ఏపీలో గ్రూప్ వన్ లో అక్రమాలు చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. టీడీపీ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ .. నియామకాలు జరిగే సరికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే అసలు డ్రామా ప్రారంభమయింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ను వేధించారు. చాంబర్ కు కూడా రానివ్వకుండా తాళాలేశారు. సెక్రటరీగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు కథ నడిపారు. అప్పటికే అయిన మూల్యాంకనాన్ని మళ్లీ డిజిటల్ మూల్యంకనం పేరుతో మార్చేశారు. మళ్లీ మాన్యువల్ చేశారు. ఈ కథ అసలు పేపర్లు దిద్దకుండానే మార్కులు వేయడంతో జరిగిపోయింది.
కామ్ సైన్ అనే కంపెనీకి పేపర్లు దిద్దినందుకు డబ్బులు ఇచ్చారు. అసలు ఆ కంపెనీకి మ్యాన్ పవర్ లేదు. ఈ కంపెనీ ఎవరిదంటే..ధాత్రి అనే మీడియా కంపెనీ ఓనర్ ది. ఆయన పేరు మధుసూదన్ . ఓ జర్నలిస్టు. వైఎస్ సీఎం అయ్యాక రాత మారిపోయింది. ధాత్రి పేరుతో ప్రత్యక్ష ప్రసారాల కంపెనీ పెట్టి సొమ్ము చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిదే రాజ్యం. కోట్లకు కోట్లు గడించారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలకు.. గ్రూప్ వన్ అభ్యర్థుల పేపర్లు దిద్దడానికి సంబంధం ఏమిటో స్కాం స్టర్లకే తెలియాలి.
ఈ అక్రమాలు చేయడం వల్ల ఎంతో మంది అనర్హులు ఉద్యోగులకు వచ్చారు. అర్హులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో కొంత మంది సివిల్స్ రాసి ఎంపికయ్యారు. మిగిలిన వారు నిరాశలో మునిగిపోయారు. అక్రమాలకు పాల్పడి గ్రూప్ వన్ లో చేరిన వారు ఇప్పుడు కీలక పొజిషన్లలో ఉండి ఉంటారు. గతంలో హైకోర్టు వీరందరి నియామకాలను రద్దు చేసింది.కానీ.. తర్వాత డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో వ్యక్తులను టార్గెట్ చేయడమే కాకుండా… గ్రూప్ వన్ లో నిజాయితీగా ఉద్యోగం సాధించిన వారికి న్యాయం చేయాల్సి ఉంది. తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది.