మన దేశంలో రాజకీయ నిరుద్యోగులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. రకరకాల పార్టీల్లో ఉన్న నాయకులందరికీ ఎప్పుడూ ఏదో ఒక పదవి కావాలి. కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఉన్న నాయకులందరికీ పదవులు, సీట్లు ఇవ్వలేవు. అందుకే చాలా మంది పొలిటీషియన్స్‌కి పదవులు లేకుండా పోతున్నాయి. జీవితంలో ఏమీ లేకపోయినా, అసలు జీవితమే లేకుండా పోయినా కూడా మన పొలిటీషియన్స్ అందరూ కూడా పెద్దగా బాధపడరేమో కానీ పదవులు లేకపోతే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ప్రజాసేవ చేయాలన్న కసి వాళ్ళను అస్సలు నిలబడనీయదు. దాంతో అలాంటి రాజకీయ నిరుద్యోగులందరూ కూడా రకరకాల మార్గాల్లో పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. సామర్థ్యం ఉన్నవాడు ప్రత్యేక రాష్ర్టాన్నే డిమాండ్ చేస్తాడు. లేకపోతే సొంత కుంపటి అయినా పెట్టకుంటాడు. కానీ అంతటి సమర్థులు కూడా మనదగ్గర చాలా చాలా తక్కువ. అందరూ కూడా పరాన్నజీవుల టైపు. ఎప్పుడూ ఎవడో ఒకడి మీద వాలిపోయి బ్రతికేస్తూ ఉండే రకమన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా టాప్ రేంజ్లో ఉన్న సినిమా స్టార్సే ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంటారు.
శంకర్‌దాదా జిందాబాద్ సినిమానాటికి వరుస డిజాస్టర్స్‌తో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని టెంప్ట్ చేసింది కూడా అలాంటి వాళ్ళే. ‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి..’ అనే చిరంజీవి సినిమా పాటలాగా కొడితే ముఖ్యమంత్రి కుర్సీనే అని చిరుని ఉబ్బేశారు. మామూలుగానే సినిమావాళ్ళకు పొగడ్తలంటే మహా ఇది. చిరు చిరు పొగడ్తలు చాలు మునగచెట్టు చిటారు కొమ్మన కూర్చుని…ఇక నా అంతటి వాడు లేడు అని గొప్పగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఒకరిని పొగడాలన్నా, తెగడాలన్నా కూడా మన నాయకులను మించిన వాళ్ళు ఎవరున్నారు? ఆ నాయకులే చిరంజీవికి ఫుల్లుగా గాలికొట్టేసి ఫీల్డ్‌లోకి వదిలారు. అలా చిరంజీవిని రంగంలోకి దించిన పరకాల ప్రభాకర్, గంటా శ్రీనివాసరావులాంటి వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ స్థాయికి మించిన పదవుల్లోనే కొనసాగుతున్నారు. కానీ చిరంజీవి మాత్రం దాదాపుగా పదేళ్ళ కెరీర్ నష్టపోయాడు. దాంతోపాటుగా మూడు దశాబ్ధాల కష్టంతో తెలుగు ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం కూడా బీటలు వారింది. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 స్టిల్స్, టీజర్ వీడియో చూస్తుంటే ఈ పదేళ్ళు కూడా చిరంజీవి వరుసగా సినిమాలు చేసి ఉంటే ఆయన స్థాయి ఇంకా ఎంత గొప్పగా ఉండి ఉండేదో అని ఆయన అభిమానులు బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
చిరంజీవి పొలిటికల్ స్టోరీ ఆయనకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ చెడ్డ పేరు మాత్రం బాగానే తీసుకొచ్చింది. చిరంజీవి నటుడిగా కంటిన్యూ అయి ఉన్నా కూడా సచిన్ టెండూల్కర్‌లాంటి వాళ్ళలాగా కచ్చితంగా రాజ్యసభ సభ్యుడు అయితే అయి ఉండేవాడు. చిరంజీవిని ఫీల్డ్‌లోకి దించిన బాపతు నాయకులే ఇప్పుడు రజినీకాంత్‌ని టెంప్ట్ చేస్తున్నారు. జయలిలత చనిపోయిన తర్వాత నుంచీ ఆ ఊపు ఇంకాస్త ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది. చిరంజీవిలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాప్ రేంజ్ స్టార్ఢంని తెచ్చుకున్న రజినీకాంత్ చిరంజీవి రాజకీయ అనుభవాన్ని చూసి నేర్చుకుంటాడో? లేక సొంత అనుభవాలను మిగుల్చుకుంటాడో చూడాలి.
రాజీకియ నిరుద్యోగులతో పాటు సినిమా స్టార్స్‌ని పొలిటికల్ ఫీల్డ్‌లోకి దించడంలో మన మీడియాది కూడా అందెవేసిన చెయ్యి. అంటే మీడియావాళ్ళకు సినిమా వాళ్ళపైన ఏదో వీరాభిమానం పొంగుకొచ్చిందని కాదు. మీడియాకు ఎప్పుడూ న్యూస్ కావాలి. 24 గంటల ఛానల్స్ వచ్చిన తర్వాత నుంచీ న్యూస్ దొరకడం చాలా చాలా కష్టమైపోతూ ఉంది. చూపించిందే చూపిస్తూ ఉంటారని ప్రేక్షకులు విసుక్కుంటూ ఉంటారు కానీ కొత్త కొత్త వార్తలు దొరక్క మీడియా వాళ్ళు పడే కష్టాలు ప్రేక్షకులకేం తెలుసు. అందుకే గత కొంత కాలం నుంచీ వార్తలను మీడియావాళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నారు కూడా. అదే చిరంజీవి, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పాలిటిక్స్‌లోకి వస్తే మీడియావాళ్ళకు ఫుల్లుగా పనిదొరుకుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ పైన తెరవెనుక ప్యాకేజీలు కూడా గట్టిగానే ముడుతూ ఉంటాయి. సినిమా హీరోగా ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ ఇంటర్యూ కావాలంటే నంబర్ ఒన్ ఛానల్ సిఇవోకు కూడా సాధ్యమయ్యేది కాదు. అదే ఒక్కసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూడండి. పొలిటీషియన్స్ అందరిలాగే పవన్ కూడా ఇప్పుడూ మీడియావాళ్ళకు చాలా చాలా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. మహాత్మాగాంధీ మనవడు ఏదైనా ఓ విషయం మాట్లాడితే మన మీడియాకు అస్సలు వినపడదు కానీ ఏ రాధికా ఆప్టేనో, హేమమాలిని, జయప్రద, నగ్మాలాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం విపరీతమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఇప్పుడు రజినీకాంత్‌ని కూడా రాజకీయ తెరంగేట్రం చేయించే ప్రయత్నాల్లో రాజకీయ నిరుద్యోగులు, మీడియా వాళ్ళు మహా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటి వరకూ తెలుగు సినిమాల నుంచి వచ్చి రాజకీయ తెరంగేట్రం చేసినవాళ్ళలో ఒక్క ఎన్టీఆర్ మినహా వేరే ఎవ్వరూ కూడా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. తమిళనాడులో కూడా ఒకరిద్దరు మినహా మిగతావాళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేసింది, సమాజాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన రజినీకాంత్ సినిమాలన్నీ బయ్యర్స్ గూబ గయ్యిమనిపించడం, ఇకపైన ఎంతో కాలం సినిమాల్లో యాక్ట్ చేసే ఫిజికల్ స్టామినా లేకపోవడం లాంటివి చూస్తుంటే రజీనీ కూడా పాలిటిక్స్‌లోకి వచ్చేలానే కనిపిస్తున్నాడు. మరి ఆయన రాజకీయ అనుభవాల స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో? దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారో చూడాలి మరి.