ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో ‘8 వసంతాలు’ ఒకటి. ‘కుబేర’తో పోలిస్తే చిన్న సినిమానే. కాకపోతే ఇది మైత్రీ నుంచి వస్తున్న మూవీ. ఈమధ్య బడా నిర్మాణ సంస్థల్లో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు ఊహించని రీతిలో లాభాలు అందుకొంటున్నాయి. టిల్లు, కోర్ట్, మత్తు వదలరా లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. అందుకే సితార, మైత్రీ లాంటి సంస్థలు మీడియం, చిన్న సినిమాలపై కూడా ఫోకస్ చేశాయి. మైత్రీ కూడా అదే బాటలో ఈ సినిమాని నిర్మించింది. రూ.12 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. నిజానికి రూ.4 కోట్లలోపే ఈ సినిమాని ముగిద్దాం అనుకొన్నారు. కానీ బడ్జెట్లు పెరిగాయి. దానికి తగ్గట్టుగా క్వాలిటీ కూడా వచ్చింది. నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు రూ.9 కోట్లు వెనక్కి వచ్చేశాయి. మైత్రీ మూవీస్‌కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ప్లస్ పాయింట్ గా మారింది. మరో రూ.3 కోట్లు రాబట్టుకోవడం పెద్ద మేటరేం కాదు. సినిమా హిట్టయితే ఆ జోష్ వేరుగా ఉంటుంది. థియేట్రికల్ నుంచి ఎంత మొత్తం వస్తుంది? అనేదాన్ని బట్టి లాభాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ కోర్ట్ లా హిట్టయితే జాక్ పాట్ కొట్టేసినట్టే.
టీజర్, ట్రైలర్ పాటలు ఫీల్ గుడ్ ఎమోషన్ కలిగిస్తున్నాయి. ఈమధ్య కాలంలో పూర్తి స్థాయి ప్రేమ కథ చూసి చాలా కాలం అయ్యింది. ఆ లోటు ఈ సినిమా తీరిస్తే యువతరం మళ్లీ థియేటర్లకు వచ్చే ఛాన్సుంటుంది. కథానాయిక అనంతిక పేరు ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దర్శకుడు ఫణీంద్ర మాటలు ఈ సినిమా విజయంపై భరోసా కలిగిస్తున్నాయి. ఒక రోజు ముందే ప్రీమియర్లు వేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ప్రీమియర్ టాక్ బాగుంటే, మంచి ఓపెనింగ్స్ అందుకొనే ఛాన్సుంది.