బాగున్నాయి. నేప‌థ్య సంగీతంలో పెద్ద‌గా డెప్త్ లేదు. రొటీన్ సౌండ్లే వినిపించాయి. డైమండ్ ర‌త్న‌బాబు మాట‌లు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. మ‌రీ ముఖ్యంగా పొలిటిక‌ల్ డైలాగుల విష‌యంలో. ఈ క‌థ మ‌ద‌న్‌ది కాదు. మాట‌లూ తాను రాయ‌లేదు. అందుకే ఈ క‌థ‌ని ఓన్ చేసుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డ్డాడేమో అనిపిస్తుంది. తాను కూడా మోహ‌న్ బాబు న‌ట‌న‌ని, మ‌రీ ముఖ్యంగా గాయ‌త్రి ప‌టేల్‌నే న‌మ్ముకున్నాడు. ఆ పాత్ర ఎంట‌ర్ అయ్యే వ‌ర‌కూ క‌థ‌ని న‌డిపించ‌డంలో ఇబ్బంది ప‌డ్డాడు.

తీర్పు :

మోహ‌న్‌బాబుకి ఓ ప్ర‌త్యేక‌మైన శైలి అంటూ ఉంది. గాయ‌త్రి ప‌టేల్‌లో అది క‌నిపిస్తుంది. చాలా రోజుల త‌ర‌వాత‌… త‌న వ‌ర‌కూ త‌న పాత్ర వ‌ర‌కూ న్యాయం చేశాడు మోహ‌న్ బాబు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎంఏ లాంటి పాత్ర‌లో కాసేప‌యినా మ‌ళ్లీ మోహ‌న్‌బాబుని చూడాల‌నుకుంటే ఈ సినిమాకి వెళ్లొచ్చు. ఛాయిస్ ఈజ్.. యువ‌ర్స్‌

ఫినిషింగ్ ట‌చ్‌: కొన్ని ‘పొలిటిక‌ల్ పంచ్‌’ల కోసం…

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com