జగన్‌ వైఖరి : తల పగ.. తోక చుట్టరికం!

ఒకవైపు జగన్మోహనరెడ్డి తన పార్టీని వీడిపోతున్న ఎమ్మెల్యేల గురించి చాలా చులకనగా కామెంట్లు చేసేస్తూ ఉంటారు. వారందరూ ద్రోహులు, అలాంటి వారి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అంటూ ఆయన కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. తన పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఫిరాయించి వెళ్లిపోతే కలిగే ఆగ్రహంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమే అనుకోవచ్చు. అయితే అదే సమయంలో పార్టీని వీడి వెళ్లిపోదలచుకుంటున్న వారి వద్దకు రాయబారుల్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అందుకే .. జగన్మోహనరెడ్డి వైఖరి.. తల పగ.. తోక చుట్టరికం అనే సామెత చందంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌ పంపుతున్న రాయబారులు చేసే బుజ్జగింపులు పనిచేస్తాయనే నమ్మకం ఏమీ లేదు. కానీ, తాము బుజ్జగించినా సరే వారు దిగిరాలేదు అనే కొత్త నింద కూడా యాడ్‌ చేయడానికి మనుషుల్ని పంపుతున్నట్లుగా కనిపిస్తోంది. జగన్‌ తరఫున పలువురు రాయబారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా.. ఆయనతో కుటుంబ బంధుత్వం కూడా ఉన్న భూమా నాగిరెడ్డి కూడా ఆలకించలేదు. అలాంటిది.. తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్న సుజయకృష్ణ రంగారావు ఈ రాయబారుల మాటలకు మెట్టు దిగి వస్తారా అనేది అనుమానమే!

జగన్‌ తరఫున పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి లు కలసి, బొబ్బిలి రాజులతో మంతనాలకు వెళ్లారు. కానీ వీరి మాటలతో పని జరుగుతుందా? అనేది మాత్రం అనుమానమే. ఒకవైపు జగన్‌ పార్టీ వీడి వెళుతున్న వారిని ఛీత్కరింపుగా మాట్లాడుతుండగా.. ఆయన తరఫు దూతలు వెళ్లి కాస్త బుజ్జగించగానే అవతలి వాళ్లు ఒప్పేసుకుంటారని వారు ఎలా భావించారో అర్థంకావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com