కొరటాల శివ.. టాలీవుడ్లో మార్మోగిపోతున్న పేరు. రచయితగా అడుగుపెట్టి, దర్శకుడిగా మారి హ్యాట్రిక్ కొట్టాడు. అవీ అల్లాటప్పా విజయాలు కావు. అందులో రెండు వంద కోట్ల సినిమాలున్నాయి. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. నిన్ననే కొబ్బరికాయ కొట్టుకొందీ చిత్రం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. స్వతహాగా కొరటాల రచయిత. తన కథల్ని తానే రాసుకొంటాడు. అయితే.. తొలిసారి ఓ బయటి రచయిత కథని ఈ సినిమా కోసం తీసుకొన్నాడట. ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టు వర్క్ పూర్తిగా అయిపోయిందని, డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయిపోయిందని టాక్. డైలాగులు మాత్రం కొరటాలనే రాసుకొన్నాడట. కథ ఇచ్చినందుకు రైటర్‌కి క్రెడిట్ ఇస్తానని మాట ఇచ్చాడట. అంతేకాదు.. ఆ రచయితకు ఏకంగా రూ.1 కోటి రూపాయల పారితోషికం ఇప్పించాడట. ఆ రచయిత ఇప్పటి వరకూ ఇండ్రస్ట్రీలో ఒక్క సినిమాకీ పనిచేయలేదని, ఇదే తన తొలి కథ అని తెలుస్తోంది. ఒక్క కథకే కోటి రూపాయలు ఇచ్చారంటే.. ఆ కథ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు.
మరొకరు రాసిన కథల్ని దర్శకులు కాజేస్తున్నారని, కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వడం లేదని టాలీవుడ్లో పెద్ద రచ్చ నడుస్తోంది. కొరటాల కూడా బోయపాటిపై ఓ ఇంటర్వ్యూలో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడు కూడా. అలాంటిది తన మరో రచయిత నుంచి కథ తీసుకొని అన్యాయం చేయలేడు కదా..?? పైగా కోటి రూపాయలు ఇచ్చి – రచయిత గౌరవాన్ని పెంచాడు కొరటాల. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు చెబుతారో మరి. స్ర్కిప్టు రెడీగా ఉంది కాబట్టి.. షూటింగ్ కూడా చకచక సాగిపోవడం ఖాయం. ఈ కథ మహేష్‌కి విపరీతంగా నచ్చిందని, డైలాగ్ వర్షన్ తో సహా మహేష్‌కి వినిపించేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.