అఖండ 2 అనుకోకుండా వాయిదా పడడంతో చిత్రసీమలో చాలా సమీకరణాలు మారబోతున్నాయి. డిసెంబరు 5న అఖండ రావాలి. కానీ వాయిదా పడింది. డిసెంబరు 12, 25.. ఇలా రెండు డేట్లు మంచి ఆప్షన్లు. ఏ డేట్ కి వచ్చినా మిగిలిన సినిమాల షెడ్యూల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా 12, 25 తేదీల్లో రాబోతున్న చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఇదో పెద్ద తలనొప్పి.
మరోవైపు ఓటీటీ డీల్ కి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ కూడా చిత్రసీమలో జోరుగా నడుస్తోంది. అఖండ 2 ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ చేజిక్కించుకొంది. డిసెంబరు 5 డేట్ ఫిక్స్ చేసింది కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థే. డిసెంబరు 5న అనుకొన్నట్టుగానే సినిమా వచ్చేస్తే… 4 వారాల గ్యాప్ లో అంటే, అటూ ఇటుగా సంక్రాంతి సమయంలో ఓటీటీలో సినిమా రావాలి. దానికి తగ్గట్టుగానే నెట్ ఫ్లిక్స్ సంస్థ షెడ్యూల్ ఫిక్స్ చేసుకొంటుంది. అయితే అఖండ 2 రిలీజ్ ఆగిపోవడంతో నెట్ ఫ్లిక్స్ షెడ్యూల్ కూడా మారే అవకాశం ఉంది.
ఓటీటీ సంస్థలు కంటెంట్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాయి. మరీ ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్. ఈ సంస్థ ఓ డేట్ ఫిక్సయితే.. ఆ సమయానికి కంటెంట్ ఇచ్చేయాల్సిందే. అఖండ 2 వాయిదా వల్ల, నెట్ ఫ్లిక్స్ కూడా ఓటీటీ డేట్ మార్చుకొంటుందా, లేదంటే ముందే అనుకొన్నట్టు సంక్రాంతికి విడుదల చేసేస్తుందా? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
సహజంగా నెట్ఫ్లిక్స్ తన డేట్ మార్చుకోవడానికి ఇష్టపడదు. అంటే.. అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అయినా సరే, ఓటీటీలో మాత్రం ముందు అనుకొన్న సమయానికి వచ్చేస్తుంది. ఇది అఖండ 2 థియేట్రికల్ రన్ కి ప్రమాదం. ఒకవేళ.. డేట్ మార్చాల్సివస్తే, ముందు అనుకొన్న మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ నిర్మాతలకు చెల్లిస్తుందా, లేదంటే.. అందులో కోత పెడుతుందా అనేది మరో అనుమానం. ఉదాహరణకు అఖండ 2 ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ రూ.70 కోట్లకు కొనుగోలు చేసిందనుకొంటే, రిలీజ్ విషయంలో గందరగోళం వల్ల ఈ మొత్తంలో కొంత తగ్గిస్తానని నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. డిసెంబరు 25న అఖండ 2 రిలీజ్ అయితే.. ఓటీటీ లెక్కల ప్రకారం 4 వారాల గ్యాప్ లో అంటే, జనవరి నెలాఖరున ఓటీటీలో చూడాలి.
