వైసీపీ ప్లీనరీలోనే గౌరవాధ్యక్షురాలు రాజీనామా చేయడం వైసీపీ శ్రేణుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ప్లీనరీ పెట్టుకుంది.. లక్ష్యాన్ని దిశానిర్దేశం చేసుకోవడానికి అయితే.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడిన విజయమ్మ రాజీనామా అదే వేదిక మీద ప్రకటించడం చాలా మందిని నివ్వెర పరిచింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆమె కష్టపడ్డారు. బొత్స సత్యనారాయణ లాంటి వారు దారుణంగా మాట్లాడినా తట్టుకుని నిలబడ్డారు. అలాంటి బొత్స ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉంటే.. విజయమ్మ మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొన్నాళ్లుగా జగన్, విజయమ్మ మధ్య సంబంధాలు అంత సఖ్యతగా లేవన్న ప్రచారం జరుగుతోంది. దానికి అనేక ఉదాహరణలుకూడా కనిపించాయి. షర్మిల కుమారుడి గ్రాడ్యూయేషన్ డే్కి ఆమె అమెరికా వెళ్లారు కానీ.. జగన్‌తో పాటు పారిస్ వెళ్లలేదు. మనవరారి గ్రాడ్యూయేషన్ డే్లో పాల్గొనలేదు. అలాగే హైదరాబాద్‌లో వైఎస్ఆర్ స్మరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జగన్ తో పాటు వైసీపీ నేతలెవరూ హాజరు కాలేదు. ఇంకా చెప్పాలంటే మాటలు కూడా లేవని చెబుతున్నారు. ఇడుపుల పాయలో ఎప్పుడైనా ఎదురుపడినా పలకరించుకున్న సందర్భాలు తక్కువే ఉన్నాయి.
అందుకే ఇటీవలి కాలంలో ఆమె పెద్దగా తాడేపల్లిలో కనిపించడం లేదు. జగన్ ప్రమాణస్వీకారం సమయంలో ఆమె భావోద్వేగంతో కనిపించారు. అప్పట్లో చిన్న డిఫరెన్స్ కూడా లేదు కానీ తర్వాత మాత్రం పూడ్చుకోలేనంత గ్యాప్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గౌరవాధ్యక్షఫదవికి రాజీనామా చేస్తారని గతంలోనే ప్రచారం జరిగింది. ప్లీనరీ అయ్యేదాకా ఆగాలని జగన్ అడిగినట్లుగా కూడా మీడియా వర్గాలు ప్రచారం చేశాయి. విజయమ్మ ఎప్పటికైనా దూరం అవుతారని అనుకున్నారు కానీ రాజీనామా చేస్తారని అనుకోలేదు ఈ కారణంగా ఆమె దూరమవడం…వైసీపీకి షాక్ లాంటిదే.
ఇలాంటి షాకింగ్ న్యూస్ ప్రకటించడం శ్రేణులకు ఏ మాత్రం నచ్చడం లేదు. ఇది తప్పుడు సంకేతంగా వారు భావిస్తున్నారు. ప్లీనరీకి విజయమ్మ వస్తారని అందరూ సంతోషపడితే.. చివరికి ఇక శాశ్వతంగా పార్టీకి దూరమవుతారని అనుకోలేదు. ఇది ఖచ్చితంగా మంచి శకునం కాదని నమ్ముతున్నారు .