మెంటల్ ముష్కరులతో ప్రపంచానికి ముప్పు

ఉగ్రవాదం ప్రపంచానికి కొత్త కాదు. కానీ ఐసిస్ ఉగ్రవాదులు ప్రపంచానికే సవాలుగా మారారు. ప్యారిస్ ఉగ్రదాడి వీరి మారణహోమంలో మొదటిదీ కాదు. చివరిదీ కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఐసిస్ మద్దతునిచ్చిన ముష్కరులు ఇదే ప్యారిస్ లో చార్లీ హెబ్దో వారపత్రిక కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపారు. ఇప్పుడు 7 చోట్ల దాడులు చేసి 150 మందికిపైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. ఫ్యాషన్ల రాజధానిగా పేరుపొందిన ప్యారిస్ ను మరుభూమిగా మార్చడానికి కిరాతకంగా ప్రయత్నించారు.

ఐసిస్ పగ్గాలు అల్ బాగ్దాదీ చేతికి వచ్చిన తర్వాత వికృత చేష్టలు శ్రుతిమించాయి. బందీల తలలు నరకడం, ఆ వీడియో ద్వారా ప్రపంచాన్ని భయపెట్టడం ఐసిస్ కిరాతక చర్యల్లో ఒకటి.

ఇంతకు ముందు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలుగా ఎల్ టి టి ఇ, అల్ ఖైదా పేరు పొందాయి. కానీ, వాటిని మించిన ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా ఐసిస్ మారింది. సిరియాలో ఐసిస్ ఏరివేత జరుగుతోందిగానీ అది సరిపోవడం లేదు. ఇరాక్ లో ఐసిస్ ఉగ్రవాదుల హాయిగా తమ పని తాము చేస్తున్నారు.

చమురు అక్రమ విక్రయం, కిడ్నాప్ లు, మహిళలను సెక్స్ బానిసలుగా అమ్మడం, ఇతర దందాల ద్వారా ఐసిస్ ముష్కరులు బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించారు. వాటిలో భయంకరమన మారణాయుధాలను కొనుగోలు చేశారు. అణు బాంబులను సమకూర్చుకోవడానికి ప్లాన్ చేశారు. రసాయనిక ఆయుధాలను వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇతర మతాలకు చెందిన వారిలో కనీసం 5 కోట్ల మందిని హతమార్చాలనేది అల్ బాగ్దాదీ కోరికట. ఇటీవల రష్యా విమానాన్ని కూల్చేసింది తామేనని ప్రకటించారు. వీలైనంత త్వరగా ఐసిస్ ముఠాను అంతం చేయకపోతే మానవాళికి అది వినాశకారిగా మారే ప్రమాదం ఉంది.

ప్రపంచాన్ని జయించడం ఐసిస్ ప్రధాన లక్ష్యం. ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడం, ఇతర మతాల వారిని అంతం చేయడం, చివరకు ప్రజాస్వామ్యాన్ని సమర్థించే వారిని శిక్షించడం ఐసిస్ సిద్ధాంతాలు. జీహాద్ పేరుతో ఛాందస వాద, రాక్షస పాలన సాగించడమే దీని లక్ష్యం. బందీలను చంపడం, మహిళలను, బాలికలను చెరబట్టడంతో వీరి అకృత్యాలు ఆగటం లేదు. ఇరాక్, సిరియాల్లోని చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. చర్చిలను నేలకూలుస్తున్నారు.

ఉగ్రవాదానికి కార్పొరేట్ కలర్ అద్దిన ఈ ముష్కరులు, పాశ్చాత్య దేశాల యువతను ఆకర్షిస్తున్నారు. వీరి ఆన్ లైన్ యాడ్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా, ఉగ్రవాద టూరిజం అనే కొత్త కాన్సెప్ట్ ను కూడా కనిపెట్టారు. తమ ఆధీనంలోని స్టార్ హోటళ్లు, రిస్టార్లుల్లో వారం రోజులు టూర్ చేసే అవకాశం ఉంది, రా రమ్మంటూ యూత్ ను ఆకర్షిస్తున్నారు.

కేవలం సిరియాలో కొన్ని ప్రాంతాల్లో అమెరికా, ఇతర దేశాలు వైమానిక దాడులు చేస్తే సరిపోదు. వివిధ దేశాల్లోని టెర్రరిస్టు గ్రూపులతో కూడా ఐసిస్ కు సంబంధాలున్నాయి. కాబట్టి, బహుముఖ వ్యూహంతో ఈ ఉగ్రవాద ముష్కరులపై విరుచుకుపడటం అవసరం. ఒకరకంగా చెప్పాలంటే ఈ రాక్షసులపై ప్రపంచ యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. చమురు విక్రయాలు, ఇతర దందాల ద్వారా రోజులు 30 లక్షల డాలర్లకు పైగా సంపాదిస్తున్న ఈ సంస్థ, ఏదో ఒక దేశం నుంచి అణు వార్ హెడ్లను సమకూర్చుకుంటే ఇక వినాశనమే. ఇప్పటికే పశ్చిమ యూరప్ లో ఐసిస్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఇటీవల వార్తలు వచ్చాయి. కాబట్టి ఐసిస్ అణ్వాయుధాలు సమకూర్చుకునే లోగా ఆ సంస్థను నామ రూపాల్లేకుండా చేస్తేనే మానవాళికి రక్షణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com