ప్రపంచం అంతా కుగ్రామం. ఎక్కడో రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే మిగతావి సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఆ రెండు దేశాల యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉంటుంది. ప్రజంలదరి జీవితాలను క్లిష్టం చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధజ్వాలలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న క్షిపణి ప్రయోగాలు ఎప్పుడు శాంతిస్తాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ సుదూర ప్రాంతపు యుద్ధం మనకు నేరుగా సంబంధం లేకపోయినా, భారత్‌పై దాని ప్రభావం అప్పుడే మొదలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి వంటింటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అన్ని రంగాలను కలవరపెడుతున్నాయి.
ప్రజలపై పడిపోతున్న గ్యాస్ బాంబు
ముఖ్యంగా ఇంధన రంగంపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే అనేక చోట్ల గ్యాస్ కొరత మొదలైంది. దీనివల్ల నిర్వహణ భారమై హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తోంది. హోటళ్లకు గ్యాస్ సరఫరాను కేంద్రం నియంత్రిస్తోంది. కేవలం వంట గ్యాస్ మాత్రమే కాకుండా, రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో స్విగ్గి, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ పార్టనర్ల దగ్గర నుంచి హోటళ్లలో పని చేసే వారి వరకూ కొన్ని లక్షల మందికి ఉపాధికి కష్టమవుతోంది.
నిలిచిపోతున్న ఎగుమతులు
భారత ఎగుమతులపై కూడా ఈ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియా మార్గాల ద్వారా జరిగే వాణిజ్యం నిలిచిపోవడం వల్ల వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, బీమా ప్రీమియంలు అధికం కావడంతో విదేశీ వాణిజ్యం కుంటుపడుతోంది. ఇది దేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది భారతీయుల భద్రత ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
చిక్కుపోయిన వారి తరలింపు పెద్ద యుద్ధం
యుద్ధం తీవ్రతరమైతే అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుంది. గతంలో ఇటువంటి పరిస్థితుల్లో చేపట్టిన తరలింపు ప్రక్రియలు ఎంతో ఖర్చుతో, రిస్క్‌తో కూడుకున్నవిగా నిలిచాయి. విమాన ప్రయాణ మార్గాలు మూతపడటం, విమాన ఇంధన ధరలు పెరగడం ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రతి ఒక్క పౌరుడిపై ఆర్థిక భారం పడటంతో పాటు సామాజిక ఇబ్బందులు తప్పవు.
నిజానికి ఈ యుద్ధం విషయంలో భారత్ పాత్ర ఏమీ లేదు. కానీ యుద్ధ పరిణామాలు మాత్రం అనుభవించాల్సి వస్తోంది. ఇక నుంచి దేశంలోని ప్రతి ఒక్కరిపై యుద్ధ ప్రభావం కనిపించడం ఖాయమే. అంటే మన బతుకుపోరాటం మరింత ఉద్ధృతం చేయాల్సి ఉంటుంది.
