నిర్మాణ బాధ్యతలు సింగపూర్‌కు అప్పజెప్పటం సబబేనా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణానికి 75 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఒక అంచనా రూపొందినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూరే మాస్టర్ డెవలపర్ బాధ్యతలు కూడా స్వీకరించబోతోంది. నిధుల సమీకరణ బాధ్యత మాస్టర్ డెవలపర్ దే అవుతుంది. అమరావతి అభివృద్ధిలో సింగపూర్ దీర్ఘకాలం భాగస్వామిగా వుండాలన్న ఆకాంక్షను ఆదేశపు మంత్రి ఈశ్వరన్, ఎపి ముఖ్యమంత్రి సంయుక్తంగా వెల్లడించారు. ప్లానింగ్ దశ నుంచి కృషి చేస్తున్న సింగపూర్ కి స్విస్ ఛాలెంజ్ విధానంలో కాంట్రాక్టర్‌గా క్వాలిఫై అవ్వడం కష్టమేమీకాదు.

ఆంధ్రప్రదేశ్ అర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగానే వుంది. కేంద్రప్రభుత్వం నుంచి ఏపాటి సహాయం అందుతుందో స్పష్టతలేదు. ఈనేపధ్యంలో ప్రయివేటురంగంనుంచి పెట్టుబడులు సేకరించడంతప్ప రాష్ట్రప్రభుత్వానికి మరోదారిలేదు. ఈ సమీకరణ బాధ్యతను స్వీకరించడానికి సింగపూర్, అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగానే వున్నాయి. రాజధాని ప్రాంతంలో సీడ్ కేపిటల్ (ప్రభుత్వ వ్యవస్త సమస్తం వుండే ప్రాంతం)నిర్మాణాన్ని ముందుగా ప్రారంభిస్తారు. అక్టోబర్ 22 విజయదశమి నాడు నిర్మాణం మొదలవ్వాలన్నది ముఖ్యమంత్రి షెడ్యూలు. ఈలోగా టెండర్ల తతంగం పూర్తికావాలి.

మూడు లేదా నాలుగు భాగాలుగా వేర్వేరు దశల్లో నిర్మించే రాజధాని ప్రాంతంలో ముందుగా కట్టుబడి మొదలుపెట్టే సీడ్ కేపిటల్ నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఏడాదికి 7000 కోట్లరూపాయలు వెచ్చించడానికి సిద్ధమని సింగపూర్ ప్రతినిధి ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారని తెలిసింది. ఈ ప్రకారం సీడ్ కేపిటల్ నిర్మాణానికే పదేళ్ళు పడుతుంది.

మన స్ధలాన్ని బిల్డర్ కి ఇస్తే అందులో అపార్ట్ మెంట్లు కట్టి కొన్ని మనకు ఇచ్చి మిగిలిన వాటిని అమ్ముకుని లాభాలు తీసుకునే డెవలపర్ బాధ్యతే సింగపూర్ నిర్వహిస్తుంది. ఇక్కడ విశేషమేమంటే నిర్మాణ రంగంలో సిగపూర్ కి నైపుణ్యమూ, అనుభవమూ పెద్దగా లేవు. అయితే పనిచేయించుకునే సామర్ధ్యంలో ఎవరైనా సింగపూర్ తరువాతే. నిర్మాణరంగంలో ఆధునిగ టెక్నాలజీలు ప్రావీణ్యత వున్న జపాన్ వగైరా దేశాల కన్ స్ట్రక్షన్ కంపెనీలకు లాభాలు వుండే పద్ధతిలో సింగపూర్ సంస్ధలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే పదేళ్ళకంటే తక్కువ కాలంలోనే సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తవుతుంది. సింగపూర్ జపాన్ సంస్ధలు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి సూచించడానికి మూలం ఇదే.

రాజధాని తో సహా మౌలిక వసతుల కల్పనకూ, నిర్మాణరంగానికీ ఇపుడు ఆంధ్రప్రదేశ్ కి మించిన మార్కెట్ దేశంలో ఎక్కడాలేదు. ఇక్కడ పనిచేసి లాభాలు గడించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ రంగానికి పోటీపెట్టగలిగితే ధర, నాణ్యతల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు లబ్ధి కలుగుతుంది. పూలింగ్ ద్వారా రైతులనుంచి సేకరించిన 33 వేలఎకరాలను కలుపుకుని రాజధాని నిర్మాణం 55 వేల ఎకరాల్లో జరుగుతుందని ఇంత వరకూ చెబుతూ వచ్చారు. నిన్న ప్రభుత్వానికి అందిన మూడో, చివరి భాగం మాస్టర్ ప్లాన్ ని విశ్లేషిస్తే ఈ విస్తీర్ణం దాదాపు 80 వేల ఎకరాలని అర్ధమౌతోంది. దీన్ని బట్టి బిల్డర్లకూ ఇవ్వవలసిన వాటా ఎక్కువకాబట్టి స్ధలవిస్తీర్ణం పెరిగిందని అనుకోవాలి.

ముఖ్యమంత్రి నిర్ణయంకారణంగా సెల్లర్స్ మార్కెట్ గా వుండవలసిన రాజధాని నిర్మాణం బయ్యర్స్ మార్కెట్ గా మారిపోయింది. ఇతర నిర్మాణ సంస్ధలు రంగంలోకి దిగకముందే “సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ కు లాంగ్ టెర్మ్ పార్టనర్ షిప్ వుండాలి” అని ముఖ్యమంత్రి బహిరంగంగా సూచించడం డెవలపర్ల మధ్య పోటీని పెంచడానికి దోహదపడే విషయం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com