ప్రపంచంలోనే విజయవంతమైన టీ20 లీగ్ గా పేరు తెచ్చుకొన్న ఐపీఎల్ సందడి మరోసారి ప్రారంభం కాబోతోంది. ఈరోజు నుంచే 19వ సీజన్ శ్రీకారం చుట్టుకోనుంది. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సమరంలో మొత్తంగా 74 మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్ లో బెంగళూరు చిన స్వామి స్టేడియంలో జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడబోతోంది.
ఇప్పటి వరకూ 18 సీజన్లు జరిగితే చెన్నై, ముంబై చెరో 5సార్లు టైటిళ్లు గెలిచాయి. కొలకొత్తా మూడుసార్లు కప్పుకొట్టింది. హైదరాబాద్ రెండుసార్లు, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు చెరోసారి విజేతలుగా నిలిచాయి. ఎప్పుడూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగే చెన్నై గతేడాది సరైన ఆటతీరు కనబర్చలేదు. ముంబైలో స్టార్లు ఉన్నా, వాళ్లు ఫామ్ లో లేకపోవడం జట్టుని కలవర పెడుతోంది. సన్ రైజర్స్ లో విధ్వంసకరమైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లంతా కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది. గతేడాది కప్పు గెలిచి అభిమానుల ఆశలు నెరవేర్చిన ఆర్సీబీ కే ఈసారి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు చెబుతున్నారు. గుజరాత్, కొలకొత్తా జట్టని కూడా తక్కువ అంచనా వేయలేం. ఎలాంటి ప్రత్యర్థిపైనైనా చెలరేగే సత్తా ఈ జట్లకు ఉంది. ఢిల్లీ తొలిసారి కప్పు కొట్టడానికి ఉవ్వీళ్లూరుతోంది. ప్లే ఆఫ్ లో ఢిల్లీ ప్రదర్శన స్థాయికి తగ్గట్టు ఉండడం లేదు. అందుకే లీగ్ మ్యాచ్లో బాగా ఆడినా, సెమీస్ చేరలేకపోతోంది.
ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. విరాట్, రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి.. ఈ ఐపీఎల్ లో వాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. ప్రతీ జట్టులోనూ యువ ఆటగాళ్లు కనిపిస్తున్నారు. ఫ్రాంచైజీలు వాళ్లపై కూడా ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నాయి. భవిష్యత్తులో స్టార్లుగా మారే సత్తా ఆ ఆటగాళ్లలో ఉంది. వాళ్లపై ఈసారి గట్టిగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతీసారీ ఐపీఎల్ లో సంచలనాలు నమోదు అవ్వడం సహజం. 20 ఓవర్లలో 300 పరుగుల మైలు రాయికి తగ ఐపీఎల్ లో దగ్గరగా వచ్చారు. ఈసారి దాన్ని అందుకొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఛేజింగుల్లోనూ కొత్త రికార్డులు చూసే అవకాశం ఉంది.