థియేటర్లకు జనాలు రావడం లేదంటూ దర్శక నిర్మాతలు నెత్తీ నోరూ కొట్టుకొంటున్నారు. రకరకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకొన్నా – జనాలు పట్టించుకోవడం లేదు. పెద్ద సినిమాలకు సైతం ఓపెనింగ్స్ దక్కడం లేదు. ఇలాంటి సమయంలో టీజర్, ట్రైలర్ కట్ చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ రెండింటితో సినిమా చూడాలా, వద్దా? అనేది డిసైడ్ అయిపోతున్నారు జనాలు. టీజర్, ట్రైలర్ల రెండు మూడు వెర్షన్లు కట్ చేయించి, అందులో ది బెస్ట్ వదులుతున్నారు. సినిమాలోని హాట్ & క్రేజీ కంటెంట్ హైలెట్ అయ్యేలా ట్రైలర్ వదులుతున్నారు. ట్రైలర్లోనే ఏం లేదంటే, సినిమాలో కూడా ఏం ఉండదని జనాలు ముందే ఫిక్సయిపోతున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘మాస్ జాతర’ టీజర్ ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయింది. ట్రైలర్ తో ఇంపాక్ట్ చూపించాల్సిన తరుణంలో అది కూడా అంతంత మాత్రంగానే కనిపించింది.
మాస్ జాతర ట్రైలర్ కు మిశ్రమ స్పందన లభించింది. ట్రైలర్ లో మెరుపులేం లేవని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే కనిపిస్తోంది. విలన్ (నవీన్ చంద్ర) క్యారెక్టర్ ఒక్కటే ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. మిగిలినదంతా రొడ్డ కొట్టుడే. మాస్ సినిమాలు ఇంతకు మించి ఏం ఉంటాయి? అనుకోవడానికి వీల్లేదు. ఓ కొత్త దర్శకుడు డీల్ చేసిన సినిమా ఇది. ఆ ఫ్రెష్ నెస్ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పాటలు కూడా ఏమాత్రం శ్రోతల్లోకి వెళ్లలేదు. ఈ స్టఫ్ తో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలరా అనేది అనుమానమే. పైగా బాహుబలి ఎపిక్ తో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఏపీలో వర్షాల ప్రభావం కూడా ఉంది. ఇవన్నీ ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపిస్తాయి.
కాకపోతే కొన్ని వారాలుగా బాక్సాఫీసు దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. సెప్టెంబరులో మంచి విజయాలు దక్కాయి. అక్టోబరు సినిమాలు కూడా మంచి వసూళ్లే తీసుకొస్తున్నాయి. ఈనెలాఖరున వస్తున్న మాస్ జాతర మాస్‌ని మెప్పిస్తే ఈనెల కూడా తీపి గుర్తుల్ని మిగిల్చినట్టే.