బీజేపీతో డీఎంకే పొత్తా..? ఏమో ఏమైనా జరగొచ్చు..?

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి ఎలా అయిపోయిందో అందరూ చూశారు. అటూ.. ఇటూ తిరిగి బీజేపీ చేతిలో కీలుబొమ్మ ఆయిపోయింది. దానికి ఆ పార్టీలోని అంతర్గత రాజకీయాలను.. ఆయుధంగా వాడుకుంది బీజేపీ. ఇప్పుడు కరుణానిధి మరణం తర్వతా అలాంటి పరిస్థితులను సృష్టించి.. డీఎంకేను కూడా తన గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారభించిందనే విశ్లేషణలు ప్రారభమయ్యాయి. దానికి తగ్గట్లుగానే తమిళనాడులో వ్యవహారాలు చురుగ్గా మారిపోతున్నాయి. అళగిరి… తరచూ వివాదాస్పద ప్రకటనలు చేస్తూ అలజడి రేపుతున్నారు. ఎందుకైనా మంచిదన్నట్లుగా.. డీఎంకే.. బీజేపీ వైపు మొగ్గుతోంది.

కరుణానిధి ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు డీఎంకే-బీజేపీ దగ్గరవుతున్న సూచనలు వచ్చేలా చేస్తున్నాయి. ఈ నెల 30న కరుణానిధి సంతాప సభను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రముఖ నేతలందర్నీ ఆహ్వానించారు. బీజేపీని కూడా ఆహ్వానించారు. అయితే.. తమ కూటమి కాదు.. తమ మిత్రపక్షం కాదు కాబట్టి.. మొహమాటానికి సరే అన్నా.. తమిళనాడుకు చెందిన నిర్మలాసీతారామన్ లాంటి నేతలను పంపితే సరిపోయేది. కానీ తానే వస్తానని..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమాచారం పంపారు. ఈ విషయాన్ని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. దీంతో డీఎంకే, భాజపాల పొత్తుపై సాగుతున్న ప్రచారానికి ఇది మరింత బలాన్నిస్తోంది. నిజానికి టూజీ కేసు తీర్పు రాక ముందు.. మోడీ.. కరుణానిధిని పరామర్శించి వెళ్లారు. ఆ తర్వాత టూజీ కేసులో డీఎంకే నేతలకు ఊరట లభించింది.

కరుణానిధి ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఆయన అంత్యక్రియల్లో డీఎంకే కూటమి అయిన కాంగ్రెస్ నేతల కన్నా.. బీజేపీ నేతలే ఎక్కువ మంది పాల్గొన్నారు. వాజ్‌పేయి మరణం సమయంలో డీఎంకే స్టాలిన్, కనిమొళి సహా ప్రముఖులు ఢిల్లీ వెళ్లి నివాళులు అర్పించారు. 23వ తేదీన వాజ్‌పేయి అస్థికలు.. చెన్నైకు వస్తే.. బీజేపీ ప్రధాన కార్యాలయానికి స్టాలిన్, కనిమొళి వెళ్లి అంజలి ఘటించారు. బీజేపీ విషయలో డీఎంకేది స్పష్టమైన మార్పే. కరుణానిధి శాసనసభలోకి అడుగుపెట్టిన 50 వసంతాలైన సందర్భంగా .. గత ఏడాది నిర్వహించిన వేడుకలకు అప్పట్లో పలువురు జాతీయనేతలను డీఎంకే ఆహ్వానించింది. కానీ బీజేపీని మాత్రం ఆహ్వానించలేదు. ద్రావిడ పార్టీలను నిర్మూలించాలనుకునే బీజేపీని ఆహ్వానించే ప్రశ్నే లేదని.. అప్పట్లో స్టాలిన్ ప్రకటించారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా వైఖరి మార్చుకున్నారు. మారుతున్న వైఖరిలో డీఎంకేలో ఇప్పటికే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. డీఎంకే బీజేపీ వైపు వెళ్తే… విపక్షాల ఐక్యతకు తొలి గండి పడినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com