కానిస్టేబుల్ కుమారుడి నుంచి మైనింగ్ డాన్ గా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాల గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకోవచ్చు. అక్రమ మైనింగ్ కోసం ఎంతో మందిని ఆయన మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ డబ్బుతో బళ్లారిని గుప్పిట పట్టి కొన్నాళ్లు డాన్ గా చెలామణి అయ్యాడు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అక్కడి ప్రజలు ఆయనను పట్టించుకోవడం లేదు.కానీ ఆయన బళ్లారిని వదలాలనుకోవడంలేదు. అందుకే తన పాత ఫ్యాక్షన్ మార్క్ తీసుకువచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే దాడులు చేసి..తాను తగ్గేది లేదని సంకేతం పంపాలని అనుకున్నారు. ఫలితంగా ఒక ప్రాణం పోయింది.
బ్యానర్ల పేరుతో గొడవ ప్రారంభించింది గాలి వర్గమే !
బళ్లారి సిటీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత నారా భరత్ రెడ్డి పట్టు సాధించడంతో, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు గాలి జనార్ధన రెడ్డి వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చోటుచేసుకున్న ఘర్షణలు బళ్లారిలో మళ్లీ పాత ఫ్యాక్షన్ ఛాయలను గుర్తుకు తెస్తున్నాయి. వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఫ్లెక్సీలను పెడుతున్నారన్న కారణం చూపించి.. దాడులకు గాలి వర్గం దిగింది. రెచ్చగొట్టింది. ఫలితంగా రాళ్ల దాడులు, కాల్పుల వరకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా గాలి వర్గం చేసిన కుట్ర. ఇప్పుడు బళ్లారి భయం గుప్పిట్లోకి పోయింది.
హత్యాయత్నం డ్రామా
కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురవడంతో తన మీదకు వస్తుందన్నా భయంతో గాలి జనార్ధనా రెడ్డి తనపైనే హత్యాయత్నం జరిగిందని ఓ బుల్లెట్ చూపించి డ్రామా ప్రారంభించారు. భరత్ రెడ్డి, అతని తండ్రి సూర్యనారాయణ రెడ్డి తనను అంతం చేసేందుకు కుట్ర పన్నారని గాలి మీడియా ముందు బుల్లెట్లు ప్రదర్శిస్తూ ఆరోపించారు. కానీ దాన్ని ఎవరూ నమ్మడం లేదు. గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ బళ్లారిని ఫ్యాక్షన్ రాజకీయాల వైపు తీసుకెళ్తున్నారని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.
బీజేపీలో చేరిన తర్వాత కుట్రల అమలు
గతంలో ఆయనను భరించడం కష్టమని బీజేపీ పక్కన పెట్టింది. గత ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి కేవలం గంగావతికి పరిమితమైన గాలి జనార్ధన రెడ్డి, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరి బళ్లారిపై పట్టు కోసం పరితపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో భరత్ రెడ్డి బలపడటం, గాలి సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలని, తద్వారా పాత రోజులను గుర్తు చేస్తూ భయాందోళనలతో పట్టు సాధించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం బళ్లారిలో 144 సెక్షన్ అమలులో ఉంది. గాలి జనార్ధన రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీరాములు సహా 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్నే తాము కోరుకున్నామని గాలి వర్గం తదుపరి ప్లాన్లు అమలు చేయబోతోంది. గాలి ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ బళ్లారి ఉద్రిక్తంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
