మీడియా దిగజారుతోందా?

పులిని చూస్తే పులి ఎన్నడు జడవదు..మేక వస్తే మేక ఎన్నడు అదరదు..మాయరోగమదేమో కానీ మనిషి మనిషికి కుదరదు అంటాడు సి నారాయణ రెడ్డి అందాలరాముడు సినిమాలో. ఇప్పుడు ఈ లైన్ లో మనిషి మనిషికి అనే బదులు జర్నలిస్ట్, జర్నలిస్ట్ కు అని రాసుకోవాలేమో? వాస్తవానికి మారుతున్న సమాజంలో, అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వ్యవస్థల్లో ఏ విధమైన మార్పులు, కాస్త దిగజారుడు వచ్చాయో, జర్నలిజంలో కూడా అలాగే వచ్చాయి. అది కాదనలేని వాస్తవం.

అయితే అన్ని వ్యవస్థల్లోనూ ఒక కట్టు, పద్దతి వుంది. కానీ జర్నలిస్ట్ ల దగ్గరకు వచ్చేసరికి అది అంతగా కనిపించదు. వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు వున్నాయి కానీ మళ్లీ వాటిల్లో కూడా ఒకదానికి మరొకదానికి పొసగదు. వాటి వాటి అఫిలియేషన్లు వేరు. ఎక్కడయినా జర్నలిస్ట్ ల మీద దాడులు జరిగితే, లోకల్ గా కాస్త హడావుడి, మహా అయితే స్టేట్ యూనియన్ నుంచి ఓ స్టేట్ మెంట్ అంతే.

పైగా స్టేట్ యూనియన్లు, సీనియర్ జర్నలిస్ట్ లు పార్టీల వారీగా ఎవరి అఫిలియేషన్లు వారికి వున్నాయి. ప్రభుత్వాలు, పార్టీలు, పదవులు ఇలా చాలా చాలా వ్యవహారాలు వున్నాయి. ఎప్పుడయితే మీడియా యాజమాన్యాలు పార్టీల మనోభీష్టాలకు అనుగుణంగా ప్రవర్తించడం ప్రారంభించాయో, అప్పుడే వాటిల్లో పని చేసే జర్నలిస్ట్ లు వైఖరి మారిపోవడమో, లేదా వారి పట్ల పబ్లిక్ వైఖరి మారిపోవడమో అనివార్యమైంది. దాంతో జర్నిలస్ట్ ల పట్ల గౌరవం లేదా సింపతీ తగ్గిపోవడం ప్రారంభమైంది.

కానీ ఇదంతా ప్రజల యాంగిల్. చిత్రంగా జర్నలిస్ట్ ల యాంగిల్ కూడా ఇలాగే తయారైంది. వాళ్లు కూడా వాళ్లలో వాళ్లు కిందా మీదా అయిపోవడం ప్రారంభమైంది. వెబ్ సైట్లు అంతగా పాపులర్ కాకపూర్వం జర్నలిస్ట్ ల బ్లాగ్ లు వుండేవి. వాటిలో వీళ్లపై వాళ్లు వాళ్లపై వీళ్లు గ్యాసిప్ లు రాసుకోవడం, కాస్త బురద జల్లుకోవడం లాంటి వ్యవహారాలు వుండేవి.

ఆఖరికి ఎలా తయారైంది అంటే జర్నలిస్ట్ లు అంటే పేరుకే. ఏదో కాగితం మీద ఓ అపాయింట్ మెంట్. కాస్త జీతం. అంతకు మించిన భద్రత లేదు. కేవలం ఆ జీతం కోసం, అక్రిడేషన్ లాంటి గుర్తింపుతో వచ్చే సౌకర్యాల కోసం పని చేయడం తప్ప మరింకేమీ లేదు. ఈ పత్రిక నుంచి ఆ పత్రికకు, ఈ ఛానెల్ నుంచి ఆ ఛానెల్ కు, ఇలా మారుతూ, మారుతూ, ఆఖరికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టడం. దీనివల్ల అవకాశం వున్నవాళ్లకు వుండడం, లేని వాళ్లకు లేకపోవడం. దీంతో ఒకరిని చూస్తే ఒకరు పైకి ఎంత నవ్వులు పులుముకున్నా, ఎంత కౌగిలింతలు కలుపుకున్నా, లోలోపల మాత్రం ఎవరి అసూయాద్వేషాలు వారివే.

వేటగాడి మరణం

వేటగాడి మరణం వేటలోనే వుంటుదని సామెత. టీవీ9 తెలుగునాట విజువల్ మీడియాలో ఓ కొత్త ఒరవడికి దారితీసింది. చిన్నమెత్తు దొరికితే చాలు, దాన్ని భూతద్దంలో చూపించడం అన్నది దాని పద్దతి. అదే ఇప్పుడు అందరి పద్దతి అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా ముందు కనిపించిన బురద తెచ్చి చానెళ్లో వంపేయడం. అవతలి వాడిని అడగడం కానీ, వెర్షన్ తీసుకోవడం కానీ అనే పద్దతి నూటికి తొంభై శాతం వార్తల్లో కనిపించదు.

ఇప్పుడు ఈ రోజు టీవీ9 రవిప్రకాష్ విషయంలో మిగిలిన మాధ్యమాలు, చానెళ్లు అదే పని చేసాయి. రవిప్రకాష్ అరెస్ట్, పరారీ ఇలా ఎవరికి తోచింది అవి రాసాయి. రవిప్రకాష్ లైవ్ లోకి వచ్చి ఇలా చేయడం సరికాదు అనే విధంగా చెప్పుకువచ్చారు. కానీ ఈ తరహా జర్నలిజం అలవాటు చేసింది ఆయనే అని మర్చిపోతున్నారు.

జర్నలిజం..కార్పొరేట్

జర్నలిస్ట్ లు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తారు. కానీ కార్పొరేట్లను ఢీకొనే అంత శక్తి వుండదు. టీవీ9 రవిప్రకాష్ ఓ విధంగా చిన్న వాటాదారు. అందువల్ల ఆయన జర్నలిస్ట్ కమ్ కార్పొరేట్ అనుకోవాలి. ఇప్పుడు ఫైట్ జరుగుతున్నది పెద్దవాటా దారుకు, చిన్న వాటా దారుకు మధ్య. సెలబ్రిటీ జర్నలిస్ట్ గా రవిప్రకాష్ మీద మీడియా దృష్టి వుండడ సహజం. కానీ అతనూ జర్నలిస్ట్ అని మరచిపోకూడదు. వార్తలు అందించే విషయంలో వున్న అత్యుత్సాహం తోటి జర్నలిస్ట్ మీద కూడా చూపించడం సమన్యాయం అనిపించుకుంటుందేమో కానీ, నైతికత మాత్రం కాదనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com