న్యూజిలాండ్‌తో టెస్ట్, వన్ డే సిరీస్‌లలో భారత్ ఆటగాళ్ళ ఆటతీరును పరిశీలిస్తున్న వాళ్ళకు ఓ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. టెస్ట్ సిరీస్ వరకూ చూసుకుంటే టీంలో ఉన్న ప్రతి ఆటగాడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, టీంని గెలిపించడానికి ప్రతిక్షణం రెడీగా ఉన్నాడు. టీం మెంబర్స్ అందరూ కూడా ఆటను ఎంజాయ్ చేయడంతో పాటు గెలవాలన్న కసితో ఆడేశారు. వ్యక్తిగా, ప్లేయర్‌గా, కెప్టెన్‌గా కోహ్లిలో ఉన్న లక్షణం అదే. ప్రతి క్షణం పూర్తి ఉత్సాహంగా ఉంటాడు. ఆటను అందరికంటే ఎక్కువగా ఇష్టపడతాడు. అదే స్థాయిలో కష్టపడతాడు. మరీ ముఖ్యంగా గెలుపులో ఉండే కిక్‌ని కోహ్లి ఎంజాయ్ చేసినంతగా ఇంకెవరూ ఎంజాయ్ చేయలేరేమో. తనలో ఉన్న ఉత్సాహాన్ని, హార్డ్ వర్కింగ్ నేచర్‌ని టీం మెంబర్స్ అందరిలోనూ కనిపించేలా చేయడంలో కోహ్లి సక్సెస్ అయ్యాడు. అందుకే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలన్నింటిలోనూ టీం ఇండియా అత్యంత పటిష్టంగా కనిపించింది. న్యూజిలాండర్స్కి ఆధిపత్యం చెలాయించే అవకాశం చాలా సార్లు వచ్చినప్పటికీ కోహ్లి గ్యాంగ్ పట్టువదల్లేదు. ఆట సాగుతున్న మూమెంటంని మార్చేసి న్యూజిలాండ్‌పైన ఒత్తిడి తీసుకురావడంలో ప్రతి సారీ సక్సెస్ అయ్యారు. చివరి టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి… చివరి వరకూ పోరాడతారని పేరున్న న్యూజిలాండ్ ఆటగాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ జీరో స్థాయికి వెళ్ళేలా చేయడంలో కోహ్లి అండ్ కో సక్సెస్ అయ్యారు. అందుకే చివరి ఇన్నింగ్స్‌లో టి-ట్వంటీ శైలిలో బ్యాటింగ్ చేసి బ్యాట్లెత్తేశారు న్యూజిలాండ్ వీరులు.
ఆ తర్వాత స్టార్ట్ అయిన వన్ డే సిరీస్‌లో కూడా మొదటి వన్ డేలో అదే రకమైన బ్యాటింగ్ చేశారు బ్లాక్ క్యాప్స్. కానీ ఆ తర్వాత తర్వాత మాత్రం న్యూజిలాండ్ ఆటగాళ్ళకు కాన్ఫిడెన్స్ రావడానికి ధోనీ కెప్టెన్సీనే కారణమయ్యింది. కోహ్లి స్టైల్లో న్యూజిలాండ్ పైన ఆధిపత్యం చెలాయించాలన్న కసి ధోనీలో కనిపించలేదు. కోహ్లి ఆటతీరు, నాయకత్వ శైలిలో పూర్తి కాన్ఫిడెన్స్, కమాండ్‌తో పాటు చాలా డైనమిక్‌గా ఉంటూ ప్రతి క్షణం గేం మూమెంటమ్ని తన చేతుల్లోనే ఉంచుకునేలా సాగుతోంది. కానీ ధోనీ తీరు మాత్రం కాస్త పాత తరహాగా ఉంటోంది. అసలు విషయం ఏంటంటే బంగ్లాదేశ్‌తో సహా ఇప్పుడున్న ఏ ఒక్క టీం కూడా బలహీనంగా లేదు. అన్ని జట్లూ స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. అన్ని టీమ్స్‌లోనూ సూపర్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. అలాంటప్పుడు నాయకత్వ వ్యూహాలు, నాయకత్వ శైలినే విజేతను డిసైడ్ చేస్తుంది. గేంలో స్పీడ్ పెరిగినట్టే ఇప్పుడు నాయకత్వ శైలిలో కూడా చాలా మార్పులు వచ్చేశాయి. ఒక సెషన్ అయిపోయాకో, కొన్ని ఓవర్ల గేం తర్వాతనో వ్యూహాలు మార్చుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి, ఆధిపత్యం అవతలి టీం చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ప్రత్యర్థి ఆటగాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో తర్వాత వరల్డ్ కప్‌లో టీం ఇండియా సత్తా చాటాలంటే అయితే ఎంఎస్ ధోనీ నాయకత్వశైలి మారాలి. లేకపోతే కెప్టేన్సీని కోహ్లికి అప్పగించి ఆటగాడిగా కొనసాగాలి. ఇప్పటివరకూ విమర్శకులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సూపర్ ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకున్న ధోనీ ఈ సారి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి మరి.