తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ వారసత్వం ఎంపి కవితకే దక్కుతుందన్న జ్యోతిష్యం ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవానికి అనుగుణంగా లేదు. గతంలో ఆ నలుగురు అంటూ ప్రథమ కుటుంబాన్నిగురించి సంబోధించేవారు కూడా ఇప్పుడు ఆ ముగ్గురు అనే అంటున్నారు. కెసిఆర్ కెటిఆర్ హరీష్‌రావులే టిత్రిమూర్తులుగా అన్నీనడిపిస్తున్నారనేది అధికార పక్షం అంతర్వాణి. అందులోనూ కెటిఆర్ డీ ఫ్యాక్టో హోదా గురించి రెండో మాట లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజాదరణతో పాటు వాస్తవికత బాగా తెలిసిన హరీష్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని తన రంగంలో తాను మరింత గట్టిగా పనిచేసుకుంటూ పోతున్నారని ఆయన సన్నిహితుల కథనం.
నిజానికి మొన్న తెలంగాణలో నూతన జిల్లాల ప్రారంభ సంరంభంలో సిద్ధిపేట ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన సంకేతాలు అందించింది. ముఖ్యమంత్రి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన, పోరాటాలు నడిపించిన సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంచుకోవడం , అదిప్పుడు హరీష్ ప్రాతినిధ్యంలో వుండటం ప్రత్యేకాకర్షణగా మారింది. ఈ సందర్భంలో కెసిఆర్ ప్రసంగం ఉద్వేగం, పెద్దరికం మేళవించి చక్కగానే మాట్లాడారు. తన తర్వాత నియోజకవర్గ బాధ్యత తీసుకుని అసమాన ఆధిక్యతతో వరుస విజయాలు సాధించిన హరీష్ రావు గురించి అభినందనా పూర్వక ప్రస్తావనలు చేస్తూ ఆశీస్సులందించారు. ఆయన కూడా పాదాభివందనం చేశారు. అంతకు ముందు కార్యాలయ ప్రారంభోత్సవ ఘట్టంలోనూ వెనక ఒద్దికగా నిలిచివున్న హరీశ్‌ను ప్రత్యేకంగా పిలిచి భాగం కల్పించారు. అయితే హరీశ్ పై ప్రశంసలు సిద్దిపేట అభివృద్ధి, నీటి పారుదల శాఖల పనికే పరిమితమైనాయి .మరోవైపు హరీశ్ తన ప్రసంగంలో కెసిఆర్ ఘనతను గొప్పగా శ్లాఘించారు. గతంలో కొంత నిరుత్సాహానికి గురైన హరీశ్ ఈ మధ్య మళ్లీ పుంజుకుని ప్రజల్లోకి వెళుతున్నారని అక్కద లభించే ఆదరణ ఆయనకు మరింత ఉత్సాహం ఇస్తున్నదని చెబుతున్నారు. కెటిఆర్ వరకూ చూస్తే హరీష్‌లా నిరంతరం జనం మధ్య గడపడం గాక ఐటి పారిశ్రామిక వేత్తలతో భేటీలు వంటి వాటిపై కేంద్రీకరిస్తుంటారు. ఈ ఇద్దరి మధ్యన కవిత కూడా చొరవ చూపిస్తున్నప్పటికీ అది వారసత్వ స్థాయిలో లేదనేది స్పష్టం. ఈ ఏడాది బతుకమ్మకు ఆమె విదేశాలలోనే గడపడం గమనార్హం. అయితే ఆమె కూడా చిన్న వయసులోనే బాగా రాణించిన ఆమె కూడా అంత తేలిగ్గా వెనుకడుగు వేసే మనిషి కాదంటారు జాగృతి కార్యకర్తలు!