గోడపై బాబు బొమ్మ

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంట్లో తన బొమ్మ ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారా? ప్రజల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని కలలుకంటున్నారా? నాటి వైఎస్సార్ సొంతం చేసుకున్నదానికంటే మించిన ప్రజాభిమానాన్ని బాబు అందుకోవాలనుకుంటున్నారా? అందుకు ఇప్పటివరకూ ఆయనేం చేశారు? ఇక ముందు ఏం చేయాలి? వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారు? ప్రజల రాజధానితో బాబు ప్రజల ముఖ్యమంత్రిగా ఎదగబోతున్నారా?

చంద్రబాబుకి ఒక కోరిక చాలాకాలం నుంచీ ఉంది. ప్రజలందరి ఇళ్లలో తన బొమ్మ గోడకు వ్రేలాడుతుండాలన్నదే ఆ కోరిక. ప్రజానేతగా అందరి మనసుల్లో దేవుడనిపించుకోవాలనుకుంటున్నారు. ఇందులో తప్పేమీలేదు. మనిషి దేవుడుగా మారితే అంతకంటే ఆనందించే విషయం మరొకటి ఉండదు. కాకపోతే అలాంటి అవకాశం వచ్చినప్పుడు కళ్లుతెరవాలి. నిస్వార్థంతో పనిచేసి మనుషుల్లో దేవుడనిపించుకోవాలి. ఇలాంటి అవకాశం దశాబ్దం క్రిందటే బాబుకు ఓసారి వచ్చింది. అప్పట్లో హైటెక్ ఉద్యోగాల వెల్లువతో బాబు ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే, ఎన్నారైలు బాబుని తమ గుండెల్లో దాచుకునేటంతగా. అందుకేనేమో ఇప్పటికీ ఎన్నారైలు బాబుని గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయంపాలై గద్దెదిగడంతో ఈ అవకాశం బాబు నుంచి చేజారిపోయింది. పదేళ్లపాటు కాంగ్రెస్ పాలన నడిచింది. గతం గతః.. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం మరోసారి బాబుకు తన ఇమేజ్ పెంచుకునే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అది, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ రూపంలో.

సదవకాశాలు ఎప్పుడోగానీ రావు. అలా వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం 2004లో పతనమైన తర్వాత కాంగ్రెస్ పాలనను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒంటిచేత్తో లాక్కొచ్చారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను భేషుగ్గా నడిపించి సంక్షమ ఫలాలు అందుకుంటున్న వారి గుండెల్లో కొలువయ్యారు. ఆయన `ప్రజలముఖ్యమంత్రి’గా గుర్తింపుపొందారు. ప్రజలను ఆత్మీయంగా పలకరించడం, వారి బాగోగులు తానే చూస్తున్నానన్న అభిప్రాయం కలిగించడంలో వైఎస్సార్ ఆనాడు సఫలీకృతులయ్యారు. నిజానికి సంక్షేమ పథకాలకు అవసరమయ్యే డబ్బు ఆయన జేబులోనుంచి తీయలేదు. పైగా వాటిలో కొన్ని కేంద్ర పథకాలే. కానీ, అవికూడా తనే అందజేస్తున్నట్లు ప్రజల్లో భ్రాంతి కలిగించారు. మొదటి ఐదేళ్ల పాలన ముగిసే సమయానికి వైఎస్సార్ ని ప్రజలు దేవుడని భావించే స్థితికి చేరుకున్నారు. వైఎస్సార్ కరుణిస్తే వర్షాలు పడతాయి, లేదంటే పడవన్నంతగా జనం ఆయన్ని నమ్మారు. చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా వైఎస్సార్ లేకపోతే తెలుగురాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదన్న అభిప్రాయానికి వచ్చేసింది. తిరుగులేని నేతగా ఎదిగారు వైఎస్సార్. రాష్ట్రంలో ఏమారుమూల గ్రామానికి వెళ్ళినా, ఇళ్లలో వైఎస్సార్ ఫోటోలు కనిపించేవి. ఆయన్ని తమ దేవుడిగా భావించేవారు. చెదరని చిరునవ్వు, తెలుగుతనం ఉట్టిపడేలా దుస్తులు వేసుకుని, కళ్లతోనే ప్రేమాభిమానాలతో పలకరించే ఈ నాయకుడు చాలామంది గుండెల్లో దేవుడిగా స్థిరపడ్డాడు. అయితే అదే సమయానికి ఆయనపైనా ఆయన కుమారుడైన జగన్ పైనా అనేకానేక ఆరోపణలు ముసురుకున్నాయి. కుంభకోణాలు జరిగినట్లు వార్తలు వ్యాపించాయి. కానీ ఇవన్నీ వైఎస్సార్ ఇమేజ్ ని ఏమాత్రం కదిలించలేకపోయాయి. రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒంటిచేత్తో కాంగ్రెస్ కు విజయం అందించారు వైఎస్సార్. తిరుగులేని ప్రజానాయకునిగా మారిన సమయంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడు తమమధ్యలేనందుకు జనం కుమిలిపోయారు. ఆయనకు ఘనంగా నివాళిలర్పించారు. ఇప్పటికీ అర్పిస్తూనే ఉన్నారు.

ఆన్ లైన్ బొమ్మ

ఇదంతా చంద్రబాబు గమనిస్తూనే ఉన్నారు. తనకు అంతకు ముందు వచ్చిన అవకాశం చేజారిపోయినందుకు చింతించారు. అవకాశం కోసం ఎదురుచూశారు. రాష్ట్ర విభజనతో ఆ అవకాశం చంద్రబాబుకు మరోసారి వచ్చింది. రాజధానిలేని రాష్ట్రం ఆయనకు కలిసొచ్చే అంశమైంది. కేంద్రం నుంచీ విదేశాల నుంచీ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే వీలుచిక్కింది. అందుకే ఆయన ప్రజల రాజధాని అంటూ ప్రజల ముఖ్యమంత్రిగా ఎదగాలనుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ప్రజలచేత శహభాష్ అనిపించుకోవాలని తపనపడుతున్నారు. అందుకు అందివచ్చే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటింటికీ ఆయన బొమ్మ చేరే పథకం ఒకటి ఇప్పుడు సాకారమైంది. అదే మై బ్రిక్ మై అమరావతి పథకం.

AMARAVATHI - Naag Donation

ఆన్ లైన్ ద్వారా ఒక్కో ఇటుక పదిరూపాయలకు కొని ఆ మొత్తాన్నీ అమరావతి నగర నిర్మాణానికి విరాళంగా అందించే సదుపాయం ఏర్పడింది. అలా ఇ-బ్రిక్స్ అందించేవారికి ఆన్ లైన్ ద్వారా అధికారిక ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ మీద ఎడమ వైపున చంద్రబాబు బొమ్మ, కుడివైపున రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉంటాయి. ప్రజల రాజధాని అమరావతి అందజేస్తున్న ప్రశంసాపత్రంలో చివర్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి అంటూ సతకం కూడా ఉంటుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అమరావతిపట్లా, చంద్రబాబు పట్ల గౌరవం ఉన్నవారు దాన్ని ప్రింట్ తీసుకుని ఫ్రేమ్ కట్టించుకుని గోడకూ తగిలించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసాపత్రం కావడంతో కించత్ గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఒక మంచి కార్యం తాను చేపట్టినట్లు మాటలతో చెప్పడంకాదు, చేతల్లో చూపిస్తున్నారు చంద్రబాబు. దీంతో ప్రజల నుంచి కదలిక వచ్చింది. http://amaravati.gov.in అనే వెబ్ సైట్ ద్వారా మై బ్రిక్, మై అమరావతి పథకం క్రింద ఇటుకలు అందజేయవచ్చు. ఈ కార్యక్రమానికి మొదటిరోజునే విశేషస్పందన వచ్చింది. అయితే మీడియా ఈ వెబ్ సైట్ పేరును సరిగా చెప్పకుండా `మైబ్రిక్ మై అమరావతి’ వెబ్ సైట్ అంటూ తప్పుదోవపట్టించినప్పటికీ చాలామంది సరైన వెబ్ సైట్ ని వెతికి పట్టుకుని విరాళాలు కట్టారు. రెండోరోజు సాయంత్రం వేళకు డోనార్స్ సంఖ్య 11,781కి చేరింది. అప్పటికే 7లక్షల 91వేల 580 ఇటుకలు (ఒక్కో ఇటుక పది రూపాయల చొప్పున) అమరావతి నిర్మాణానికి కొని అందజేశారు. వెబ్ సైట్ పై అవగాహన పెరిగితే స్పందన ఇంకా బాగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపనకు వచ్చేటప్పటికీ ప్రజల నుంచే కోట్లాది రూపాయలు అమరావతి నిర్మాణానికి సిద్ధం అవుతాయనడంలో సందేహంలేదు. దీన్ని ప్రభుత్వం ఉడతా సాయంగా భావించకూడదు. మహాసాయంగానే గుర్తించాలి. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి.

కోట్లకుకోట్లు డబ్బు వస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం కంకణధారి అయిన వ్యక్తి (చంద్రబాబు)పై నమ్మకమూ పెరుగుతోంది. అంతా పారదర్శకంగానే ఉన్నట్లు కనబడుతోంది. కానీ ఇంకా అనుమానలతెరలు మాత్రం తొలిగిపోవడంలేదు. ఎక్కడ ఏ కుంభకోణం చోటుచేసుకుంటుందోనన్న శంక పీడిస్తూనే ఉంది. ప్రజల సొమ్ము కూడా తీసుకుంటున్న చంద్రబాబు మరింత జాగ్రత్తగా ఈ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పారదర్శకతే ప్రమాణికంగా సాగించాలి. అంతా సవ్యంగా జరిగి కలల రాజధాని నిర్మితమైతే , ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే, ప్రతి ఇంట్లో ఆనందం వెళ్ళివిరిస్తే అప్పుడు…అప్పుడు… బాబు నిజంగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఎంతో ఆత్మీయంగా పలకరిస్తుంటుంది. లేదంటే ఈ ఆన్ లైన్ చిత్రాలు, సర్ఠిఫికేట్లు ఏవీ పనిచేయవు. వాటిని చించి అవతలపారేస్తారు. బాబు చేష్టలను దుమ్మెత్తిపోస్తారు. ఎన్నికల్లో తరిమితరిమి కొడ్తారు. ఇంట్లో ఉన్న ఆనవాళ్లను బయటకు గిరాటేస్తారు. ప్రజలు ఈ రెంటికీ సిద్దంగానే ఉన్నారు. మరి ఏదారిన వెళ్ళాలన్నది బాబే డిసైడ్ చేసుకోవాలి. ఇక మనచేతుల్లో ఏమీలేదు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com