ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ధృవీకరించింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలకమైన సైనిక నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త ధృవీకరణ కావడంతో ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. దశాబ్దాల కాలం పాటు ఇరాన్ రాజకీయ, సైనిక వ్యవస్థను శాసించిన ఒక శకం దీనితో ముగిసింది.
ఖమేనీ మరణంతో యుద్ధం ముగుస్తుందా?
ఖమేనీ మరణంతో అమెరికా, ఇజ్రాయెల్ పంతం నెగ్గినట్లయింది. అయితే యుద్ధం ముగిసిపోతుందా అంటే చెప్పడం కష్టం. ఖమేనీ చనిపోయినా ఇరాన్ లొంగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, నాయకత్వ బాధ్యతలను తాత్కాలికంగా ముగ్గురు సభ్యుల కౌన్సిల్ స్వీకరించింది. కానీ క్షేత్రస్థాయిలో పట్టున్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతీకారేచ్ఛతో ఉంది. ఇప్పటికే అమెరికా స్థావరాలపై , ప్రాంతీయ మిత్రదేశాల లక్ష్యాలపై ఇరాన్ క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. నాయకత్వ శూన్యతను పూడ్చుకునే క్రమంలో ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.
ఆపరేషన్ ఇంకా ముగియలేదంటున్న అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను ధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు లభించిన గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ఇరాన్ పాలనలో మార్పు రావాలని అమెరికా ఆశిస్తున్నారు. అంటే లొంగిపోవాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఇరాన్ అణు , క్షిపణి వ్యవస్థలే తదుపరి లక్ష్యాలని స్పష్టం చేశారు. ఈ పరిణామం వల్ల మధ్యప్రాచ్యం ఒక్కసారిగా అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. దుబాయ్, బహ్రెయిన్ వంటి వాణిజ్య కేంద్రాలపై దాడులు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరాన్లో అమెరికా మాట వినే ప్రభుత్వం వస్తేనే శాంతి
ప్రస్తుతం ఇరాన్ తన తదుపరి వారసుడిని ఎన్నుకునే ప్రక్రియలో ఉంది. ఖమేనీ కుమారుడు వారసుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అమెరికా ప్రోద్భులంతో అధికార మార్పిడి సజావుగా సాగదని.. అంతర్గత తిరుగుబాట్లకు దారితీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ లోపల అంతర్యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తితే, అది ప్రపంచ చమురు సరఫరాను , ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. యుద్ధం ఆగిపోవడానికి బదులు, ఇది ఒక సుదీర్ఘమైన ప్రాంతీయ సంఘర్షణకు ఆరంభంగా మారుతుందేమోనన్న భయం గల్ఫ్ దేశాల్లో నెలకొంది. అందుకే ఖమేనీ అంతంతో అన్నీ అయిపోలేదు.. అసలు సమస్యలు ముందున్నాయని ప్రపంచదేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
