మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్‌: మౌనం మార‌ణాయుధమైంది

మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఈ నెల 22న విడుద‌ల అవుతున్న ఈ చిత్రానికి ట్రైల‌ర్‌తో ప్ర‌చార ప‌ర్వానికి చిత్ర‌బృందం శ్రీ‌కారం చుట్టింది. ట్రైల‌ర్ నిండా పొలిటిక‌ల్ పంచ్‌లే. అప్ప‌టి రాజ‌కీయాల్లోని వాడీ, వేడిని ప్ర‌చార చిత్రాల్లో చూపించారు. ఇందిరాగాంధీ శ్రీ‌కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ క‌టౌట్‌ని చూసి దండం పెట్టుకోవ‌డం ఈ ట్రైల‌ర్ మొత్తానికి ఓ మెరుపు. మ‌హానాయ‌కుడు సినిమా మొత్తం.. ఎన్టీఆర్ వెర్సెస్ నాదెండ్ల భాస్క‌ర‌రావు, ఎన్టీఆర్ వెర్సెస్ ఇందిరాగాంధీ ఎపిసోడ్ల‌తో సాగ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ నాదెండ్ల‌ని గుడ్డిగా న‌మ్మ‌డం, నాదెండ్ల భాస్క‌ర్‌.. దాన్ని అలుసుగా తీసుకుని రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవ‌డం… ఇవ‌న్నీ ఈ చిత్రంలో చూపిస్తున్నారు. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగులు మ‌రోసారి పేలాయి. ‘ఇచ్చిన ప్రతిమాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనపడాలి, ఇన్‌టైమ్‌ ఆన్‌ డోర్‌’, ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అనే డైలాగులు బాగున్నాయి. మౌనం చేత‌కానిత‌నం కాదు.. అది మార‌ణాయుధంతో స‌మానం అనే డైలాగు కూడా న‌చ్చుతుంది. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ని ఎలా చూపిస్తారా అనే ఆస‌క్తిగా తెర‌దించింది ఈ ట్రైల‌ర్‌. ఒక్క డైలాగ్‌తో చంద్ర‌బాబు పాత్ర‌ని పరిమితం చేశారు. అది కూడా పాజిటీవ్ గానే క‌నిపిస్తుంది. ట్రైల‌ర్ అంతా స్పీడు స్పీడుగా సాగిపోయింది. అంద‌రికీ తెలిసిన రాజ‌కీయ క‌థ‌ని… క్రిష్ ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా మ‌లిచాడ‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ‌రి ఇదే టెంపో థియేట‌ర్లోనూ కొన‌సాగుతుందా, లేదా? అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com