పార్టీ వీడుతున్న ఎమ్మెల్యే లు బాబుకు మేలు చేస్తున్నారా?

రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ లు సర్వ సాధారణం అయిపోయాయి. మరీ ముఖ్యంగా గత పదిహేనేళ్లలో ఆపరేషన్ ఆకర్షలు, ఆపరేషన్ స్వగృహ లు, మరీ ఎక్కువైపోయాయి. గతంలో మన పార్టీలో పని చేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు అయితే ఆపరేషన్ స్వగృహ, కొత్తగా మన పార్టీలోకి వస్తున్న వాళ్లయితే ఆపరేషన్ ఆకర్ష అన్నమాట. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి నాయకులు వైఎస్సార్సీపీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఝలక్ తగులుతుందని చాలా మంది విశ్లేషిస్తుంటే, మరొక వర్గం విశ్లేషకులు మాత్రం జంపింగ్ జపాంగ్ లు చంద్రబాబుకు మేలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అదెలాగంటే..

నియోజకవర్గాల పెంపు లేని కారణంగా టిడిపికి ఇబ్బందులు వస్తాయని ఊహించారు:

గత నాలుగేళ్లలో చంద్రబాబు ఫిరాయింపులను విస్తృతంగా ప్రోత్సహించారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సీపీ నుండి తన పార్టీలోకి లాక్కున్నారు. దీని మీద జగన్ ఎంత గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. అఫ్ కోర్స్ తెలంగాణలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నన్నప్పుడు చంద్రబాబు ఇలాగే గగ్గోలు పెట్టినా, అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఎవరు పట్టించుకోలేదు. అయితే చాలా మంది విశ్లేషకులు ఈ ఫిరాయింపులు ఎన్నికల సమయానికి చంద్రబాబుకు గుదిబండలా మారతాయని ఊహించారు. నియోజకవర్గాల పెంపు జరుగకపోయినట్లయితే వీరికి అందరికీ టికెట్లు సర్దడం తలకు మించిన భారం అవుతుందని, అప్పుడు చంద్రబాబు విపరీతంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ ప్రభావం ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ మీద పడుతుందని వారు విశ్లేషించారు. అనుకున్నట్టుగానే నియోజకవర్గాల పెంపు జరగలేదు.

ఊహించని విధంగా ఎమ్మెల్యేలే సమస్యను పరిష్కరించారు:

అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవి ఒక రకంగా చంద్రబాబు కు ఊరట కలిగించేవే. ఇప్పటికే ఆమంచి కృష్ణ మోహన్, మేడా మల్లికార్జున రెడ్డి, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళి పోగా, త్వరలోనే మరొక ఆరు మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్సిపి టికెట్ మీద గెలిచి ఆ తర్వాత టిడిపిలో చేరిన 20 మంది ఎమ్మెల్యేల లో ఆరుగురు ఎమ్మెల్యేలు తిరిగి వైఎస్సార్సీపీలోకి పోతారని రూమర్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు కూడా నియోజకవర్గంలో మంచి పేరు ఉండి, కాస్త గెలిచే అవకాశాలు ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ లాంటి వారి విషయంలో ఒక రకంగా, గెలిచే అవకాశాలు పెద్దగా లేని వారి విషయంలో మరొక రకంగా వ్యవహరిస్తున్నారు. గెలిచే అవకాశాలు ఉన్నవారి విషయంలో ఒకసారి వారితో భేటీ కావడానికి, వారి కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ, పెద్దగా గెలిచే అవకాశాలు లేవు అనుకున్న నాయకుల విషయంలో లైట్ తీసుకుంటున్నారు. వారికి ఎటువంటి బుజ్జగింపులు లేవన్నమాట.

టిడిపికి మూడు రకాల లాభాలు:

ఆ రకంగా చూసుకుంటే గెలిచే అవకాశాలు లేని ఒక పదిహేను – ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోవడం చంద్రబాబుకు ఊరట కలిగించేదే. చంద్ర బాబు కి ఇది మూడు రకాలుగా లాభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకటి, ఎన్నికలకు ముందు టికెట్ల సమయంలో చంద్ర బాబు కు ఏ తలనొప్పులు అయితే వస్తాయి అనుకున్నారో, ఆ తలనొప్పులు తప్పడం. రెండు, గెలిచే అవకాశాలు లేని ఆ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన తర్వాత, వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగితే ఆ రకంగా కూడా టీడీపీకి లాభం కలగడం. అలాగే ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల కారణంగా సరిగ్గా ఎన్నికలకు ముందు ఏ తల నొప్పులయితే చంద్రబాబుకు వస్తాయని ఊహించారో, ఇప్పుడు ఆ తలనొప్పులు, ఆ గుదిబండ జగన్ కి చుట్టుకునే అవకాశం ఉండడం. ఇవే కాకుండా, ఇప్పటికే నాలుగేళ్లుగా పార్టీని నమ్ముకున్న నాయకులను కాదని కొత్తగా వచ్చిన వారికి జగన్ టికెట్ ఇస్తే, వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడే అవకాశం కూడా కనిపిస్తోంది.

మొత్తం మీద:

మొత్తం మీద జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఎమ్మెల్యేలు ఇట్నుంచి అటు వెళ్ళడం అటు నుంచి ఇటు రావడం కారణంగా, అంతిమంగా ఎవరికి లాభం చేకూరుతుంది అనేది ఎన్నికలయ్యాక తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com