తెలకపల్లి వ్యూస్ : సినిమాలైనా సీరియస్‌గా తీశారా?

రాజకీయ రంగంలో పవన్‌ కళ్యాణ్‌ పాత్రను సీరియస్‌గా తీసుకోకుండా రకరకాల మాటలతో పొద్దుపుచ్చుతున్నారనే విమర్శ చాలా ఎక్కువగా వుంది. తన దగ్గర డబ్బులు లేవని, తాను పూర్తి స్థాయి రాజకీయ వేత్తను కాదని ఆయన చాలా విధాల సమర్థించుకుంటుంటారు. కాని వాస్తవం ఏమంటే పవన్‌ కళ్యాణ్‌ సినిమాల విషయంలోనూ పెద్ద సీరియస్‌గా వున్నట్టు కనిపించరు. తనకు ఇంత స్టార్‌డమ్‌ రావడానికి ముందు తీసిన సినిమాలలో వున్న కథాబలం, పాత్ర చిత్రణ తను ఎదిగిన తర్వాత తీసిన వాటిలో వుండదు. తొలిసారి పరిచయమైన చిత్రాన్ని వదిలేస్తే తర్వాత గోకులంలో సీత, తొలిప్రేమ, బద్రి, తమ్ముడు, సుస్వాగతం, ఇవన్నీ ఏదో ఒక కథాంశంతో నడుస్తాయి.వాటిలో ఆయన నటన కూడా హుషారుగా సహజంగా వుంటుంది. అప్పటి ఆయన వయస్సుకు అవి బాగా సరిపోయాయి.

తర్వాత అతి పెద్ద విజయం ఖుషీ. ఇది ప్రధానంగా ఎస్‌జె సూర్యకు చెందవలసిన క్రెడిట్‌. పైగా దాంట్లో కూడా ఇతివృత్తం కన్నా చిత్రీకరణ చమత్కారాలు ఎక్కువ. కాని పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌హీరో కావడానికి అదే బాట వేసింది. ‘తమ్ముణ్ని చూసి జాగ్రత్త పడుతున్నాను’ అని చిరంజీవి కూడా చెప్పడానికి కారణమైంది. ఆ వూపులో స్వీయ దర్శకత్వంలో తీసిన ‘జానీ’లోనే కావలసినంత రోటీనిజం వుంది. కనుకనే దారుణంగా దెబ్బతిన్నది. అదో గుణపాఠం అని ఆయన ఇప్పటికీ చెబుతుంటారు.

ఈ దెబ్బ నుంచి బయిటపడటానికి అచ్చమైన కామెడీ క్రైమ్‌ ఎలిమెంట్లతో గుడుంబా శంకర్‌, బాలు తీసి గట్టెక్కాననిపించుకున్నారు. ఈ చిత్రాలు కూడా బాగా ఆడాయే గాని సంచలనాలు కాదు. గొప్ప పేరు తెచ్చినవీ కాదు. వీటి తర్వాత వచ్చినవి బంగారం, అన్నవరం, తీన్‌మార్‌, కొమరం పులి, పంజా చిత్రాలు. వీటిలో అత్యధికం కథపరంగానూ కలెక్షన్ల రీత్యానూ కూడా అరకొరగా నడిచాయి. బంగారం, తీన్‌మార్‌, కొమరం పులి వంటివైతే అసలే తేలిపోయాయి. అయితే హుషారైన నటన కారణంగా యువ ప్రేక్షకులు ఆయనను ఆరాధిస్తూనే వచ్చారు.

వీటి మధ్యలో వచ్చిన వసూళ్ల విజయం జల్సా. ఇదికూడా కథపరంగా కంటే కలెక్షన్ల పరంగా పరువు నిలబెట్టింది. మరోవైపున పవన్‌ కళ్యాణ్‌ అంటే ఆషామాషీ పాత్రలకు మారుపేరుగా ముద్రపడటానికి కారణమైంది. దాంతోపాటే అమ్మాయిలను ఏడిపించడం ఒక మస్ట్‌గా మారిపోయింది. కాని సూపర్‌ స్టార్‌గా ఆయన స్థానాన్ని కాపాడింది. అప్పుడే అగ్రస్థానానికి పాకుతున్న మహేష్‌బాబుతో ఈ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పించడం త్రివిక్రమ్‌ చేసిన మరో కొత్త ప్రయోగం అనాలి.

ప్రజారాజ్యం రాజకీయాలు ముగిసి విభజన ఉద్యమం నడుస్తున్న ఆ దశలో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాంశాలను రగిలిస్తూ తీసిన ‘కెమెరా మన్‌ గంగతో రాంబాబు’ వసూళ్లు ఫర్వాలేదేమో గాని ఆడిన కాలం తక్కువే. పైగా దీంతో సహా ఈ నాలుగైదు చిత్రాల విడుదల వివాదంగా సాగింది. కెమెరా మన్‌ లో కొన్ని డైలాగులు తీసేశారు కూడా.

మలిదశలో ఖుషీ చిత్రంలా పవన్‌ కళ్యాణ్‌కు అన్ని విధాల ప్రతిష్ట తెచ్చిన చిత్రంగా అత్తారింటికి దారేది చెప్పుకోవాలి. కథలో గొప్పతనం, కొత్తదనం లేకున్నా కుటుంబ సంబంధాల్లోని బలీయమైన సెంటిమెంటుకు మంచి పాత్రలు, కామెడీ, పాటలు జోడించి త్రివిక్రమ్‌ ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. అయితే అందులో హీరోగా చేయడం తప్పితే ఇతరత్రా పవన్‌ పాత్ర పరిమితమనే చెప్పాలి. తర్వాత వచ్చిన గోపాల గోపాల నిర్మాత సురేష్‌, ఒక ప్రధాన పాత్రధారి వెంకటేశ్‌. కృష్ణుడిని ఆధునిక రూపంలో సున్నితంగా అభినయించడమే పవన్‌ ప్రత్యేకత అయింది. ఆ పైన గబ్బర్‌ సింగ్‌ రీమేక్‌ గనక కామెడీ మేళవించి అవలీలగా విజయం సాధించారు.

ముచ్చటైన ఈ మూడు విజయాలతో కమర్షియల్‌ హ్యాట్రిక్‌ సాధించిన పవర్‌ స్టార్‌ జనసేన కూడా స్థాపించారు గనక చాలా జాగ్రత్త పడాల్సింది. కాని గతంకన్నా ఆషామాషిగా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ తీసి దెబ్బతిన్నారు. గతంలోని బంగారం, కొమరం పులి లాటి సినిమాల సరసన దాన్ని చేర్చారు. వివరణలు ఏమిచ్చినా సరే ఇది సీనియర్‌ హీరోగా ఆయనకు ఏ విధంగానూ ప్లస్‌ కాలేకపోగా తన ఎంపిక ఏ స్థాయిలో ఏ తీరులో వుంటుందో తెలియజెప్పింది. దీన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేసి మరింత నష్టం పెంచుకున్నారు. తెలుగులో తన అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసిన మాస్‌ మసాల బొమ్మ ఇతర భాషల్లో విజయం సాధిస్తుందని ఆయన ఎలా అంచనా వేశారో అర్థం కాదు. చివరికి వసూళ్లలెక్క ఎంత వుంటుందో గాని ఈలోగా కొనుగోలుదార్లు, ఫైనాన్షియర్లు లబోదిబో మంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఫాన్‌ పాలోయింగ్‌ ఇప్పటికీ చాలా ఎక్కువనేది నిజం. వారిని తేలిగ్గా తీసుకుని ఏదో ఒకటి తీసిపారేస్తే ఎదురుదెబ్బ తప్పదని గతంలో చాలాసార్లు వెల్లడైన విషయం సర్దార్‌ పరాజయం మరోసారి నిరూపించింది. మనిషిగా చాలా చింతనాపరుడుగా ఆలోచనగల వ్యక్తిగా అగుపించేందుకు ప్రయత్నించే పవన్‌ తన వృత్తిరంగంలో ఎందుకింత అస్తవ్యస్తంగా వ్యవహరిస్తారు? కమిట్‌మెంట్‌ లేకనా చాలకనా?

జానీలాగా అన్నయ్యను నేను నిరుత్సాహపర్చను అని సర్దార్‌ ఆడియో ఫంక్షన్‌లో చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ అంతటి అపజయాన్నే చవిచూశారు. ఇక్కడ ఆయన రెండు మాటలు గుర్తుంచుకోవడం అవసరం. చిన్నచిన్న హీరోలు కూడా ఒక వయసులో విజయాలు అందుకుంటారు. తర్వాత కూడా వాటిని నిలబెట్టుకోవాలంటే జాగ్రత్తగా బాధ్యతగా అడుగేయాలి. రోజు రోజుకు మారుతున్న పరిస్థితుల్లో ఐదేళ్ల కిందటో పదేళ్ల కిందటో చేసిన హాస్యమే పండుతుందని, మసాలా ఘాటు ఎప్పుడూ ఒకటే విధంగా వుంటుందని అనుకోవడం పొరబాటు.

రాజకీయ రంగంలో గజిబిజి సరే సినిమారంగంలోనైనా పవన్‌ కళ్యాణ్‌ ఒక సమగ్రమైన సామాజిక చిత్రం అందించి విజయంసాధిస్తారని ఆశిద్దాం. అది జరగాలంటే ముందు ఆషామాషీ వేషాలపైపే ఆధారపడ్డం మానాలి. బలమైన పాత్రలు తీసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com