విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా, ఒక భారీ ఆర్థిక ఇంజిన్‌గా అవతరించబోతోంది. విమానాశ్రయం చుట్టూ సుమారు 2,000 ఎకరాల్లో ఎయిరో సిటీ ని నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ ఖరారైంది. ఇందులో అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్ పార్కులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీలు , భారీ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా, ఉత్తరాంధ్ర మొత్తం ఒక గ్లోబల్ బిజినెస్ సెంటర్‌గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎయిరో సిటీ మాస్టర్ ప్లాన్ ప్రకటనతో భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న భూముల ధరలు ఇప్పుడు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన రహదారి పక్కన ,విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.5 కోట్ల మార్కును తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు, ఎన్నారైలు , హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ భారీ ఎత్తున భూములను కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఎయిరో సిటీకి అనుగుణంగా భోగాపురం ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు నిర్మిస్తున్న 60 మీటర్ల వెడల్పు గల తీరప్రాంత కారిడార్పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 30-40 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీనికి తోడు 15 కొత్త లింక్ రోడ్ల నిర్మాణం, మెరుగైన విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ అభివృద్ధిని చూసి రియల్టర్లు ఇక్కడ భారీ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు.
విమానాశ్రయ నిర్మాణం ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి కావడంతో, జూన్ 2026 నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోపే తమ పెట్టుబడులను ఆస్తిగా మార్చుకోవాలని ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. కేవలం నివాస అవసరాలకే కాకుండా, కమర్షియల్ స్పేస్ ,వేర్‌హౌసింగ్ రంగాల్లో కూడా ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో భోగాపురం ప్రాంతం విశాఖపట్నం నగరంలో ఒక భాగంగా కలిసిపోయి, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ జోన్‌గా అవతరించడం ఖాయమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
