మావిగన్ పేరుతో రాజధానిని ప్రతిపాదించి నవ్వుల పాలయిన జగన్ రెడ్డిని అందరూ ఇప్పుడు జాలిగా చూస్తున్నారు. వైసీపీలోని చాలా మంది కూడా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఐడియా కాదని నమ్ముతున్నారు. నిజంగానే కాదు కూడా. ఇటీవల జగన్.. సజ్జలను నమ్మడం లేదు. చెవిరెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ చెవిరెడ్డి సర్వేలు పేరుతో జగన్ ను బురిడీ కొట్టిస్తున్నారు. ఆయనే సర్వేలు చేసి మావిగన్ అనే కొత్త రాజధానిని చెప్పారు. జగన్ దానికే ఫిక్సయ్యారు. సజ్జల చెప్పే సలహాలకంటే.. తలకమాసిన సలహాలు లాగా ఉన్నాయని పార్టీలోని ఇతర క్యాడర్ ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.
చెవిరెడ్డి ఐడియానే మావిగన్ ?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో ప్రస్తుతం ఒక భారీ మార్పు కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా పార్టీలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాభవం తగ్గి, ఆ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నయా స్ట్రాటజిస్ట్ గా అవతరించారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ, క్షేత్రస్థాయి సర్వేల పేరుతో ఆయన ఇచ్చే నివేదికలే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో వేదవాక్కుగా మారుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి బదులుగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరులను కలుపుతూ మావిగన్ అనే వింతైన రాజధాని కారిడార్ ప్రతిపాదన తెరపైకి రావడం వెనుక చెవిరెడ్డి ఉన్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నవ్వుల పాలయినా జగన్
రాజధాని విషయంలో గతంలో మూడు రాజధానుల అంటూ కాలయాపన చేసిన జగన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న తరుణంలో ఈ కొత్త పేరును తెరపైకి తేవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ మావిగన్ ప్రతిపాదన ప్రజల్లో నవ్వులపాలవడమే కాకుండా, వైసీపీ కేడర్‌ను సైతం అయోమయంలో పడేసింది. గతంలో సజ్జల ఇచ్చే సలహాలపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, కనీసం అందులో ఒక రాజకీయ తర్కం ఉండేదని.. కానీ ఇప్పుడు చెవిరెడ్డి సర్వేల ఆధారంగా వస్తున్న ఇటువంటి తలకమాసిన ఐడియాలు పార్టీకి ఆత్మహత్య సదృశ్యంగా మారుతున్నాయని సీనియర్ నాయకులు లోలోపల మదనపడుతున్నారు.
సజ్జల సలహాలకు జగన్ దూరం
జైలు నుండి విడుదలైన తర్వాత చెవిరెడ్డికి జగన్ ఇచ్చిన ప్రాధాన్యత, గన్నవరం విమానాశ్రయం వరకు ఆయనతో కలిసి ప్రయాణించడం వంటి పరిణామాలు వైసీపీలో కొత్త గ్రూపు రాజకీయాలకు దారితీశాయి. సజ్జల వర్గాన్ని పక్కన పెట్టి, చెవిరెడ్డి చెప్పే ఫేక్ సర్వేల పై జగన్ అమితమైన నమ్మకాన్ని పెట్టుకోవడం వల్లనే ఇటువంటి అశాస్త్రీయమైన ప్రతిపాదనలు పుట్టుకొస్తున్నాయని వైసీపీ ముఖ్య నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అమరావతి పై వ్యతిరేకత వ్యక్తం చేయడానికి మావిగన్ లాంటి అసందర్భ పేర్లను వాడటం వల్ల జగన్ రెడ్డి తన రాజకీయ అపరిపక్వతను మరోసారి బయటపెట్టుకున్నట్లయింది.
రోట్లో తల పెట్టినట్లుగా వైసీపీ క్యాడర్ పరిస్థితి
జగన్ చుట్టూ ఉన్న కోటరీలో మార్పులు వచ్చినా, వారిచ్చే సలహాలు మాత్రం ఘోరంగా ఉంటున్నాయి. చెవిరెడ్డి తన సర్వేల ద్వారా జగన్‌ను సంతృప్తి పరచవచ్చు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఈ వింత పేర్లను, అసంబద్ధ ప్రతిపాదనలను కామెడీచేస్తున్నారు. ఈ కొత్త స్ట్రాటజీ జగన్ రెడ్డిని రాజకీయంగా మరింత ఒంటరిని చేయడమే కాకుండా, పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తోంది. మావిగన్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది వైసీపీలో మారుతున్న అధికార సమీకరణాలకు, విఫలమవుతున్న వ్యూహాలకు నిదర్శనం అనుకోవచ్చు.


