సినిమా ఇల్లయితే… టైటిల్ గుమ్మం లాంటిది. సినిమా పెళ్లయితే.. దానికి పెట్టే పేరు శుభలేఖ లాంటిది. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నట్టు… టైటిల్ చూసి, సినిమా చూడమంటారు పెద్దలు. టైటిల్ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఓ మంచి టైటిల్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలదు. ఆ సినిమా గురించి మాట్లాడుకొనేలా చేయగలదు. అయితే కొన్ని కొన్నిసార్లు టైటిళ్లే గుదిబండగా మారతాయి. నోరు తిరగని టైటిళ్లు, చాంతాడంత టైటిళ్లు.. గాభరా పెట్టేస్తుంటాయి. అలాంటి టైటిళ్ల వల్ల మైనస్సే. మంచి సినిమాలకు సైతం ఓపెనింగ్స్ రాకుండా చేస్తాయి.
ఈవారం విడుదలైన సినిమాల్లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఒకటి. ఇది అచ్చ తెలుగు సినిమా. కానీ ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టారు. ఆ కథలోంచి పుట్టుకొచ్చిన టైటిల్ కూడా. కాకపోతే… ఇలాంటి సినిమాకు అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది. టైటిల్ అర్థం కాక చాలామంది ఈ సినిమా వైపు చూడడం లేదు. నిజానికి ఈవారం విడుదలైన సినిమాల్లో ఈ సినిమాకే మంచి మార్కులు పడ్డాయి. చూసినవాళ్లంతా ‘బాగుంది’ అంటున్నారు. సున్నితమైన కథని, వినోదాత్మంగా డీల్ చేసిన దర్శకుడ్ని అభినందిస్తున్నారు. కానీ వసూళ్లు ఆశాజనకంగా లేవు. దానికి కారణం టైటిలే. ఈ సినిమా కోసం ‘జీలకర్ర – బెల్లం’, ‘సత్యనారాయణస్వామి వ్రతం’ ఇలాంటి అచ్చమైన పెళ్లి టైటిళ్లు కొన్ని అనుకొన్నార్ట. కానీ దర్శకుడు మాత్రం ‘నాకు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మాత్రమే కావాలి’ అని పట్టుపట్టాడట. దాంతో నిర్మాతలు కూడా కాదనలేకపోయారు. ‘పెళ్లి చూపులు’ స్టైల్ లో.. పెళ్లికి సంబంధించిన ఓ మంచి ఘట్టాన్ని టైటిల్ గా పెట్టి ఉంటే రిజల్ట్ మరింత బాగుండేది.
