ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు అందరికంటే కెసీఆర్ మేధావి. ఎక్కువ పుస్తకాలు చదివినవాడు, సాహిత్యంపైన మంచి పట్టు ఉన్నవాడు, అలాగే చెరువుల తవ్వకంలాంటి కార్యక్రమాలను చూస్తే మన అవసరాలు, అవకాశాల గురించి కూడా కెసీఆర్‌కి పూర్తి అవగాహన ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక విషయంలో మాత్రం కెసీఆర్ మూఢ నమ్మకాలకు అంతూ పొంతూ ఉండదు. మూఢ భక్తిని ప్రేరేపించే మూర్ఖపు స్వామీజీలు కూడా కెసీఆర్ ముందు దిగదుడుపే. చినజీయర్ స్వామి బర్త్ డే వేడకులకు హాజరైనప్పుడు కూడా కెసీఆర్ అలాంటి మాటలు కొన్ని మాట్లాడేశారు. చినజీయర్ స్వామికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం, ఆయనకు డ్రైవర్‌గా పనిచేసే ఇంకా అద్భుత అవకాశం కెసీఆర్‌కి వచ్చిందట. అప్పట్లో అదేదో యజ్ఙాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే చివరి రోజు వర్షం కురుస్తుందని జీయర్ స్వామి చెప్పారట. ఆయన చెప్పినట్టుగానే నిండు వేసవిలో, ఏప్రిల్ నెలలో భారీ వర్షం కురిసిందట. అలా అయితే ఈ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు ఎందుకు? ఖర్చు దండగ. స్వామి వారి చేత యజ్ఙాలు, యాగాలు చేయిస్తూ ఉంటే సరిపోదా?
కెసీఆర్గారు ఇంకో అద్భుతమైన మాట కూడా చెప్పేశారు. చినజీయర్ స్వామివారు కాశ్మీర్లో శాంతి యాత్ర నిర్వహించారట, అక్కడ అశాంతి తొలగిందట. ఇంతకీ కెసీఆర్ చెప్పింది ఏ కాశ్మీర్ గురించి? గతకొన్ని నెలలుగా అశాంతి, ఆందోళనలతో రగిలిపోతున్న మనందరికీ తెలిసిన కాశ్మీర్ గురించేనా? లేక కెసీఆర్‌కి, స్వామిజీకి తెలిసిన వేరే ఏదైనా కాశ్మీర్ ఉందా? ఇలాంటి మూఢభక్తి, వాస్తు పిచ్చిలాంటి వాటితోనే తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు కేసీఆర్. ఇక ఇదే కార్యక్రమానికి అటెండ్ అయిన గవర్నర్ నరసింహన్, గత కొంతకాలంగా కేంద్రమంత్రి బాధ్యతల విషయం పక్కన పడేసి ఏ కార్యక్రమంకి వెళదాం, ఎవరిని…ఏ స్థాయిలో పొడిగేద్దాం అనే కార్యక్రమాలతో బిజీగా ఉన్న మన ‘భజనరాయుడు’ వెంకయ్యనాయుడులు కూడా కెసీఆర్‌కి ఏ మాత్రం తీసిపోలేదు. ఎవరి చిడతలు వారు గట్టిగానే వాయించారు. చినజీయర్ స్వామివారు కూడా తన పుట్టినరోజును గాలి జనార్థన్‌రెడ్డి ఇంట పెళ్ళి కార్యక్రమం, ఇంకా దేశంలో ఉన్న ఏ బడా బిజినెస్ మేన్, పొలిటీషియన్ స్థాయికి తగ్గకుండా అత్యద్భుతంగా నిర్వహించేసుకున్నారు. ఓ రెండు మూడు పెద్ద న్యూస్ ఛానల్స్‌లో లైవ్ కవరేజీ ఏర్పాట్లు కూడా చేయించుకున్నాడు.
అంతా కూడా బ్రహ్మాండం. చాలా బాగుంది. మరి కులాలకు, మతాలకు సంబంధించి ఎలా ఉంటారు, ఎలా వ్యవహరిస్తారు అనే విషయాలపై పదవీ స్వీకార సమయంలోనే ప్రమాణం చేసే మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు …. ఇలాంటి కార్యక్రమాలకు హాజరవ్వొచ్చా? మత విశ్వాసాలను పెంపొందించడానికి ప్రచారం చేసేవాళ్ళ స్థాయిలో మాట్లాడొచ్చా? అన్న ప్రశ్నలకు మాత్రం వాళ్ళు సమాధానం చెప్పాలి. దేవుడున్నాడా? లేడా? అన్న ప్రశ్న వినిపిస్తేనే చాలు…భక్తుల మనోభావాలు చావు దెబ్బలు తిన్నాయని పెడబొబ్బలు పెట్టి, గుక్కపెట్టి, గయ్యిమని ఏడ్చేవాళ్ళు మన దగ్గర చాలా మంది ఉంటారు. మరి భక్తి గురించి, దేవుడి గురించి…. మూఢ విశ్వాసాలు పెంపొంచేలా బహిరంగంగా ప్రచారం చేస్తూ ఉంటే హేతువాదుల మనోభావాలు దెబ్బతినవా? క్రిస్టియన్ మత ప్రచారకులు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు.