పశ్చిమాసియా నెలకొన్న యుద్ధ వాతావరణం ఇప్పుడు క్షిపణుల స్థాయిని దాటి, దేశాధినేతల అహం చుట్టూ తిరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో ఇక ఛేదించడానికి టార్గెట్లు లేవు అని ప్రకటించారు. కానీ యుద్ధం ఆగడం లేదు. ఇరాన్ భీకరమైన దాడులు చేస్తోంది. యుద్ధం ఆపాలంటే మూడు షరతులు పెట్టింది. ఇక ఇజ్రాయెల్ కూడా ఇది సుదీర్ఘ పోరాటమని సంకేతాలు పంపుతోంది. ట్రంప్ మాట వినేందుకు సిద్ధంగా లేదు.
ట్రంప్ ఈగో – ఇరాన్ వెటకారం
యుద్ధాన్ని తానే ముగించగలనని ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా, తానొక ‘వరల్డ్ డీల్ మేకర్’ అనిపించుకోవాలని ట్రంప్ తాపత్రాయపడ్డారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ తన క్షిపణి కేంద్రాలను భూగర్భంలోకి మార్చడం వల్ల, పైన కనిపించే టార్గెట్లు అయిపోయి ఉండవచ్చు కానీ, ఇరాన్ శక్తి ఇంకా పూర్తిగా నశించలేదు. ఆ విషయం ట్రంప్‌కు కూడా తెలుసు. ట్రంప్‌కు తెలిసేలా చేయడానికి ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలనూ వదలడం లేదు.
యుద్ధం ఆగేది కాదంటున్న ఇజ్రాయెల్
అమెరికా మాటను ఇజ్రాయెల్ ఎందుకు పట్టించుకోవడం లేదంటే, అక్కడ ప్రధాని నెతన్యాహు మనుగడ ఈ యుద్ధంపైనే ఆధారపడి ఉంది. ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఆయన ఈగోను సంతృప్తి పరుచుకుంటున్నారు. మిత్రదేశమైన అమెరికా మాట వింటే తాను బలహీనుడిని అవుతాననే భయం కూడా ఇజ్రాయెల్ పాలకుల్లో కనిపిస్తోంది. ఇక్కడి దాకా వచ్చాక అమెరికా మాటల్ని వినేందుకు నెతన్యాహు కూడా సిద్ధంగా లేరు. అదే సమయంలో ఇరాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. అయినా సరే యుద్ధం ఆపేందుకు సిద్ధంగాలేదు. ఇరాన్ తన దేశం ఆర్థికంగా చితికిపోతున్నా యుద్ధ నష్టపరిహారం కావాలని షరతులు పెట్టడం వెనుక తమ పతనాన్ని అంగీకరించలేకపోవడమే ప్రధాన కారణం. తాము ఓడిపోయామని అంగీకరిస్తే ఇస్లామిక్ విప్లవ పునాదులే కదిలిపోతాయనేది వారి ఆందోళన. అందుకే, మేము ఇంకా బలంగానే ఉన్నాం అని ప్రపంచానికి చూపించడానికి అప్పుడప్పుడు క్షిపణులను ప్రయోగిస్తూ, అసాధ్యమైన షరతులను తెరపైకి తెస్తోంది.
ముగింపు లేని యుద్ధం – ఈగోలే కారణం
ఈ యుద్ధంలో ఇప్పుడు ఎవరూ గెలవడం లేదు, ఎవరూ ఓడిపోవడం లేదు. కానీ, నేను ఓడిపోలేదు అని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే లక్షలాది మంది సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. పాలకుల వ్యక్తిగత ప్రతిష్టలు దేశ శ్రేయస్సు కంటే పెద్దవిగా మారడం వల్లే యుద్ధ విరమణ అనేది అసాధ్యంగా కనిపిస్తోంది. శాంతి చర్చల కంటే శత్రువును ఎంత ఎక్కువగా అవమానించాం అనే దానికే ప్రాధాన్యత పెరిగింది. ప్రజల ప్రాణాల కంటే తమ ఈగోలే ముఖ్యమనుకునే పాలకులు ఉన్నంత కాలం యుద్ధాలు ముగియవు. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్నది కేవలం రక్షణ పోరాటం కాదు.. అది తగ్గేదే లే అనే అహంకార పోరాటం. ఈ చిక్కుముడి వీడాలంటే ఎవరో ఒకరు తమ అహాన్ని పక్కన పెట్టాలి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగే సూచనలు కనిపించడం లేదు.


