వైసీపీ ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాల్లో ఒకటి రైతు భరోసా. రూ. పన్నెండున్నర వేలు ప్రతీ ఏడాది మేలో రైతు అకౌంట్‌లో వేస్తామని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత కేంద్రం ఆరు వేలు మూడు విడతల్లో ఇస్తోంది కాబట్టి తాను ఏడున్నరవేలే ఇస్తానన్నారు. వాటిని కూడా మూడు విడతలు చేశారు. మొదటి విడతలో రూ. ఐదున్నర వేలు మాత్రమే ఒక్కో రైతుకు ఇస్తారు. మొదటి రెండేళ్లు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత సమయం దగ్గర పడింది. ప్రతీ ఏడాది మేలో ఇస్తారు. ఈ ఏడాది మే ప్రారంభం అయింది కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
రైతు భరోసా కోసం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.7,020 కోట్లు కేటాయించింది. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయింది. అనర్హుల తొలగింపు, అర్హుల నమోదు ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి అయింది. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపించారు. అర్హులను ఖరారు చేసి ఆర్బీకేల్లో జాబితాను ప్రదర్శించాల్సి ఉంది. ఈ విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది . ఈ నెల జీతాలివ్వడానికే ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఇప్పుడు అర్జంట్‌గా జీతాల కోసమే కనీసం మూడు, నాలుగు వేల కోట్ల రుణాలు తెచ్చుకోవాలి.
జీతాలు, పెన్షన్ల గండం దాటేసిన తర్వాత నిధులు సమకూర్చుకుని రైతు భరోసా విడుదల చేయాల్సి ఉంటుంది. ఒక వేళ వాయిదా పడితే ప్రభుత్వానికి గండమే. ఎందుకంటే వచ్చే నెలలో అమ్మఒడి పథకం అమలు చేయాల్సి ఉంటుంది. దానికి ఇంకా ఎక్కువ నిధులు అవసరం. ఈ పరిస్థితుల కారణంగా రైతు భరోసా పై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్తారా లేకపోతే ఆర్థిక సమస్యల కారణం చెప్పి.. ఏదైనా ప్రకటన చేస్తారా అన్న సందేహం రైతుల్లో వినిపిస్తోంది.