యూపీలో కాంగ్రెస్ కూటమిలో లేకపోవడం వ్యూహమా..?

కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ యాదవ్, మాయావతి షాక్ ఇచ్చారని.. మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కానీ… రాజకీయ లెక్కలను ఔపాసన పట్టిన వారు మాత్రం… దీని వెనుక ఏదో మతలబు ఉందని గ్రహిస్తున్నారు. పొత్తులు ఉన్నా లేకపోయినా… ఎస్పీ, బీఎస్పీ రెండు పార్టీలు సోనియా, రాహుల్ సిట్టింగ్ నియోజకవర్గాలైన… అమేథీ, రాయ్ బరేరీ నుంచి బరిలో ఉండటం లేదు. తాము అన్ని చోట్లా పోటీ చేస్తామని.. కాంగ్రెస్ పార్టీ నిర్మోహమాటంగా ప్రకటించింది. అంతే కాదు.. ఎస్బీ, బీఎస్పీలకు చాలా సాఫ్ట్ గానే అల్ ది బెస్ట్ చెప్పింది. ఈ పరిణామాలన్నీ… బీజేపీకి కాస్త ఆందోళన కలిగించాయి. ఎందుకంటే… యూపీలో … ఓటు బ్యాంకుల సమీకరణాల్లో… కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే.. అది బీజేపీకే నష్టమన్న అంచనా ఉంది.

ఉత్తరప్రదేశ్ లో దళితుల మద్దతు బీఎస్పీ కి ఉంది. అలాగే… బీసీ వర్గాలు, ముస్లింల మద్దతు సమాజ్ వాదీ పార్టీకి ఉంది. అగ్రవర్ణాల మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అగ్రవర్ణాల్లోనే కొన్ని వర్గాల మద్దత ఉంది. అలాగే ముస్లిం ఓటర్లు కూడా కాంగ్రెస్ కు మద్దతు చెబుతారన్న ప్రచారం ఉంది. ఎస్పీ, బీఎస్పీ పొత్తులు పెట్టుకుంటే ఓట్ల బదిలీ జరుగుతుందని ఉపఎన్నికల్లో తేలింది. కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడితే.. ఆ పార్టీకి.. ఎస్పీ, బీఎస్పీ ఓటర్లు ఓట్లు వేస్తారన్న గ్యారంటీ లేదు. అలాగే కాంగ్రెస్ ఓటర్లు కూడా… ఎస్పీ, బీఎస్పీ కూటమికి ఓటేయడం అనుమానమే. తాము చేయించిన సర్వేల్లోనూ అదే తేలడంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా… పొత్తుల కోసం… ఆ పార్టీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ విడిగా బరిలో ఉండటం వల్ల… బీజేపీకి వెళ్లాల్సిన కొంత శాతం ఓట్లయినా… కాంగ్రెస్ పార్టీకి పడతాయనే అంచనా ఉంది. ఓ వైపు… ప్రత్యర్థుల ఓట్లన్నీ కలుస్తూ ఉండటం.. మరో వైపు.. బీజేపీ ఓట్లు చీలిపోయే ప్రమాదం.. కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల ఏర్పడింది.

యూపీ మహాకూటమిలో కాంగ్రెస్ లేదని … భారతీయ భారతీయ జనతా నేతలు అంతర్గతంగా సంబర పడుతున్నారు కానీ… ఓట్ల లెక్కల విశ్లేషణలు బయటకు వచ్చిన తర్వాత మాత్రం.. బీజేపీ వర్గాల్లో మరింత ఆందోళన ప్రరంభమయింది. యూపీలో గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. యూపీలో తాజా పరిస్థితులు.. బీజేపీ అగ్రనేతలకు మాత్రం టెన్షన్ పుట్టిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com