తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి అమిత్ షా పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అది అసాధ్యమని ఆయనకు తెలియనిది కాదు. అయితే, కనీసం సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి కేడర్ కృషి చేయాలనేది ఆయన ఉద్దేశమట. హన్మకొండ సభలో కేసీఆర్ మీద, తెరాస ప్రభుత్వం మీద అమిత్ షా నిప్పులు చెరిగారు. అగ్గిరాజేశారు. అంతే, హరీష్ రావు, కవితతో పాటు తెరాస నేతలు చాలా మంది ఎదురు దాడి మొదలుపెట్టారు.
రాజకీయ వ్యూహ చతురుడిగా అమిత్ షా ప్రతిభ ఏమిటో చాలా మందికి తెలిసిందే. యూపీలో చక్రం తిప్పినప్పుడే ఆయన
ఎంత గొప్ప ఆర్గనైజరో అర్థమైంది. బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడం ద్వారా యూపీలో ఆయన అద్భుతాలు చేశారు. మోడీ మేజిక్ ను మూలమూలకూ వ్యాపింప చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసి సఫలమయ్యారు.
అయితే యూపీ వేరు. తెలంగాణ వేరు. యూపీలో చావో రేవో అన్నంత పట్టుదలగా పనిచేసే కేడర్ ఉండి ఉండొచ్చు. అక్కడి నాయకులు మడమతిప్పని విధంగా ముందుకు దూసుకుపోయే వారై ఉండొచ్చు. తెలంగాణలో అలాంటి వారు కనిపించడం చాలా అరుదు. పార్టీ ద్వారా పదవులు, ఇతరత్రా మేలు పొందిన నేతలు చాలా మంది ఇప్పుడు నామ్ కే వాస్తేగా పనిచేస్తున్నారు. అమిత్ షా రచించిన వ్యూహాన్ని అమలుచేయడానికి కూడా పెద్దగా కష్టపడని వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయి నుంచి అదే పరిస్థితి.
రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన తర్వాత పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందని అమిత్ షా భావించారట. ఆ మేరకు ప్రయత్నం జరుగుతున్నా అంతా స్లోమోషన్లోనే కనిపిస్తోందని ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నారట. అసలు తెలంగాణలో బీజేపీకి ఏమైందనేది పార్టీ పెద్దలకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు బీజేపీ అనామక పార్టీగా ఉన్న అస్సాంలో ఇప్పుడు అధికార పార్టీ. చివరకు, బెంగాల్, కేరళల్లోనూ రాజకీయ ప్రత్యర్థులను, కొన్ని చోట్ల రౌడీ రాజకీయ వేత్తలను ఎదుర్కోవడానికి బీజేపీ శ్రేణులు వెనుకాడటం లేదు.
తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగానే ఉందనేది బీజేపీ నాయకత్వం అంచనా. దీన్ని వీలైనంత క్యాష్ చేసుకోవాలంటూ అమిత్ షా రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఆయన వ్యూహాలను అనుసరించి కమలాన్ని వికసింప చేయడంలోరాష్ట్ర నాయకత్వం చురుగ్గా పనిచేస్తుందా అనేది ప్రశ్న.